చెన్నై ఛమక్‌

– 77 పరుగులతో ఢిల్లీపై గెలుపు
– టాప్‌-2లో సూపర్‌కింగ్స్‌కు చోటు
– రుతురాజ్‌, డెవాన్‌ కాన్వే ధనాధన్‌
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌కింగ్స్‌ హవా కొనసాగుతుంది. ఎం.ఎస్‌ ధోని సారథ్యంలో ఆ జట్టు మరోసారి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 77 పరుగుల తేడాతో గెలుపొందిన ధోనీసేన.. పాయింట్ల పట్టికలో టాప్‌-2 స్థానం పదిలం చేసుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌తో క్వాలిఫయర్‌ 1 సమరానికి రంగం సిద్ధం చేసుకుంది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న జట్టుగా చెన్నై సూపర్‌కింగ్స్‌ ఎదురులేని రికార్డు నమోదు చేసింది!.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
చెన్నై సూపర్‌కింగ్స్‌ సూపర్‌ ప్రదర్శన చేసింది. లీగ్‌ దశలో తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 77 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్‌లో చోటుతో పాటు టాప్‌-2లో నిలిచి ఫైనల్స్‌కు చేరుకునే ప్రక్రియను మెరుగుపర్చుకుంది. డెవాన్‌ కాన్వే (87, 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (79, 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ధనాధన్‌ అర్థ సెంచరీలతో చెలరేగారు. ఓపెనర్ల వీరంగంతో తొలుత చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌ (86, 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. సూపర్‌కింగ్స్‌ పేసర్‌ దీపక్‌ చాహర్‌ (3/22), స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ (2/23) మ్యాజిక్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులకే పరిమితమైంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. సీజన్లో తొమ్మిదో పరాజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఓపెనర్ల వీరంగం
టాస్‌ నెగ్గిన సూపర్‌కింగ్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (87), రుతురాజ్‌ గైక్వాడ్‌ (79) అదిరే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు ఏకంగా 141 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. పవర్‌ప్లేలో 52/0తో నిలిచిన చెన్నై.. ఆ తర్వాత అదే దూకుడు కొనసాగించింది. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో రుతురాజ్‌ గైక్వాడ్‌ అర్థ సెంచరీ పూర్తి చేయగా.. మరో ఎండ్‌లో కాన్వే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 బంతుల్లో హాఫ్‌ సెంచరీ కొట్టాడు. ఓపెనర్లు ఇద్దరూ వికెట్‌కు ఇరువైపులా ఎడాపెడా బౌండరీలు బాదటంతో 11.2 ఓవర్లలోనే చెన్నై 100 పరుగుల మార్క్‌ తాకింది. ఓపెనర్ల నిష్క్రమణ తర్వాత శివం దూబె (22, 9 బంతుల్లో 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (20 నాటౌట్‌, 7 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) అదిరే ముగింపు అందించారు. దూబె మూడు సిక్సర్లు బాదగా.. జడేజా మూడు ఫోర్లతో సూపర్‌కింగ్స్‌కు భారీ స్కోరు అందించారు. ఎం.ఎస్‌ ధోని (5 నాటౌట్‌) క్రీజులోకి వచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. క్యాపిటల్స్‌ బౌలర్లలో ఖలీల్‌, నోకియా, సకారియలు తలా ఓ వికెట్‌ తీసుకున్నారు.
క్యాపిటల్స్‌ చతికిల
224 పరుగుల భారీ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ చతికిల పడింది. దీపక్‌ చాహర్‌, తుషార్‌ దేశ్‌పాండే దెబ్బకు పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు చేజార్చుకున్న క్యాపిటల్స్‌.. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఓ ఎండ్‌లో కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌ (86) అర్థ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. పృథ్వీ షా (5), ఫిల్‌ సాల్ట్‌ (3), రిలీ రొసో (0), యశ్‌ ధుల్‌ (13), అక్షర్‌ పటేల్‌ (15), ఆమన్‌ హాకీం ఖాన్‌ (7), లలిత్‌ యాదవ్‌ (6) విఫలమయ్యారు. దీపక్‌ చాహర్‌ (3/22) మూడు వికెట్లు పడగొట్టగా.. మహీశ్‌ తీక్షణ (2/23), మతీశ మతిరణ (2/22) రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ 146 పరుగులే చేయగా..77 పరుగుల తేడాతో చెన్నై గెలుపొందింది.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ : రుతురాజ్‌ గైక్వాడ్‌ (సి) రొసో (బి) సకారియ 79, డెవాన్‌ కాన్వే (సి) హకీం ఖాన్‌ (బి) నోకియా 87, శివం దూబె (సి) లలిత్‌ (బి) ఖలీల్‌ అహ్మద్‌ 22, ధోని నాటౌట్‌ 5, జడేజా నాటౌట్‌ 20, ఎక్స్‌ట్రాలు :10, మొత్తం : (20 ఓవర్లలో 3 వికెట్లకు) 223.
వికెట్ల పతనం : 1-141, 2-195, 3-195.
బౌలింగ్‌ : ఖలీల్‌ అహ్మద్‌ 4-0-45-1, లలిత్‌ యాదవ్‌ 2-0-32-0, అక్షర్‌ పటేల్‌ 3-0-32-0, నోకియా 4-0-43-1, కుల్దీప్‌ యాదవ్‌ 3-0-34-0.
ఢిల్లీ క్యాపిటల్స్‌ : పృథ్వీ షా (సి) రాయుడు (బి) తుషార్‌ 5, డెవిడ్‌ వార్నర్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరణ 86, ఫిల్‌ సాల్ట్‌ (సి) రహానె (బి) చాహర్‌ 3, రిలీ రొసో (బి) చాహర్‌ 0, ధుల్‌ (సి) తుషార్‌ (బి) జడేజా 13, అక్షర్‌ పటేల్‌ (సి) రుతురాజ్‌ (బి) చాహర్‌ 15, హకీం ఖాన్‌ (సి) అలీ (బి) పతిరణ 6, నోకియా నాటౌట్‌ 0, కుల్దీప్‌ యాదవ్‌ (ఎల్బీ) తీక్షణ 0, చేతన్‌ సకారియ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 146.
వికెట్ల పతనం : 1-5, 2-26, 3-26, 4-75, 5-109, 6-131, 7-144, 8-146, 9-146.
బౌలింగ్‌ : దీపక్‌ చాహర్‌ 4-0-22-3, తుషార్‌ దేశ్‌పాండే 4-0-26-1, మహీశ్‌ తీక్షణ 4-1-23-2, రవీంద్ర జడేజా 4-0-50-1, మతీశ పతిరణ 4-0-22-2.