దేశం పేరు మార్పునకు ఏకాభిప్రాయం అవసరం

Changing the name of a country requires consensusభారతదేశం అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భాన్ని పురస్కరించుకొని, రాష్ట్రపతి భవన్‌, ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’ కు బదులుగా ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ పేరుతో అధికారికంగా పంపిన ఆహ్వానం వివాదాస్పదం అయింది. ప్రస్తుత రాజకీయ వాతావరణానికి, పరస్పర అపనమ్మకాల ఉధతి, వివరించడానికి వీలుకాని తీవ్ర ప్రత్యపకారేచ్ఛ, అధికారం అనుభవిస్తున్న వారి ప్రతీకారేచ్ఛ తీవ్రత, దేశ భవిష్యత్తు గురించి విస్తతమైన ఆందోళనల లక్షణాలకు ఈ వివాదం అద్దంపట్టే విధంగా ఉంది.
ఈ ఆకస్మిక మార్పునకు సంబంధించి, ఇంతవరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి నుండి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రాష్ట్రపతి పేరుతో చాలా లాంఛనప్రాయమైన అధికారిక సమాచారంలోని ఆకస్మిక మార్పును దేశం ఊహించలేదు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో పేర్కొన్న విధంగా దేశం పేరును భారత్‌గా కూడా మార్చవచ్చు, అందువల్లే భారత్‌ అనే పదాన్ని ఉపయోగించారని అధికారపార్టీ సమర్ధకులు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో, దేశం పేరును భారత్‌ అని మార్పు చేయడానికి పార్లమెంటులో తీర్మానం చేయాల్సిన అవసరం ఉంటుందని ఇంకెవరో అన్నారు. వాస్తవానికి, మొన్న జరిగిన ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లోనే అది చేయాలని సూచనలు కూడా వచ్చాయి. భారత సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు కొంతమంది కూడా ఈ అభిప్రాయానికి తమ అంగీకారాన్ని తెలియజేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
దేశం పేరు మార్పు సమస్య, అది నిర్వహించబడుతున్న తీరును పరిగణలోకి తీసుకోవడానికి ముందు, రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా ఏ సమయంలోనైనా దేశం పేరును మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటుందనే విషయం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఏ నిబంధననైనా (ఆర్టికల్‌ 1లో పేర్కొన్న విధంగా దేశం పేరుతో సహా) సవరించే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 368 పార్లమెంట్‌కు కల్పిస్తుంది. కానీ ఈ పేరు మార్పు సమస్య సంబంధించినంతవరకు, ప్రజల్లో ఏ ఒక్కడూ తెలివైన వాడు కాదనే విధంగా (పేరుమార్పు) అపశృతి శబ్దం ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
రాజ్యాంగం ప్రకారం
కాబట్టి, రాజ్యాంగం ప్రకారమే దేశం పేరు మార్పుకు సంబంధించిన సమస్యను నిష్పక్షపాతంగా పరిశీలించి చూద్దాం. మొదటిది, రాష్ట్రపతి భవన్‌ నుండి బయటకు పోయిన ఆహ్వానం. ఆహ్వనంలో ”ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌” అనే పేరును ఉపయోగించారు. వాస్తవానికి, రాజ్యాంగ బద్ధంగా మాట్లాడితే, ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అనేది లేదు. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా ఉండాల్సిందేనని ఆర్టికల్‌ 52 చెపుతుంది. రాష్ట్రపతికి అధికారికంగా ఉపయోగించే పేరు, ”ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా”. ఆర్టికల్‌ 52ను తగిన రీతిలో సవరించకుండా ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా పేరును ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చకూడదు. కాబట్టి, ”ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌” అనే పదాలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 52కు అనుగుణంగా లేవనేది చాలా స్పష్టం.
”ఇండియా అనే భారత్‌, ఒక రాష్ట్రాల సమాఖ్య” అని ఆర్టికల్‌ 1 చెపుతుంది. ఈ పదాలు ఏవిధంగానూ, ‘ఇండియా’, ‘భారత్‌’ అనే పదాల పరస్పర మార్పును సూచించడం లేదు. ‘భారత్‌’ అనే పదాన్ని ‘ఇండియా’ అనే పదం స్థానంలో దేశ అధికారిక పేరుగా ఉపయోగించవచ్చనే అర్థాన్ని కూడా సూచించడం లేదు. వాస్తవానికి, ఆర్టికల్‌ 394ఏ కింద రాష్ట్రపతి అధికారం కింద ప్రచురించబడిన హిందీ భాషలోని రాజ్యాంగంలో తప్ప, ‘భారత్‌’ అనే పదాన్ని, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ లోనూ ఉపయోగించలేదు.
ఒకవేళ, ‘భారత్‌’ అనే పదాన్ని పరస్పరం మార్పుచేసుకోడానికి ఉపయోగించుకునే ఉద్దేశ్యం రాజ్యాంగ నిర్మాతలకే ఉండి ఉంటే, ఆర్టికల్‌ 393 ప్రకారం ఏర్పడిన అధికారిక భారత రాజ్యాంగంలోని కొన్ని భాగాలలో ఆ పదాన్ని ఉపయోగించి ఉండెడివారు. ఈ సందర్భంలో, ఆర్టికల్‌ 1లో ఉపయోగించబడిన ”ఇండియా, అనే భారత్‌” (ఇండియా దటీజ్‌ భారత్‌) అనే పదాల నిజమైన అర్థాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ‘దట్‌ ఈజ్‌’ అనే పదాలు, వాటికి ముందున్న ‘ఇండియా’ అనే పదాన్ని వివరిస్తాయి. అందువలన, ఇండియా అనే భారత్‌ రాష్ట్రాల సమాఖ్య అని ఆర్టికల్‌ 1 చెపుతుంది. హిందీ అనువాద భారత రాజ్యాంగం ”భారత్‌ అంటే ఇండియా” అని చెపుతుంది. దీనిని బట్టి, ఇండియాకు అనువాదమే భారత్‌ అని తెలుస్తోంది.
