ప్రపంచ మానవాళి విముక్తి కోసం… భౌగోళిక సరిహద్దులతో సంబంధంలేకుండా… అమెరికన్ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా… ఆఖరి క్షణం వరకూ పోరాడిన ధీరుడు, కోట్లాది మంది యువత గుండెల్లో నిలిచిన గెరిల్లా యోధుడు చే గువేరా. చే… అంటేనే ఒక గెరిల్లా విప్లవకారుడు, మనస్సున్న డాక్టర్, మహాకవి, గొప్ప రచయిత, ప్రాణం ఇచ్చే స్నేహితుడు, మిలటరీ వ్యూహకర్త, క్యూబా విముక్తి యోధుడు, చదరంగంలో గ్రాండ్ మాస్టర్, అన్నింటికీ మించి అమెరికా సామ్రాజ్యవాదులకు సింహస్వప్నం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కోణాలు చేగువేరాలో చూడవచ్చు. ఆయన జీవితం నేటి యువతరానికి ఆదర్శం.
చేగువేరా అర్జెంటీనాలోని రోసారియోలో 1928 జూన్ 14న ఎర్నెస్టో గువేరా లించ్, సెలియా దంపతులకు జన్మించాడు. బ్యూనస్ అఫ్ ఎయిర్స్ విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. 1949లోనే అర్జెంటీనాలో ఒంటరిగా, తర్వాత 1952లో మిత్రుడు ఆల్బర్ట్ గ్రినిడాతో కలిసి లాటిన్ అమెరికా మొత్తాన్ని మోటారు బైక్ యాత్ర ద్వారా చుట్టేశాడు. అప్పుడే అమెరికన్ సామ్రాజ్యవాద కంపెనీలు ప్రజలను ఎలా దోచుకుంటున్నాయో చేగువేరాకు అర్థమైంది. ఈ దోపిడీని అరికట్టాలని, పేద ప్రజలకు అండగా నిలబడాలని మోటారు సైకిల్ యాత్రలోనే ఒక నిర్ణయానికి వచ్చాడు. వైద్యుడిగా కొంతమంది రోగులకు వైద్యం చేసే బదులు సమాజానికి పట్టిన అత్యంత ప్రమాదకరమైన జబ్బును వదిలించాలనుకున్నాడు. ఇదే సమయంలో గ్వాటెమాలా దేశంలో జాకెబ్ అర్బేంజ్ ప్రభుత్వం ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకుందని అమెరికన్ సామ్రాజ్యవాదులు సీఐఏ కుట్ర ద్వారా ప్రభుత్వాన్ని కూల్చడాన్ని ప్రత్యక్షంగా చూశారు. అక్కడినుండి మెక్సికో చేరుకున్నారు 1955లో ఒక రాత్రి వేళ క్యూబాలో బాటిస్టా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవ సారథి ఫైడెల్ క్యాస్ట్రోతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాడు. ముందు డాక్టర్‌గా సాయుధదళంలో చేరాడు. 1956లో క్యాస్ట్రో రూపొందించిన సాయుధ తిరుగుబాటు పథకాన్ని అమలు చేయడానికి గ్రాన్మా అనే పడవలో చేగువేరాతో సహ 81మందితో గెరిల్లా పోరాటానికి క్యూబాకు బయలుదేరారు. గెరిల్లా పోరాటం సందర్భంగా దళానికి డాక్టర్‌గా బయలుదేరిన చేగువేరా పరిస్థితిని బట్టి ఫైటర్ అయ్యాడు. శత్రువుల వ్యూహాలను పసిగట్టి ఎత్తులకు పైఎత్తులు వేసి శత్రువు సైన్యాన్ని చిత్తుచేశాడు. అనతికాలంలోనే కమాండర్ అయ్యాడు. శాంతక్లారాలో తిరుగుబాటుతో బాటిస్టా ప్రభుత్వానికి చావుదెబ్బ తగిలింది. 1959లో క్యూబాలో విప్లవం విజయవంతమైంది. హవానాలో విజయోత్సవ ర్యాలీలో క్యాస్ట్రోతో కలిసి చే పాల్గొన్నాడు. క్యూబా ప్రభుత్వంలో పారిశ్రామిక విభాగం అధ్యక్షుడిగా, క్యూబా బ్యాంకు అధ్యక్షుడిగా, పారిశ్రామిక మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన లక్ష్యం ఇంతటితో ఆగదని ప్రపంచ దేశాలను విముక్తి చేయాలనే సంకల్పంతో 1965లో క్యూబా వదిలి కాంగో అక్కడ నుంచి టాంజానియా, జెకోస్లోవేకియాలో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. 1966లో బొలీవియా దేశంలో నాకహుజ్ ప్రాంతాల్లో సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. కంటి మీద కునుకులేని అమెరికా సామ్రాజ్యవాదులు ఎలాగైనా చేగువేరాను చంపాలని, లేకపోతే తమ ఆటలు సాగవని గ్రహించారు. 1967 అక్టోబర్ 9న లా హిగెయెరా పట్టణంలో ఒక చిన్న గదిలో చేగువేరాను బంధించి చంపారు అమెరికన్ సామ్రాజ్యవాదులు. చేగువేరాను భౌతికంగా లేకుండా చేసి చివరకు ఆయన శవాన్ని కూడా దొరకకుండా చేశారు. కానీ ఈ రోజు కోట్లాది యువత గుండెల్లో, ప్రశ్నించే ప్రతి గొంతులో, అన్యాయాన్ని ఎదిరించే ప్రతి పిడికిలిలో చేగువేరా స్ఫూర్తి కనిపిస్తోంది.
కేవలం 39ఏండ్ల వయసులోనే కార్మిక, కష్టజీవుల రాజ్యం కోసం, ఈ దోపిడీ సమాజాన్ని కూల్చేయడం మినహ మరో మార్గం లేదని నమ్మి దాని కోసం తన ప్రాణాలను సైతం బలిపెట్టాడు. అందుకే చేగువేరా అంటే విప్లవం, చేగువేరా అంటే చైతన్యం, చే గువేరా అంటే ప్రశ్నించడం, చేగువేరా అంటే సమానత్వం, చేగువేరా అంటే నియంతృత్వ పాలనకు చరమగీతం. క్యాస్ట్రో మాటల్లో చెప్పాలంటే చేగువేరా ఒక అసాధారణ సామర్థ్యం గల ఒక సేనాని. యుద్ధక్షేత్రంలో ఏ మాత్రం భయపడకుండా దూసుకెళ్లడం చేగువేరా సహజ లక్షణం. 1964లో చేగువేరా తన కూతురికి లేఖ రాస్తూ ఇలా అంటాడు… ప్రపంచంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా స్పందించగలగాలి. నేడు ఈ మాటే కోట్లాది మంది యువతకు ఆదర్శంగా మారింది. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, అణచివేతను యువత ప్రశ్నించాలి, తీవ్రంగా నిరశించాలి. చేగువేరా 95వ జయంతి సందర్భంగా ఆయనకు మనమిచ్చే నివాళి ఇదే. – జి. రామన్న