భవిష్యత్‌ అవసరాల మేరకు ప్రతిపాదనల్లో మార్పులు

– టీవీవీపీ హాస్పిటళ్ల పై అస్కి ప్రతిపాదనలకు మంత్రి దామోదర సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను సెకండరీ హెల్త్‌ కేర్‌ డైరెక్టరేట్‌గా బలోపేతం చేయడానికి అడ్మినిస్ట్రేషన్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కి) రూపొందించిన ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. మంగళవారం మంత్రి టీవీవీపీ హాస్పిటళ్ల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్పుల సమయంలో ఓపీ, ఐపీ, బెడ్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం ఆస్పత్రుల్లో క్లినికల్‌, నాన్‌ క్లినికల్‌ స్టాఫ్‌ పాటర్న్‌ ఉండాలని తెలిపారు. అదనపు పోస్టుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సర్వీస్‌ మ్యాటర్‌, ఉద్యోగుల పదోన్నతుల్లో న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. వీవీపీని సెకండరీ హెల్త్‌కేర్‌ డైరెక్టరేట్‌గా మార్చడం కోసం రూపొందించిన ప్రతిపాదనలపై ఆస్కి కన్సల్టంట్స్‌ మంత్రికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.
చాలాచోట్ల డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్స్‌ టీచింగ్‌ హాస్పిటల్స్‌ కిందకు వెళ్లిపోయాయనీ, కొన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు వీవీపీ పరిధిలోకి వచ్చాయని అధికారులు మంత్రికి తెలిపారు. వీవీపీ పరిధిలోకి వచ్చిన పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు అవసరమైన స్టాఫ్‌తోపాటు, ఏమేం పరికరాలు అవసరమో ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి సూచించారు. జనరల్‌ మెడిసిన్‌, సర్జరీ, గైనిక్‌, పీడియాట్రిక్‌ వంటి బేసిక్‌ వైద్య సేవలు అన్నీ వీవీపీ హాస్పిటళ్లలో అందుబాటులో ఉండాల న్నారు. 85 శాతం మంది రోగులకు జిల్లాల్లోనే వైద్యం అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం అని, ఈ లక్ష్యం నెరవేరాలంటే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్‌ సెంటర్లలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు.
త్వరలో వరంగల్‌ హాస్పిటల్స్‌ పర్యటించనున్న మంత్రి
హన్మకొండలోని కాకతీయ మెడికల్‌ కాలేజీ, దానికి అనుబంధంగా ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్‌, టీబీ, కంటి దవాఖానాలపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సమీక్షించారు. ఎంజీఎం హాస్పిటల్‌లో రోగుల ఇక్కట్లపై ఆరా తీసిన మంత్రి, అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వాలు ఎన్నికోట్లు ఖర్చు చేసినా, అంతిమంగా ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులు, డాక్టర్లదేనన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలనీ, వాటిని పరిష్కరించే బాధత్య తమదన్నారు. ఏయే సమస్యలు ఉన్నాయో, ఏమేం అవసరాలు ఉన్నాయో రెండ్రోజుల్లో పూర్తి వివరాలతో ప్రతిపాదనలు అందించాలని మంత్రి ఆదేశించారు. కొత్త సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అందుబాటులోకి వచ్చే వరకూ ఇప్పుడున్న హాస్పిటల్స్‌లో రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలన్నారు. ఇందుకోసం అవసరమైన రిపేర్లు చేయించాలని అధికారులకు సూచించారు. పేషెంట్ల పట్ల సానుభూతితో, చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అధికారుల మధ్య సమన్వయ లోపం ఉండకూడదని తెలిపారు. త్వరలో స్వయంగా తానే ఎంజీఎంకు వస్తాననీ, అన్ని వార్డులు పరిశీలిస్తానని మంత్రి తెలిపారు. కేఎంసీ పరిధిలోని 5 హాస్పిటళ్లలో1,525 బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. ఇందుకు అనుగుణంగా ఏమేం కావాలో ప్రతిపాదనలు పంపాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సమావేశంలో హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ కర్ణన్‌, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్‌, డీఎంఈ (అకాడమిక్‌) శివరామ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.