ఇంకో విధంగా చెప్పాలంటే, భారత రాజ్యాంగంలోని మూల గ్రంథంలో ‘భారత్‌’ అనే పదం స్వతంత్ర పదంగా నిలిచి ఉండదు. దీనిని కేవలం హిందీ అనువాద రాజ్యాంగంలో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ”ఈ అనువాద రాజ్యాంగం కచ్చితంగా మూల రాజ్యాంగంలోని అర్థాన్నే వివరించాలని” ఆర్టికల్‌ 394ఏ (2) చెపుతుంది. ఈ నిబంధన, భారత్‌ అనే పదం, మూల రాజ్యాంగంలో ఉపయోగించబడిన ‘ఇండియా’ అనే పదానికి అనువాదమనీ, చట్టబద్ధంగా దానిని మార్చేంతవరకు, దేశానికి ‘ఇండియా’ నే అధికారిక పేరని నొక్కి చెపుతుంది.
గందరగోళం
అధికారిక సమాచారంలో ”ఇండియా”కు బదులుగా ”భారత్‌”ను ఉపయోగించడంతో పెద్ద గందరగోళం సృష్టించబడింది. మన దేశానికి అధికారికంగా రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా అనే పేరు ఉంది. విదేశాలకు, అంతర్జాతీయ సంస్థలకు అధికారికంగా పంపించే సమాచారంలో ‘ఇండియా’ అనే పేరునే ఉపయోగిస్తారు. విదేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు, ఒడంబడికలు రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా పేరుతోనే జరుగుతాయి కానీ, రిపబ్లిక్‌ ఆఫ్‌ భారత్‌ పేరుతో జరగవు. ఒకవేళ భారత్‌ అనే పేరును పరస్పర మార్పుకు ఉపయోగించితే, విదేశీ ప్రభుత్వాలు మొత్తం గందరగోళంలో పడిపోతాయి. విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలతో కుదుర్చుకునే ఒప్పందాల్లో ఇండియాను రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియాగా చూపిస్తారు, కొన్నింటిలో రిపబ్లిక్‌ ఆఫ్‌ భారత్‌గా చూపిస్తారు. ఒక దేశం, ఒకే అధికారిక పేరును కలిగి ఉండొచ్చు. అది ఉంటే, ఇండియా లేదా భారత్‌గా ఉండాలి కానీ, రెండూ ఉండకూడదు.
”రాష్ట్రాల సమాఖ్యగా ఇండియా” ఉంటుందనే ఆర్టికల్‌ 1లోని మాటలు, రాజ్యాంగ ముసాయిదాలో ఉన్నట్లు రాజ్యాంగ పరిషత్‌ చర్చల అధ్యయనం తెలియజేస్తుంది. ఇండియాకు బదులుగా భారత్‌ను ఉపయోగించాలని అనేకమంది సభ్యుల అధిక ఒత్తిడి కారణంగా చర్చలు జరుగుతున్న సందర్భంలో భారత్‌ అనే పదాన్ని చేర్చారు. హెచ్‌.వీ.కామత్‌, కే.టీ.షా, సేఠ్‌ గోవింద్‌ దాస్‌, శిబ్బన్‌ లాల్‌ సక్సేనా లాంటి సభ్యులు అనేక సూత్రీకరణలను సూచించారు. కానీ, రాజీ మార్గంగా బీ.ఆర్‌.అంబేద్కర్‌ ”దట్‌ ఈజ్‌ భారత్‌ ” అనే పదాలను చేర్చాడు. మూల రాజ్యాంగంలో, పరస్పర మార్పులో భాగంగా ”భారత్‌”ను ఉపయోగించవచ్చని ఆయన ఒక్కసారి కూడా చెప్పలేదు.
ఒక దేశం పేరు మార్పు ఒక రాజకీయ పార్టీ యొక్క ఎజెండాగా ఉండకూడదు. వైవిధ్యం గల భారతదేశం లాంటి దేశంలో, పేరు మార్పుపై ఏకాభిప్రాయాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఏ మూలనున్న ప్రజలైనా దేశం పేరుతో మానసిక ఉద్వేగ సంబంధాలు కలిగి ఉంటారు. లేకుంటే అది కొన్ని వర్గాలలో పరాయీకరణ భావనను సృష్టిస్తుంది. భారతదేశ గత వలస నుండి విముక్తి కావాలన్న వింతైన ఆలోచన, రాష్ట్రపతి భవన్‌, పార్లమెంట్‌, అసెంబ్లీ భవనం లాంటి వలసవాద చిహ్నాలను ధ్వంసం చేయడానికి దారి తీసి, మొత్తం పరిపాలనా నిర్మాణాన్నే మార్చే పరిస్థితి ఏర్పడుతుంది. భారతదేశంలో ఉన్న మొత్తం రైల్వే వ్యవస్థ కూడా గత వలస పాలకుల చిహ్నమే.
భారతదేశ అధ్యక్షతన జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశ లక్ష్యమైన ”వసుధైవ కుటుంబం” ఆలోచనతో, కొత్తగా కనుగొన్న వలస వ్యతిరేక ఆధిక్యత నిజమనే అనిపిస్తుందా?
(”ద హిందూ సౌజన్యంతో”)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 984841245

పీ.డీ.టీ.ఆచారి