– ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు: ఉపముఖ్యమంత్రి భట్టి
– విశ్వసనీయతను నిలుపుకుంటాం : మంత్రి పొంగులేటి
– ప్రశాంత ఖమ్మాన్ని స్థాపిస్తాం : మంత్రి తుమ్మల
– మంత్రులకు జిల్లాల్లో ఘనస్వాగతం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆరు గ్యారంటీకు వారెంటీ లేదన్న పెద్దలకు చెంపపెట్టుగా ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదింట తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి తొలిసారి ముగ్గురు మంత్రులు ఆదివారం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా నాయకన్‌గూడెం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వారికి ఘనస్వాగతం పలికారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిని రూ.10లక్షలకు విస్తరింపజేస్తూ కూసుమంచి మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రారంభించారు. అనంతరం ఖమ్మం పాతబస్టాండ్‌లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ‘మహాలక్ష్మి’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తాను కలిసి ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లామని, ప్రతి ఇంటికీ చేరేలా మేనిఫెస్టోలో పొందుపర్చామని తెలిపారు. నాటి ప్రభుత్వ పెద్దలు ఆరు గ్యారంటీలకు వారెంటీ లేదని ఎద్దేవా చేశారని, కానీ ఇప్పటికే రెండు గ్యారంటీలను అమల్లోకి తెచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలకు అంకితం చేశామని, తమదీ ప్రజా ప్రభుత్వంగా అభివర్ణించారు. సంపదను సృష్టించడంతో పాటు దాన్ని ప్రజల కోసం వెచ్చిస్తామని స్పష్టంచేశారు. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ అన్ని అవకాశాలు ఉంటాయని, పోడు భూముల సమస్య, ఇండ్లు లేని వారికి గృహాల నిర్మాణం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మంత్రి పొంగులేటి, తుమ్మల మాట్లాడుతూ.. తమదీ ప్రజల తీర్పును అర్థం చేసుకునే ప్రభుత్వమని, వారిలో విశ్వసనీయతను నిలుపుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసి, రూ.5.50 లక్షల కోట్ల అప్పుతో తమకు పాలనను అప్పగించిందన్నారు. అయినా తాము హామీ ఇచ్చిన గ్యారంటీలను తప్పక అమలు చేస్తామన్నారు. రూ.85వేల కోట్ల అప్పుతో విద్యుత్‌శాఖను మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించారని, ఆర్థిక, విద్యుత్‌శాఖలనే రెండు ముళ్ల కిరీటాలను ఆయన భరించాల్సి ఉందన్నారు. వక్ఫ్‌భూములు, ఇతర భూములు, ధరణి సమస్యలను తీర్చి రైతులకు భరోసా ఇచ్చేలా మంత్రి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ, గృహ శాఖలను ఇచ్చారన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం నీటితో ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసి తన వ్యవసాయశాఖను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తానని చమత్కరిస్తూ మాట్లాడుకొచ్చారు. ఏ స్వేచ్ఛాయుత జీవనాన్ని కాంక్షించి కాంగ్రెస్‌కు పట్టం కట్టారో.. దానిని నెరవేర్చుతామని తెలిపారు. కబ్జాకోరులు, దందాల నుంచి విముక్తి కల్పించి ప్రశాంత ఖమ్మాన్ని స్థాపిస్తామని హామీ ఇచ్చారు.
ముగ్గురు మంత్రులకు గ్రాండ్ వెల్‌కమ్..
రాష్ట్ర మంత్రివర్గంలో ఖమ్మం జిల్లా నుంచి తొలిసారి ముగ్గురు మంత్రులుగా నియమితులైన నేపథ్యంలో వారికి ఆదివారం జిల్లా శివారు నాయకన్‌గూడెం నుంచి ఘనస్వాగతం లభించింది. భారీ గజమాలతో అభిమానులు మంత్రులను స్వాగతించారు. పాలేరు నియోజకవర్గంలోని నాయకన్‌గూడెం, కూసుమంచి, వరంగల్ క్రాస్‌రోడ్డు ప్రదర్శన సాగింది. ఖమ్మంలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.