
నవతెలంగాణ – పెద్దవంగర
విద్యార్థుల్లో దాగిన ప్రతిభను గుర్తించేందుకే పాఠశాల స్థాయిలో చెకుముకి టాలెంట్ టెస్ట్ ఎంతో ఉపకరిస్తుందని మండల నోడల్ ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు మండల స్థాయి చెక్‌ముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. విద్యార్థులు సృజనాత్మకతను, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కాగా మండల స్థాయిలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్ లో పెద్దవంగర, అవుతాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వీరిలో తెలుగు మీడియం నుండి పెద్దవంగర విద్యార్థులు నాని, సుప్రియ, రజిని ప్రథమ స్థానంలో, అవుతాపురం విద్యార్థులు అనుష్క, సిద్దు, బిందు ద్వితీయ స్థానంలో, ఇంగ్లీష్ మీడియం నుండి అవుతాపురం నుండి ప్రేమ్ కుమార్, సాయికుమార్, స్ఫూర్తి ప్రథమ స్థానంలో, పెద్దవంగర షామిని, ఎండీ ఆఫ్సార్, ఐశు ద్వితీయ స్థానంలో నిలిచారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హెచ్ఎం చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, అంజయ్య, సదయ్య, వెంకన్న, యాకన్న, హైమ తదితరులు పాల్గొన్నారు.