మహిళలకు లెక్కకు మించిన బాధ్యతలు.
ఇక పెండ్లి తర్వాత ప్రపంచమే మారిపోతుంది. అందుకే మగవాళ్లలా తమ చిన్ననాటి స్నేహాలను కొనసాగించలేరు. బాధ్యతల నడుమ తమ గురించి తామే మర్చిపోతుంటారు. ఇక స్నేహితలను ఎక్కడ గుర్తు పెట్టుకుంటారు. వారితో మాట్లాడే తీరికే ఉండదు. కానీ మనకు ఆనందాన్ని పంచేది.. అనుబంధాన్ని పెంచేది స్నేహం ఒక్కటే. స్నేహానికి కులం లేదు, మతం లేదు. స్నేహానికి హోదా లేదు. నవ్వు వెనుక బాధను.. మౌనం వెనుక మాటలను.. కోపం వెనుక ప్రేమను.. అర్ధం చేసుకునే వారే నిజమైన స్నేహితులు. నిజమైన స్నేహాన్ని గుర్తించండి, ఆ స్నేహం కలకాలం ఉండేలా కాపాడుకోండి. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహం గురించి కొందరు రచయితలు తమ మనసులోని భావాలు మానవితో ఇలా పంచుకున్నారు…
స్నేహానికి స్నేహమే సాటి
ప్రతి మనిషికీ స్నేహం అనేది సపోర్ట్ సిస్టమ్ లాంటిది. మంచి కుటుంబం, స్వచ్ఛమైన స్నేహం లభించిన వారికంటే అదృష్టవంతులు మరెవ్వరూ ఉండకపోవచ్చు ఈ ప్రపంచంలో. మంచి స్నేహం లభించిన వారు ఎక్కువకాలం ఆనందంగా జీవించే అవకాశం ఉందని ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి. కుటుంబంతో పంచుకోలేని అనేకానేక విషయాలు పంచుకునే స్వేచ్ఛ స్నేహితుల వద్ద ఉంటుంది కనుకే చాలా ఆనందంగా ఎక్కువకాలం జీవిస్తారనుకుంటా. నాకు బాల్యం నుంచీ మంచి స్నేహితులే దొరికారు. ఎక్కువగా ఆడపిల్లలే కావడంతో, వారంతా బాల్య వివాహాలతో అత్తగారిళ్ళకు వెళ్ళి పోయారు. స్కూల్ లైఫ్‌లో అయిదో తరగతి వారు పదో తరగతి లో లేరు. పదో తరగతి వారు ఇంటర్మీడియట్‌కు చేరలేదు. ఇంటర్‌లో కట్ అయిన వారున్నారు. ఇంటర్, డిగ్రీ దాకా చేరి డిగ్రీలో పెళ్ళిళ్ళతో వెళ్ళిపోయినవారున్నారు. నేను పుట్టి పెరిగిన గ్రామీణ వాతావరణమే ఇందుకు కారణం. ఈమధ్యే మా పదో తరగతి క్లాస్మేట్స్ టచ్‌లోకి వచ్చారు. ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత స్నేహం వెలితి బాగా కనిపించేది. జర్నలిజం… అందు లోనూ రిపోర్టింగ్ ఫీల్డ్‌లోకి వెళ్ళిన తర్వాత నా ప్రపంచ పరిధి విస్తరించడం మొదలైంది. నా వృత్తిలో చాలామంది స్నేహితులు లభించారు. చాలా ఏండ్లుగా చాలామందితో స్నేహం కొనసాగుతూనే ఉంది. గాఢ స్నేహం లేకున్నా, ఏదీ తాత్కాలికమైనది కాదు. సాహితీ ప్రపంచంలో మటుకు భావోద్వేగాలు అధికం. స్నేహితులు కూడా అటువంటి వారే. నాకు సాహితీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత తెలంగాణ సాహితి రూపంలో పెద్ద సపోర్ట్ సిస్టమే లభించింది. తొలుత సలీమాతో ఆ స్వచ్ఛమైన స్నేహం లభించింది. తర్వాత అనంతోజు మోహనకృష్ణ, తర్వాత ఆనందాచారి సర్.. ఆ తర్వాత అందరూ కుటుంబ స్నేహితులైపోయారు. మా సమూహంలోకి మేరెడ్డి రేఖ ఆలస్యంగా వచ్చినా తనస్నేహ మాధుర్యంతో చేరువయ్యారు. వీరందరితో లిమిట్లెస్ అంశాలు చర్చించగల స్వేచ్ఛ ఉంది. కరోనా మొదటి వేవ్ నుంచి నేనూ, నా కుటుంబం ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న అనేకానేక భావోద్వేగాలకు వీరినుంచి లభించే మద్దతు నాలోని స్థైర్యానికి మరింత ఊతమిస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ సాహితిని నాకు పరిచయం చేసిన, నన్ను తెలంగాణ సాహితికి పరిచయం చేసిన కవి, నేను అంకుల్ అని ప్రేమగా పిలుచుకునే కపిల రామ్ కుమార్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను.
