చేవెళ్ల రసవత్తరం..!

Chevella juice..!– బరిలో బలమైన నేతలు.. త్రిముఖ పోరు..!
– పోటాపోటీగా ప్రధాన పార్టీల హామీలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ ప్రాంతంలో మూడు ప్రధాన పార్టీల నుంచి బలమైన నాయకులు బరిలో నిలవడమే దీనికి కారణం. పోటీలో ఉన్నవారిలో ఇద్దరు.. ఈ ప్రాంతానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించగా.. ఒకరు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మెన్‌గా పనిచేశారు. దాంతో చేవెళ్లలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. అభ్యర్థులు ఎవరి బలాన్ని వారు నిరూపించు కునే పనిలో పడ్డారు. గెలుపు తమదంటే.. తమదని.. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్రిముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందోనని చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌కు సెంటిమెంట్‌గా ఉన్న చేవెళ్ల గడ్డపై హస్తం జెండా ఎగిరితే.. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తోందన్న ఆశతో ఆ పార్టీ ఉంది.దాంతో కాంగ్రెస్‌ నేతలు చేవెళ్లను కైవసం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.అందులో భాగంగానే బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకొని మరీ టికెట్‌ కేటాయించారు. కాంగ్రెస్‌ నుంచి ఇక్కడ గడ్డం రంజిత్‌రెడ్డి బరిలో నిలవగా.. సిట్టింగ్‌ ఎంపీగా, సౌమ్యుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఇక బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో నిలిచారు. గతంలో బీఆర్‌ఎస్‌ ఎంపీగా పనిచేసిన ఇతను ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీలో నిలిచారు. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా గెలవాలని భావిస్తున్న స్థానాల్లో చేవెళ్ల ముందు వరుసలో ఉంది. దాంతో ఇక్కడ పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఫోకస్‌ పెట్టింది. ఇక బీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే సిట్టింగ్‌ ఎంపీ పార్టీ మారడంతో బీసీ సామాజిక తరగతికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ను బరిలోకి దింపింది. బీసీ నేతగా పేరున్న కాసాని బరిలో ఉండటం, గతంలో రెండు సార్లు ఇక్కడ బీఆర్‌ఎస్‌ జెండా ఎగరడంతో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. చేవెళ్ల పార్లమెంట్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉండటం.. కలిసొచ్చే ఆంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
పోరులో తగ్గెదేలేదంటున్న త్రిమూర్తులు..
చేవెళ్ల పార్లమెంట్‌ బరిలో నిలిచిన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటా పోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీల ముగ్గురు అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు అన్నట్టు ధనబలంతో తలపడు తున్నారు. ఎన్నికల్లో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.ముగ్గురికీ గెలుపు ప్రతి ష్టాత్మకం కావడంతో నువ్వానేనా అన్నట్టు పోటీ పడు తున్నారు.కాంగ్రెస్‌ ఆరుగ్యారంటీలు, కేంద్రం లోని న్యారు పాంచ్‌ పేరుతో హామీల వర్షం కురిపిస్తోంది. ఉపాధి అవకాశాల కోసం పరి శ్రమలు తీసుకువస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి హామీలు ఇస్తున్నారు. బీజేపీ ‘మోడీ గ్యారంటీ’ పేరుతో యువతను అకర్షించేందుకు ప్రయత్నం చేస్తోంది.బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక మ్యాని ఫెస్టోను తయారు చేసి ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్జి కాసాని జ్ఞానేశ్వర్‌ గత పదేం డ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరుతున్నారు. ఈ త్రిముఖ పోరులో ఎవరిని విజయం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.