– ఓపీ రిజిస్ట్రేషన్ కు యాప్ తెచ్చిన కేంద్రం
– ‘అభ’ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు
– మొబైల్ కు వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్
– దవాఖానకు వెళ్లి సేవలు పొందేందుకు చాన్స్
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే రోగులకు సాంకేతికత దన్నుగా నిలుస్తుంది. వేగవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా ఆధునికతకు అధికారులు ప్రాధాన్యత కల్పించారు. అవుట్ పేషంట్ (ఓపి) నమోదు ప్రక్రియలో (అభ) ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు (ఈహెచ్ఎంఐఎస్) ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం విధానంలో రోగులు క్యూ పద్ధతిలో ఓపి చీటీలను తీసుకునే విధానం కొనసాగుతుంది. సాంకేతికతను మరింత సులభతరం చేసేందుకు నూతనంగా అభ యాప్ అందుబాటులోకి తెచ్చారు. దీంతోసర్కార్ దవాఖానల్లో ఓపీ కోసం క్యూ లైన్ లో నిలబడి గంటల కొద్దీ ఎదురుచూసే పరిస్థితుల కు ఇక చెక్ పడనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అభ యాప్ ద్వారా ఓపీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి దవాఖానకు కేటాయించిన ఒక క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి టోకెన్ నంబర్ పొందాలి. ఇందుకు మొదటిసారి ఆస్పత్రి కి వెళ్తే.. ఓపీ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ క్యూఆర్ కోడ్ ను ఫొటో తీసుకుని మొబైల్ సేవ్ చేసుకుంటే.. మరోసారి దవాఖానకు వెళ్లకుండానే ఇంటివద్ద నుంచే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రిజిస్టర్ అయి ఓపీ నంబర్ తీసుకోవచ్చు.
ప్రజల్లో అవగాహన లేక..
ఆయుష్మాన్భారత్ డిజిటల్ మిషన్ ద్వారా కేంద్రం (అభ) యాప్ను తీసుకొచ్చింది. దీనిని తెచ్చి చాలా రోజులు అవుతుండగా.. ప్రజల్లో సరైన అవగాహన లేకపోగా వినియోగించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. గత మూడు నెలల నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సేవలు అందుబాటులో ఉన్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తో పాటు నాగార్జునసాగర్, రామన్నపేట, దేవరకొండ, బోనగిరి, సూర్యాపేట, హుజూర్నగర్, మిర్యాలగూడ, దవాఖానల్లో యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్ప టికే ఆయా దవాఖానల నుంచి అభ నంబర్ పొందారు. యాప్ పై సరైన అవగాహన పెంచేందుకు దవాఖానల ఓపీ కౌంటర్ వద్ద సంబంధిత సిబ్బంది రోగులకు యాప్ గురించి అవగాహన కల్పిస్తున్నారు.యాప్ ను ఇన్ స్టాల్ చేసి రిజిస్టర్ చేస్తున్నారు. అయితే ఈ యాప్ ద్వారా రోగులకు సమయం ఆదా కావడమే కాకుండా మెడికల్ కార్డులు కూడాయాప్ లోనే లభిస్తాయి. పేషెంట్ కు కేటాయించిన అభ నంబర్ ఎంటర్ చేయడం చేస్తే డాక్టర్లు, రోగి మెడికల్ హిస్టరీ ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే పేషెంట్ కు డాక్టర్ మధ్య కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది.
ఇలా యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి
ముందుగా మొబైల్ ప్లే స్టోర్లోకి వెళ్లి (అభ) యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి. అనంతరం మొబైల్నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ నంబర్ ను ఎంటర్ చేయగానే ఒక యూనిక్ నంబర్ తో మన అభ కార్డ్ క్రియేట్ అవుతుంది. ఇంటర్ పేస్ లో కనిపించే స్కానర్, ఆప్షన్సె సేలెక్ట్ చేసుకోవాలి. కెమెరా, గ్యాలరీ నుంచి దవాఖాన స్కానర్ ను స్కాన్చేసి ఓపీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అనంతరం దవాఖానకు టోకెన్ నంబర్ వస్తుంది. దానిని ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద చూపించాలి. ఇలా దవాఖానలో క్యూలైన్ లో నిలబడాల్సిన అవసరం లేకుండా పేషెంట్ కు ఓపీ ఇస్తారు.