– సీఎంకు సంఘాల కృతజ్ఞతలు
నవతెలంగాణ-హైదరాబాద్
నీటి పారుదల శాఖలో ఎక్స్టెన్షన్లకు చెక్ పెట్టినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా ఉద్యోగ సంఘాల నాయకత్వం కృతజ్ఞతలు తెలియజేసింది. మాజీ ఈఎన్సీ నాగేంద్రరావుకు మళ్ళీ రెండో విడత ఎక్స్టెన్షన్ ఆపేసినందుకు అభినందనలు చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణ రాష్ట్రంలో గానీ తొలిసారిగా నీటి పారుదల శాఖలో ఎక్స్టెన్షన్లో ఒక్క ఉద్యోగి లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఎంతో కాలం నుంచి ఇంజినీర్లకు ప్రమోషన్లల్లో లబ్ది కలిగిస్తున్నందుకు, ప్రమోషన్ల్తో ఏర్పడ్డ ఖాళీలను తెలంగాణ నిరుద్యోగులతో భర్తీ చేసి హామీలను అమలు చేసినందుకుగాను ముఖ్యమంత్రికి దన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు ఏఎస్ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి గోపాల్ కష్ణ, తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఇరిగేషన్ డిప్లొమా ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.