– నస్రీన్ ఖాన్
ఓరిమి, క్షమ ఉంటేనే…
అస్తిత్వాలు,అంతరాలు అర్థమవుతున్న కొద్దీ స్నేహాలు నిలుపుకోవడం కష్టమైన పనే అవుతుంది. క్షమించడం, అర్థం చేసుకోవడమే కాక, ఎదిగే సమయాన్నివ్వడం, అప్పటిదాకా ఒకరినొకరు కనిపెట్టుకుని ఉండడమే స్నేహానికి సూత్రం. తరతమ బేధాలు లేకుండా, కులమత విద్వేషాలు లేకుండా ఇదివరకటి స్నేహాలు నడిచేవి. అందరూ కలిసి వేడుకలు చేసుకునే వాతావరణం అంతటి వివక్షలో నూ సాగేది. కాని ఇప్పుడు ఆర్ధికస్ధాయి బట్టే చదువులు, ఆ చదువులబట్టే ఉద్యోగాలు. పేద, ధనిక వర్గాలు కలిసి ఒకే విషయం నేర్చుకోవడం లేదా పని చేయడం అనే వాతావరణమే లేదిప్పుడు. సహజీవనం తక్కువవు తున్న కొద్దీ ఇద్దరి మధ్యా దూరం పెరిగిపో తోంది. మనలాగా ఆలోచించని వారంతా మన శత్రువులే అనుకునే ఈ సమయాల్లో స్నేహానికి చాలా ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఓరిమి, క్షమ ఈ రెండూ ఉన్న చోటనే స్నేహం మనగలుగుతుంది.
– అపర్ణ తోట
ఎన్నో అనుబంధాల కలయికే స్నేహం
స్నేహం గొప్పదా ప్రేమ గొప్పదా అని ఎవరైనా అడిగితే, ఎటువంటి సందేహం లేకుండా స్నేహమే గొప్పదని చెప్పవచ్చు. నిస్వార్థ మైన స్నేహం స్నేహితులని మరింత ముందుకు తీసుకెళ్తుంది. జీవితంలో స్నేహ బంధం అంత మధురమైనది. స్నేహం అంటే భుజం మీద చెయ్యేసి నడవటమే కాదు, నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనుకే నేనున్నానని భుజం తట్టి చెప్పడం. ఇలా మనం స్నేహం మీద ఎన్నో వింటూ ఉంటాం. సులభంగా లభించేది మోసం. కష్టంగా లభించేది గౌరవం. హృదయంతో లభించేది ప్రేమ. అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. స్నేహాన్ని వర్ణించటానికి తెలుగు భాషలోని పదాలు సరిపోవేమో.. అంత మధురమైనది స్నేహం. నిజమైన స్నేహం కష్ట కాలంలో తెలుస్తుంది అంటారు. ఇది అక్షర సత్యం. స్నేహం అనే భావనలో చేసిన అల్లరి, చిలిపి పనులు ఆనందించే అనుభవలెన్నో. స్నేహం అనే మాధుర్యంలో ఒకరిపై ఒకరు చూపించే శ్రద్ధ, తన పట్ల తాను అశ్రద్ధ వహిస్తే కోప్పడుతూ కురిపించే మమకారకెలేన్నో. స్నేహం అనే బంధంలో పంచుకునే బాధలెన్నో. నిజమే ఎప్పుడు మనసు కలత చెందినా, ఏ మాత్రం ఇతరుల వల్ల మనసు గాయపడినా స్నేహితులకు చెప్పుకుని ఓదార్పు పొందిన సంఘటనలు మనకు నిత్య జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. స్నేహం విలువ ఇప్పటి తరం వారికి తెలియటం లేదనే అనాలి. స్వార్ధంతో చేసేది నిజమైన స్నేహం కాదు. నమ్మకం, ధైర్యం, భరోసా, లాలన, ప్రేమ, అభిమానం ఇలా ఎన్నో అనుబంధాల కలయికే స్నేహం. మరిచే స్నేహం ఎప్పుడు చేకయకండి. అలాగే చేసిన స్నేహాన్ని మరువకండి. జీవితంలో నిజమైన స్నేహితుడిని వెతకడానికి ముందు మనం ఒక నిజమైన స్నేహితునిగా జీవించాలి. ఎలాంటి స్థితిలో అయినా నిన్ను అర్ధం చేసుకునేవారు, నువ్వు ఏ స్థాయిలో వున్నా నీతో ఉండేవారు, నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడే అసలైన స్నేహితుడు.
