ఉన్నత విద్యా విధానంలో మార్పులు అవసరం

– తెలంగాణ మేధావుల వేదిక
నవతెలంగాణ-బంజారా హిల్స్‌
రాష్ట్రంలో ఉన్న ఉన్నత విద్యా విధానం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక విధంగా, ప్రయివేటు డిగ్రీ కళాశాలలో మరొక విధంగా ఉండడంతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరటానికి ఆసక్తి చూపడం లేదని అందుకే ప్రభుత్వ నిర్దిష్ట విద్యా విధానాలు సడలించి విద్యార్థులను స్వతంత్రంగా సబ్జెక్టులను ఎంచుకునే విధంగా తోడ్పాటు అందించాలని తద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించేందుకు కషి చేయాల్సిందిగా తెలంగాణ మేధావుల వేదిక రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వీరస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కార్యదర్శి చింతకింది కుమారస్వామి, కోశాధికారి అక్కినపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన ప్రసంగించారు. తెలంగాణ మేధావుల వేదిక రాష్ట్ర కమిటీ నుంచి తాము ఐదు ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయంలో సమర్పించినట్టు తెలిపారు. అవి డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌లో బి.ఏ,బీకాం,బీఎస్సీ పేర్లను తీసేసి వాటన్నింటిని ఒక్క దగ్గరికి చేర్చి మొత్తం సబ్జెక్టులన్నిటిని ఒకే జాబితాగా చేయాలని, విద్యార్థులు తమకు నచ్చిన ఏవైనా మూడు సబ్జెక్టులను మొత్తం సబ్జెక్టుల నుంచి ఎంచుకునే విధంగా అవకాశం ఇవ్వాలన్నారు. మొత్తం డిగ్రీ చదువుకు ఒకే పేరుతో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ సర్టిఫికెట్‌ని ఇచ్చి విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టుల మార్కులన్నీ పొందుపరచాలని, డిగ్రీలో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీలో ఎంట్రన్స్‌ రాయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పారు. అలాగే ఎన్ని కోర్సులైన చదువుకొని స్కాలర్షిప్‌ పొందడానికి అవకాశం ఇవ్వాలని,మొత్తం పీజీ కోర్సులు అన్నిటిని ఒకే పేరుతో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ అని పొందుపరిచి ఎం.ఏ ఎం. కామ్‌ ఎం.ఎస్‌.సి పేర్లను తీసివేయాలి అని కోరారు. ఈ కా ర్యక్రమంలో ఉదరు కిరణ్‌,సుభాష్‌,యశ్వంత్లు పాల్గొన్నారు.