లోక్‌సభ నిబంధనల్లో మార్పులు

Changes in Lok Sabha Rules– వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులకు ఎంపీ ఐడీ బంద్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ నిబంధనల్లో మార్పులు చేశారు. ఇకనుంచి ఎంపీల వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులు.. డిజిటల్‌ సంసద్‌ పోర్టల్‌, యాప్‌ను యాక్సెస్‌ చేయడానికి వీలుండదు. సభలో ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవరకు ఎంపీలు అడిగిన ప్రశ్నల తాలూకూ సమాధానాలు బయటకు రాకూడదని లోక్‌సభ ఈ మేరకు పేర్కొంది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణ, ఓ వ్యాపారవేత్తకు లోక్‌సభ వెబ్‌సైట్‌ లాగిన్‌ యాక్సెస్‌ ఇవ్వడంపైనా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంతో లోక్‌సభ పై మార్పులను చేసింది. మహువా మొయిత్రా తన అధికారిక ఈమెయిల్‌ పాస్‌వర్డ్‌ను బయటివ్యక్తులకు షేర్‌ చేయడం నేరపూరితమైనదని ఎథిక్స్‌ కమిటీ తన నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ లాగిన్‌ వివరాలు ఇచ్చినట్టు మొయిత్రానే స్వయంగా అంగీకరించారు. అయితే తాను పార్లమెంట్‌లో అడగాల్సిన ప్రశ్నలు టైప్‌ చేయడానికి మాత్రమే ఆ వివరాలు ఇచ్చాననీ, ఓటీపీ తనకే వస్తుందని తెలిపారు. తాను నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించానంటూ విమర్శలను తోసిపుచ్చారు.
ఇదిలా ఉంటే.. ఈ మార్పుల నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘లోక్‌సభ నిబంధనల ప్రకారం.. గోప్యత అంటే ఆ సమాచారం ఎంపీకి మాత్రమే పరిమితం కావాలి. ఎంపీ ప్రశ్న అడిగినప్పుడు.. పార్లమెంట్‌ ప్రారంభం కావడానికి గంట ముందే వారికి సమాధానం వస్తుంది. ఈ సమాధానాలు స్టాక్‌ మార్కెట్‌, సంస్థలు, జాతీయ భద్రతపై ప్రభావం చూపుతాయి’ అంటూ తన ట్వీట్‌లో మొహువాపై విమర్శలు చేశారు.