– అమల్లోకి ఆన్లైన్ చెల్లింపులు
– సేవల్లో పారదర్శత కోసమే
– మొదట 42 రకాల సేవలకు
– ఆ తర్వాత మిగతా వాటికీ
నవతెలంగాణ – మల్హర్ రావు
మీసేవా కేంద్రాల్లో అధిక వసూళ్లను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.నూతన సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మీసేవ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులు మాత్రమే చేసేలా శ్రీకారం చుట్టింది. ఈ విధానం ఈ నెల 1నుంచి అమలులోకి వచ్చింది. మీసేవ కేంద్రాల్లో నిర్ణీత రుసుం కంటే నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్నట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విధానం అమలు చేస్తోంది.
మొదటగా 42 సేవలకు..
భూపాలపల్లి జిల్లాలో 47,మండలంలో 4 మీసేవ కేంద్రాలున్నాయి.అన్నింటి లోనూ క్యూఆర్ కోడ్ ఆధారిత పేమెంట్ విధానం అందుబాటులోకి వచ్చింది. మీసేవ కేంద్రాల్లో 350 రకాలకు పైగా సేవలు వినియోగదారులకు అందుతున్నాయి.ఇందులో మొదటగా రెవెన్యూ పరిధిలోని కమ్యూనిటీ అండ్ డేట్ అఫ్ బర్త్, నేటి విటీ, అర్పనేజ్ ఇంటిగ్రేటెడ్, నివాస ధ్రువీకరణ, ఆదాయం, ఈబీసీ, ఓబీసీ, మనీ లాండింగ్, నో ఆబ్జక్షన్, ఆపద్బంధు స్కీం, ఆయుధ లైసెన్స్ జారీ, క్రాకర్ స్టోరేజీ, ఎక్స్ ప్లోజివ్ మెటీరియల్ లైసెన్స్, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ లాంటి 42 సేవల్లో అప్లికేషన్ ఫీజుతో పాటు ఇతర నగదు చెల్లింపులను ట్రయల్ రన్గా క్యూఆర్ కోడ్ ద్వారా వినియోగ దారుడు పేమెంట్ చేసేలా నూతన పద్ధతిని అమలు చేస్తున్నారు. అయితే మూడు నుంచి ఆరు నెలల పాటు సక్సెస్ రేటును ప్రామాణికంగా తీసుకుని మిగతా సేవలకు ఈ విధానాన్ని అమలు పర్చనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
పెరగనున్న పారదర్శకత
విద్యార్థులకు నిత్యం అవసరమయ్యే కమ్యూనిటీ అండ్ డేట్ అఫ్, ఆదాయం సర్టిఫికెట్ ఆప్లికేషన్ కోసం రూ.45 చెల్లించాల్సి ఉండగా.జిల్లాలో చాలా మీసేవ కేంద్రాల్లో రూ.60 నుంచి రూ.70 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అధిక వసూళ్లకు చెక్ పడనుంది. అప్లికేషన్ ప్రాసెస్ పూర్త యిన వెంటనే ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం సదరు సెంటర్ నిర్వాహకుడికి కంప్యూటర్ ఫీజుకు సంబంధించిన క్యూ ఆర్ కోడ్ వచ్చిన వెంటనే దరఖాస్తుదారులు దానిని స్కాన్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది.కాగా అప్లికేషన్ కాపీతో కలుపుకొని ఐదు పేజీల వరకు (రెండు సైడ్ లు ఉంటె రెండున్నర పేజీలు) ఫీజు రేటులోనే స్కానింగ్ చేయాల్సి ఉంటుంది.అంతకు మించి పేజీలు పెరిగితే ఒక్కొక్క పేజీకి రూ.2 చొప్పున మాత్రమే అదనంగా చెల్లించాలి.