– కాంగ్రెస్ గ్యారంటీలను తెలంగాణ ప్రజలు నమ్మరు :రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్న భాషను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన గుణపారఠ చెబుతారని పేర్కొన్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాము రేవంత్ భాషలోనే సమాధానం చెప్పగలమని, అయితే తమకు సంస్కారం అడ్డొస్తున్న దని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు వచ్చి గ్యారంటీలు, డిక్లరేషన్లు ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇస్తున్న డిక్లరేషన్లుకు ఎవరు గ్యారంటీ అని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్, రేవంత్‌రెడ్డిలు అతిగా ఊహించుకుంటున్నారని, ఇద్దరూ రెండు చోట్లా ఓటమి పాలవ్వడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో మూడోసారి బీఆర్‌ఎస్ అధికారం చేపట్టనుందని ఆయన జోస్యం చెప్పారు.