చీఫ్‌ కోచ్‌ గంభీర్‌

Chief Coach Gambhir– ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి
– మూడున్నరేండ్ల పాటు కాంట్రాక్టు
ముంబయి : అందరూ ఊహించిందే జరిగింది. భారత మెన్స్‌ క్రికెట్‌ జట్టు తదుపరి చీఫ్‌ కోచ్‌గా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ నియమితులయ్యాడు. ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా మంగళవారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. టీమ్‌ ఇండియా సీనియర్‌ క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్‌.. ఐపీఎల్‌ ప్రాంఛైజీ కోల్‌కత నైట్‌రైడర్స్‌ సలహాదారు పదవి నుంచి తప్పుకున్నారు. మూడున్నరేండ్ల పాటు గౌతం గంభీర్‌ భారత జట్టు కోచ్‌గా కొనసాగనున్నాడు. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ విజయాన్ని అందించిన గురువు రాహుల్‌ ద్రవిడ్‌ చీఫ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ‘నా గుర్తింపు భారత దేశం. జాతీయ జట్టుకు పని చేయటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. భారత క్రికెట్‌ జట్టులోకి తిరిగి రావటం గర్వకారణం. ఆటగాడిగా, కోచ్‌గా నా లక్ష్యం ఒక్కటే. భారత క్రికెట్‌ జట్టు 140 కోట్ల భారతీయుల ఆశయాలను మోస్తుంది. ఆ ఆశలను నిజం చేసేందుకు నేను చేయగలిగేది చేస్తాను’ అని గౌతం గంభీర్‌ అన్నాడు. సుదీర్ఘ ఐసీసీ టైటిల్‌ కల సాకారం కావటంలో ముఖ్య భూమిక పోషించిన మాజీ చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, అతడి సహాయక సిబ్బందికి బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది. భారత జట్టు చీఫ్‌ కోచ్‌గా గౌతం గంభీర్‌ 2027 డిసెంబర్‌ వరకు పదవిలో కొనసాగనున్నారు. 2025 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ, 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సహా 2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లకు భారత్‌ గౌతం గంభీర్‌ చీఫ్‌ కోచ్‌గా వెళ్లనుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తే.. ఓవరాల్‌గా గంభీర్‌కు నాలుగు ఐసీసీ టైటిళ్ల వేట అవకాశం దక్కనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కెప్టెన్‌, మెంటార్‌గా గంభీర్‌కు మంచి రికార్డు ఉంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా 2012, 2014లో ఆ జట్టును చాంపియన్‌గా నిలిపిన గంభీర్‌.. 2024 ఐపీఎల్‌లో మెంటార్‌గా కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ముచ్చటగా మూడో టైటిల్‌ అందించాడు.