చేవెళ్ల చెల్లెమ్మ హవా సాగేనా..!

Chevella Chellemma Hava Sagena..!– ఓటమి ఎరుగని సబితమ్మ
– వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపు
– మరోసారి మహేశ్వరం నుంచి బరిలోకి..
– ఆంధ్రప్రదేశ్‌ తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు
– అప్పుడు.. ఇప్పుడు కీలక శాఖలకు బాధ్యతలు
– సబితమ్మను ఢకొీట్టేందుకు కేఎల్‌ఆర్‌, అందెల పోటీ
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఓటమి ఎరుగని నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సబితాఇంద్రారెడ్డి. అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి అనతికాలంలోనే తనదైన ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్‌ తొలి మహిళా హోంమంత్రిగా రికార్డుకెక్కారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్‌ క్యాబినెట్‌లో కీలక శాఖల మంత్రిగా పనిచేస్తూ ప్రత్యేక మార్క్‌ను చాటుకున్నారు. మరోసారి మహేశ్వరం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సబితాఇంద్రారెడ్డి బరిలో నిలిచారు. ఆమెను ఓడించేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. సబితమ్మ కూడా ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.
భర్త ఇంద్రారెడ్డి మరణంతో సబిత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. రాజకీయ అనుభవం లేని ఆమె 2000లో చేవెళ్ల ఉప ఎన్నికల్లో నిలిచి ఘన విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేవెళ్ల చెల్లెమ్మగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర క్యాబినెట్‌లో గనుల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో తనయుడికి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలన్న కారణంలో ఆమె దూరంగా ఉన్నారు. ప్రజలకు మాత్రం అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో భాగస్వాముల య్యారు. 2018లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆమె బీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌ క్యాబినెట్‌లో తొలి మహిళామంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
సబితమ్మకే విజయావకాశాలు?
మంత్రిగా ఐదేండ్ల కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం చేసిన సేవనే సబితాఇంద్రారెడ్డి విజయానికి మెరుగైన అవకాశాలని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా విద్యారంగాన్ని మెరుగు పర్చడం, సాంకేతిక విద్యారంగాన్ని మెరుగుపర్చడంలో సబితాఇంద్రారెడ్డి కృషి ఫలితాలను ఇస్తోందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలతో ఆమెకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు, అనుబంధం ఆమెకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.
ఆమెకు ప్రత్యార్థులుగా కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్‌ఆర్‌, బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ గట్టిగానే ఉంది. క్యాడర్‌ బలంగా ఉంది. కేఎల్‌ఆర్‌ నాన్‌ లోకల్‌ అనే ముద్రతో ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మహేశ్వరంతో ఇప్పటి వరకు ఎలాంటి సంబంధాలూ లేవని విమర్శిస్తున్నారు. అభ్యర్థి ఎలా ఉన్నా ఇక్కడ క్యాడరే కాంగ్రెస్‌ బలమని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు స్థానికుడు అయినప్పటికీ మతతత్వ ఎజెండాతో ముందుకు పోవడంతో క్షేత్రస్థాయిలో ఆదరణ లేదు. ఈ క్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, కేఎల్‌ఆర్‌ మధ్య ద్విముఖ పోరు ఉండనుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఓటమి ఎరుగని సబితమ్మ
ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మహేశ్వరం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఓటమి తెలియని సబితమ్మకు ఓటమి భయం చూపిస్తామని కాంగ్రెస్‌, బీజేపీ కంకణం కట్టుకున్నాయి. తన రాజకీయ చరిష్మాతో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తుచేయడంలో దిట్ట అనే పేరు ఆమెకుంది. ఆమెను ఢకొీట్టేందుకు బలమైన నాయకుడైన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గత ఎన్నికల్లో ఇంద్రారెడ్డి, సబితారెడ్డితో తలపడి ఓడిన వ్యక్తి. అయినా మరోసారి సబితమ్మతో తలపడేందుకు కాంగ్రెస్‌ పార్టీ కేఎల్‌ఆర్‌ను రంగంలోకి దింపింది. అయితే సబితారెడ్డికి పోటీగా కేఎల్‌ఆర్‌ను బరిలో నిలపడంతో తమ గెలుపు సునాయాసమైందని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. హస్తం నేతలు మాత్రం మంత్రిని ఢకొీట్టేది కేఎల్‌ఆరరే అని ధీమాతో ఉన్నారు.