– ప్రపంచ ర్యాపిడ్
– చాంపియన్‌గా తెలుగమ్మాయి
– కెరీర్‌లో రెండోసారి వరల్డ్ టైటిల్ వశం
చదరంగంలో కోనేరు హంపి (37) చరిత్ర సృష్టించింది. చైనా అమ్మాయి జు వెంజున్ తర్వాత అత్యధిక సార్లు ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ సాధించిన ఘనత దక్కించుకుంది. ఆఖరు రౌండ్లో ఇండోనేసియా గ్రాండ్‌మాస్టర్ ఐరిన్ సుకందర్‌ను ఓడించిన కోనేరు హంపి రెండోసారి వరల్డ్ ర్యాపిడ్ విజేతగా నిలిచింది.
నవతెలంగాణ-న్యూయార్క్ :
2024లో భారత్ చెస్‌కు మరో కిరీటం అందించింది. ఇటీవల దొమ్మరాజు గుకేశ్ ఫిడె ప్రపంచ చాంపియన్‌గా అవతరించగా.. తాజాగా తెలుగమ్మాయి కోనేరు హంపి (37) ఫిడె ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది. 2019లో తొలిసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ సాధించిన హంపి.. 2012లో మూడో స్థానంలో, 2023లో రన్నరప్‌గా నిలిచింది. వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్స్‌లో నాలుగుసార్లు టాప్-3లో నిలిచిన గ్రాండ్‌మాస్టర్ ఘనతను హంపి సొంతం చేసుకుంది.
పదో సీడ్‌గా మొదలెట్టి : కోనేరు హంపి వయసు 37. టోర్నీలో ఆమె సీడింగ్ 10. టైటిల్ రేసులో హంపిని ఎవరూ ఫేవరేట్‌గా పరిగణించలేదు. కానీ హంపి ర్యాపిడ్ రౌండ్‌లో రఫ్పాడించింది. ఆఖరు రౌండ్ ఆరంభానికి ముందు సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగిన హంపి.. చివరి రౌండ్‌లో అద్భుత విజయం సాధించింది. ఇండోనేషియా గ్రాండ్‌మాస్టర్ ఐరిన్ సుకందర్‌పై నల్ల పావులతో ఎత్తులు వేసి విజయాన్ని అందుకుంది. ఇతర గేముల్లో ఎవరూ ఫలితం రాబట్టలేదు. 8.5 పాయింట్లతో హంపి అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెంజున్ (8), లాగ్నో (8), టాన్ (8), ద్రోణవల్లి హారిక (8), అఫ్రూజ (8), అలెగ్జాండ్ర (8)లు 0.5 పాయింట్ల తేడాతో టాప్-7లో నిలిచారు. ఓపెన్ విభాగంలో రష్యా గ్రాండ్‌మాస్టర్‌లో వొలోడార్ మర్జీన్ (18) విజేతగా నిలిచాడు. అర్జున్ ఎరిగేశి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆఖరు రోజు నాలుగు రౌండ్లలో అర్జున్ రెండు పాయింట్లే సాధించాడు. 9 పాయింట్లతో నిలిచిన అర్జున్ క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించేందుకు రానున్న టోర్నీల్లో సత్తా చాటాల్సి ఉంది. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ డిసెంబర్ 31 నుంచి ఆరంభం కానుంది.
పదో సీడ్‌గా ఆడాను. కొందరు ప్రత్యర్థులది నా వయసులో సగం. తొలి రౌండ్లో ఓటమి ఎదురైనా పుంజుకున్నాను. కొన్ని గేముల్లో టై బ్రేకర్లలో ఓటమి బాధించింది. ఈ విజయం నాకు ఎంతో ప్రత్యేకం.
– కోనేరు హంపి