– హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో డెడ్‌ఎండ్ గోడను ఢకొీట్టిన రైలు
– ఆరుగురికి గాయాలు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. బుధవారం చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రైలు నాంపల్లి రైల్వే స్టేషన్‌లో డెడ్‌ఎండ్ గోడను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకెళ్తే.. బుధవారం చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు చెన్నై నుంచి ప్రయాణికులతో నాంపల్లికి వచ్చింది. రైలు నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే స్పీడ్ తగ్గినా.. ప్రమాదవశాత్తు డెడ్‌ఎండ్ గోడను ఢకొీట్టింది. దాంతో మూడు బోగీలు ఎస్2, ఎస్3, ఎస్6 పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా, వారిని వెంటనే లాలాగూడ రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రైలు నుంచి సికింద్రాబాద్‌లోనే చాలా మంది ప్రయాణికులు దిగిపోవడం, ప్రమాద సమయంలో చాలా తక్కువ స్పీడ్‌తో ఉన్న కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, లోకో పైలట్ నిర్లక్ష్యం కారణంగా రైలు పట్టాలు తప్పిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో మేజర్ గాయాలైన వారికి రూ.2 లక్షల చొప్పున, మైనర్ గాయాలైన వారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారాన్ని అధికారులు ఆస్పత్రిలో బాధితులకు అందజేశారు. రైలు ప్రమాదానికి గల కారణాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
రైళ్లను పునరుద్ధరించాం : సీపీఆర్‌ఓ రాకేష్
దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్, సీపీఆర్‌ఓ రాకేష్ ఈ ప్రమాదంపై స్పందించారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమా దంలో మూడు బోగీలు పట్టాల తప్పాయని తెలిపారు. ప్రమాదం అనంతరం నాంపల్లికి వచ్చే కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయినట్టు తెలిపారు. ప్రస్తుతం పట్టాలను సరిచేసి రైళ్లను పునరుద్ధరించినట్టు చెప్పారు.