కాసులు కురిపిస్తున్న చికెన్‌ వేస్ట్‌ దందా

Chicken waste danda pouring money– చేపలకు మేతగా వ్యర్థాలు
– కాలుష్యంలో నీలి సంపద
– బీఆర్‌ఎస్‌ హయాంలో లైసెన్స్‌లు
– మహబూబ్‌నగర్‌ నుంచి గద్వాలకు చికెన్‌ వేస్టేజ్‌
– గద్వాల నుంచి మహబూబ్‌నగర్‌కు చేపలు
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
చేప భోజనం రుచించని వారు ఉండరు. ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సైతం సలహా ఇస్తుంటారు. కొవ్వులేని ఆహార పదార్థంగా చేపల మాంసాన్ని ప్రతి ఒక్కరూ తినాలని డాక్టర్లు సూచిస్తారు. చెరువులు, రిజర్వాయర్లలో పెరిగే చేపలు అత్యంత రుచికరంగా ఉంటాయి. అయితే, అదంతా గతం.. ఇప్పుడు మొత్తం చెరువులు చికెన్‌ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. గద్వాల, అలంపూర్‌ ఇటిక్యాల ప్రాంతాల చెరువులలో చేపలకు ఆహారంగా చికెన్‌ నుంచి తీసిన వ్యర్థ పదార్థాలను వేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని వివిధ చికెన్‌ సెంటర్లలో నుంచి వ్యర్థ పదార్థాలను తెచ్చి గద్వాల పరివాహక ప్రాంతంలోని చెరువుల్లో కలుపుతున్నారు. దీనంతటికీ ఆయా రాజకీయ పార్టీల నేతల కక్కుర్తే కారణం. అవి తిన్న చేపలను మనుషుల తినడం వల్ల క్యాన్సర్‌కు దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యం పట్ల చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్‌ అధికారులు, నాయకులు ఆదాయమే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. చికెన్‌ వ్యర్థాలను చేపల చెరువుల్లో వేయడానికి కాంట్రాక్టు లైసెన్సులు జారీ చేసి లక్షలు ఆదాయం పొందుతున్నారు. నూతన మున్సిపల్‌ చట్టం 2019 ప్రకారం.. ఇండ్లు, దుకాణాలు, రెస్టారెంట్ల నుంచి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో డిస్పోసల్‌ చేయాలి. వ్యర్థాలను ధ్వంసం చేయడం పురపాలక సంఘం యొక్క బాధ్యత. పై నిబంధనలను అనుసరించి గతంలో మాజీ మంత్రి, మున్సిపల్‌ చైర్మెన్‌ ఆదేశాలానుసారం పట్టణంలో వెలువడే చికెన్‌ వ్యర్థాలను తరలించేందుకు సీడీఎంఏ అనుసరించి ఎండార్స్‌మెంట్‌ చేసి శాస్త్రీయ పద్ధతితో డిస్పోసల్‌ చేసేందుకు ఒక లైసెన్స్‌ హోల్డర్‌కు అనుమతిచ్చారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఆ లైసెన్స్‌ హోల్డర్‌ చికెన్‌ వ్యర్థాలను తరలించడానికి గద్వాల చేపల వ్యాపారికి సబ్‌ లీజుకు ఇచ్చారు. అందుకు నెలకు రూ.రెండు లక్షలు సదరు లైసెన్స్‌ హోల్డర్‌కు ఇస్తున్నట్టు సమాచారం. చెరువుల్లో ఆ వ్యర్థాలను వేయడానికి అటు చెరువుల కాంట్రాక్టర్లు, ఇటు దుకాణాదారులతో మాట్లాడుకున్నారు. చికెన్‌ షాపులకు నెలకు 20 నుంచి 50 వేల రూపాయలు చెల్లిస్తున్నట్టు తెలిసింది. ఆ వ్యర్థాలను తిన్న చేపలు వేగంగా బరువు పెరుగుతున్నాయి. ఆ చేపలే గద్వాల నుంచి మహబూబ్‌నగర్‌కు వస్తున్నాయి. వాటిని తినే వారు అనారోగ్యాలకు గురవుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే, ఆ లైసెన్స్‌ గడువు మార్చి వరకు ఉండగా.. దాని కోసం కాంగ్రెస్‌ నాయకులు మూడు నెలలుగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరం చేస్తున్నారని సమాచారం. కాగా, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ ఆనంద్‌ గౌడ్‌ ఈ విషయంలో చొరవ చూపి పాత లైసెన్సు రద్దు చేశారు. శాస్త్రీయ పద్ధతిలో శుద్ధిచేసి ఎరువు తయారు చేసే వారికే లైసెన్సులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
చికెన్‌ వ్యర్థ పదార్థాల కోసం విధివిధానాలు ఏమీ లేవు
షకీలా, మత్స్య శాఖ ఏడి – గద్వాల
చేపల చెరువులో చికెన్‌ వ్యర్థ పదార్థాలను వదులుతున్నారనేది మా దృష్టికి వచ్చింది. ఇలాంటి పదార్థాలు ఆహారంగా తీసుకున్న చేపలను తినడం అనారోగ్యమే. ఇలాంటి వ్యర్థాలను నియంత్రించాలనే విధివిధానాలు ప్రభుత్వం నుంచి మాకు ఏమీ రాలేదు. అయినప్పటికీ మా దృష్టికి రాగానే నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం.