మారుతున్న వరంగల్‌ బల్దియా సమీకరణలు

మారుతున్న వరంగల్‌ బల్దియా సమీకరణలు–  కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు
–  బీఆర్‌ఎస్‌ బలం తగ్గితే..మేయర్‌కు గండమే..
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటంతో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారని శాసనసభ ఎన్నికల ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరితోపాటు మాజీ కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. దాంతో ‘పశ్చిమ’ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఎన్నికల కంటే ముందే బీజేపీ కార్పొరేటర్‌ కాంగ్రెస్‌లో చేరారు. త్వరలో వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. తాజాగా ఆరుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడంతో ఇప్పటికే నలుగురు కార్పొరేటర్లున్న కాంగ్రెస్‌ పార్టీ బలం.. ఇప్పుడు 12కు చేరింది. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల డివిజన్లున్నాయి. వాటిల్లో కార్పొరేటర్లు.. బీఆర్‌ఎస్‌కు 49 మంది, కాంగ్రెస్‌ నలుగురు, బీజేపీ 8 మంది, ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఈ బలాబలాలు క్రమక్రమంగా మారుతూ వచ్చాయి. ఎన్నికల సందర్భంలోనే వర్ధన్నపేట నియోజకవర్గంలో 1వ డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ అరుణాదేవి కాంగ్రెస్‌లో చేరగా, ‘తూర్పు’ నియోజకవర్గానికి చెందిన గుండేటి నరేందర్‌ కూడా కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలోని ఆరుగురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌, 9వ డివిజన్‌ కార్పొరేటర్‌ చీకటి శారద ఆనంద్‌, 31వ డివిజన్‌ కార్పొరేటర్‌ మామిండ్ల రాజు, 48వ డివిజన్‌ కార్పొరేటర్‌ సర్తాజ్‌ బేగం, 49వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఏనుగుల మానస రాంప్రసాద్‌, 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ కవితా కిషన్‌ కాంగ్రెస్‌లో చేరారు. వీరితోపాటు మాజీ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్‌, స్వామిచరణ్‌, వీరగంటి రవీందర్‌, నలుబోల శ్యాం తదితరులు చేరారు.
మేయర్‌కు పదవీగండం..
వరంగల్‌ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరుతుండటంతో బీఆర్‌ఎస్‌ బలం క్రమేణా తగ్గుతుంది. ఈ బలం మరింత తగ్గితే మేయర్‌ గుండు సుధారాణికి పదవీ గండం తప్పదు. మేయర్‌ తన పదవిని కాపాడుకోవడానికే మొగ్గు చూపితే భవిష్యత్తులో పార్టీ మారక తప్పకపోవచ్చని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ మారడానికి మొగ్గు చూపకపోతే పదవీ త్యాగం చేయాల్సి రావచ్చని భావిస్తున్నారు.