– పాలపర్తి సంధ్యారాణి
నమ్మకమే స్నేహానికి పునాది
‘మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉందామా’ అని అడిగింది ఆరవ తరగతిలో నా క్లాస్మేట్ శ్రావణి. ‘అంటే ఏం చేయాలి’ అనడిగితే ‘మనిద్దరమే కలిసి ఉండాలి. సీక్రెట్స్ చెప్పుకోవాలి, ఫుడ్ షేర్ చేసుకోవాలి, కలిసి ఆడుకోవాలి, ఒకే టీమ్‌లో ఉండాలి, ముఖ్యంగా వేరే ఎవరితో మాట్లాడకూడదు’ అని చెప్పింది. నేను రెండో రోజే ఆ పరీక్షలో విఫలమయ్యాను. ఒప్పందాలతో వచ్చిన బెస్ట్ ఫ్రెండ్‌ని కోల్పోయాను. పెద్దయ్యే కొద్దీ అర్థమైంది స్నేహితులు యాదృచ్ఛికంగా వచ్చి మనతో, మనలో పెనవేసుకుపోతారని. ఏండ్లుగా కలిసి పెరిగి జీవితకాలం ఉంటారనుకున్న స్నేహితులు చిన్న మనస్పర్ధలకే విడిపోవడం చూశాను. కేవలం తెలిసిన వారిగా ఉంటారనుకున్నవాళ్ళు వెన్నంటే ఉండడమూ చూశాను. అలాంటి స్నేహితురాలే నిత్యా మణికృష్ణన్. మా కథలో పెద్ద త్యాగాలు లేవు. ఒకరి కోసం ఒకరు చేసుకున్న సహాయాలూ లేవు. ఒకరికి ఒకరు తోడుగా ఉండడం తప్ప. మనకి అన్నీ ఉన్నా సలహాలు సూచనలు మంచీ చెడులు చెప్పేవారు ఉండకపోవడమే పెద్ద లోటు. ఆ లోటును 18 ఏండ్లుగా నా జీవితంలో పూరిస్తూనే ఉంది నిత్య. మనల్ని బాధ్యతతో ప్రేమించేవారు, సంరక్షించే కుటుంబం దొరికినా దొరకపోయినా జీవితం ముందుకు నడుస్తుంది. నమ్మకంగా అన్నీ చెప్పుకోగలిగే ఒక్క ఫ్రెండ్ లేకపోవడం దురదృష్టమే. ఆ బాధ నిజమైనది. కుటుంబం లేకపోయినా ఉండగలగడం మంచి ఫ్రెండ్ లేకపోతే ఉండలేకపోవడం అతిశయోక్తిగా అనిపించినా నీకంటూ ఓ నమ్మకమైన మనిషి లేకపోవడం బాధాకరమే. నాకెప్పుడూ ప్రేమకు మించింది స్నేహం అనిపిస్తుంది. మీరు గొప్ప ప్రేమికులుగా మిగిలారంటే మీలో నమ్మకమైన స్నేహితులున్నారని అర్థం. ఈ సందర్భంగా నా ఫ్రెండ్ నిత్యకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
– మానస ఎండ్లూరి