పాఠశాలలంటే? ఏడంతస్తుల భవనాలు, ప్రహరీ గోడలు, ఖరీదైన స్కూల్ యూనిఫామ్స్ కాదు. మానవ జీవితాలను తీర్చిదిద్ది, జాతి భవిష్యత్తును రూపొందించే జీవన నిలయాలు, చైతన్య కేంద్రాలు. మానవీయ విలు వల్ని పాదుకొలిపే ఆధునిక దేవాలయాలు. అలాంటి విద్యా విధానం కేరళ రాష్ట్రంలో ప్రత్యక్షంగా అధ్యయనం చేశాం.అక్టోబర్ 30,31న కోజికోడ్‌లో కేరళ బాల సంఘం ఏడో రాష్ట్ర మహాసభల సందర్భంగా సౌహర్ధ సందేశకులుగా వెళ్లాము. అక్కడ ప్రపంచ మంతా ఒకే కుటుంబమనే విశ్వజనీన భావనకు పట్టం కడతారు. చదువులే కాదు, ఆటాపాటలతో పాటు జీవిత పాఠాలను నేర్పుతారు. తరగతి గదుల్లోనే నిజమైన పౌరులను తీర్చిదిద్దుతారు.
మనిషి తత్వం, ప్రేమతత్వం, సోదరత్వం తోటివారికి తోడ్పడాలన్న ధృఢసంకల్పంతో ఏర్పడినదే కేరళ బాలసంఘం. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, జాతీయోద్యమ స్ఫూర్తితో ఉచిత ఆహారం, బస్సు సౌకర్యం, కుల, మత, ప్రాంత, భాష లింగ వివక్ష లేని ప్రపంచ శాంతి, ప్రకతి పర్యావరణ ఎజెండాగా, ఆకలి, అనారోగ్యం, పేదరికం, నిరుద్యోగం, సంపూర్ణ అక్షరాస్యత దిశగా.. బాలల హక్కుల్ని వివరిస్తూ అడుగులు వేసింది. పల్లెల్లో ఉన్న ప్రతి పిల్లవాడికి భరోసా అయ్యింది. బాల సంఘం కేరళ మొత్తం విస్తరించింది. 14 జిల్లాలలో 210 ఏరియాలలో 2,279 గ్రామాలలో 31,258 యూనిట్స్‌లో 13 లక్షల బాలలతో విస్తరించింది.
హరిపోటర్ నుండి అంతరిక్షం వరకు, గౌతమ బుద్ధుని నుంచి మహాత్మాగాంధీ వరకు, మాంటిస్సోరి నుండి గిజుబాయి వరకు ఎందరో మహానీయుల బాటలో బాల బాలికలను తీర్చిదిద్దుతున్నారు. అక్కడ పెద్దలు పిల్లలతో స్నేహం చేస్తారు. పిల్లలు చెప్పింది శ్రద్ధగా వింటారు. పిల్లల అభిప్రాయాలను తల్లిదండ్రులు పెద్దలు ఆచరించే సాంప్రదాయం వారి సంస్కతిలోనే ఉంది. ఆంగ్లభాషతో పాటు అన్య భాషలు ఎన్ని నేర్చినా.. పాలనలో బోధనలో మాతభాషపై మమకారం తగ్గలేదు.
కేరళ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ 2013లోనే ఉనికిలోకి వచ్చింది. బాల కార్మిక రహిత రాష్ట్రంగా బాల కార్మికుల అక్రమ రవాణాపై పోరాడేందుకు బాలల సంరక్షణ యూనిట్ ఏర్పడి, అక్రమ రవాణా, పిల్లలు యాచకత్వం, అర్ధాంతరంగా చదువు ఆపేసిన విద్యార్థుల సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిం చింది. డ్రాపౌట్స్ లేకుండా చూసే బాధ్యత చైల్డ్ హెల్ప్ డెస్క్, రెస్క్యూ ఫోర్స్ సహాయం సమన్వయంతో అధికారులు 24 గంటలు షిఫ్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. బాల కార్మికుల జాడ కోసం వారానికి మూడు రోజులు తనిఖీలు నిర్వహిస్తారు. బాల్యం ఒక హక్కు, పిల్లల చదువుల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించి ”బాల్యం బడిలోనే” ఉండాలి. కేరళ సమాజాన్ని ఒప్పించి తీర్మానం చేశారు. పాఠశాల మాత్రమే పిల్లలను పట్టించుకునే ఏకైక సంస్థగా గుర్తించింది. పిల్లల సర్వతోముఖా వికాసానికి తగినట్టుగా పాఠశాలలను అభివద్ధి చేసింది. అంతర్జాతీయ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. చదువుతోపాటు ఆటాపాటలు ఉంటాయి. ఆట స్థలాలు లేని స్కూల్స్‌కి అనుమతులుండవు. ప్రతి పాఠశాలలో పిఈటి, డ్రామా, స్క్రిప్ట్, డాన్స్ టీచర్ తప్పకుండా ఉండాలి. స్మార్ట్‌రూమ్స్ ఆధునిక విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు శిక్షణా తరగతులు ప్రణాళిక ప్రతి బిడ్డకు ఉపయోగపడాలి. సమాజం భాగస్వామ్యం కాకుండా కేవలం ప్రభుత్వ కషి ఫలితాలివ్వదు. అందుకే అన్ని రంగాల్లో ప్రజల భాగస్వామ్యంతోనే ప్రణాళికలు అమలు జరుగుతాయి.
పిల్లల మనోధైర్యానికి మార్షల్ ఆర్ట్స్ ప్రాచీన నత్యాలు, అర్థం కాని పాఠ్యాంశాలను కళారూపాల ద్వారా అర్థం చేయిస్తారు. ఆటాపాటలు నిత్యజీవితంలో భాగమే. ‘సమగ్ర’ అనే పోర్టల్ ద్వారా కేరళ విద్యాశాఖ వెయ్యికి పైగా ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ పాఠశాలలుగా మార్చి 45 వేల స్మార్ట్ రూమ్స్‌ను నిర్మించారు. లిటిల్ కైట్స్, ఐటి క్లబ్బులను, యూనిమేషన్స్, షార్ట్ ఫిలిమ్స్, సైబర్ భద్రత వంటి అంశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి విద్యార్థికి మధ్యాహ్నం భోజనం గుడ్డు, వారానికి ఒకరోజు చికెన్ మూడువేల మంది పిల్లలు ఒకేసారి కలిసి భోజనం చేసే డైనింగ్ హాల్, పేరెంట్స్ విజిటింగ్ హాల్, అతిపెద్ద కిచెన్, ఆధునిక సంగీత వాయి ద్యాల శిక్షణలు, ప్రతి స్కూల్లో ఇండోర్ స్టేడియం, విద్య ఒకటే కాదు, బహుళ వైవిద్య శిక్షణలతో, ఏ విద్యార్థికి ఏ రంగంలో ఆసక్తి ఉంటే? ఆ రంగంలో తమ ప్రతిభాపాటవాలు, ఉపాధి అవకాశాలు ఒక్కమాటలో చెప్పాలంటే? ఒక నిరుపేద విద్యార్థికి అంతర్జాతీయ స్థాయి విద్య ఉచితంగా అందుతుంది.
”వేనల్‌తుంబికల్” (వీధి నాటకాలు) ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలలో 210 బందాలు నాలుగువేల మంది బాల కళాకారులు బాలల సామాజిక సమస్యలపై లక్షలాది మందితో ప్రదర్శనలిచ్చి పెద్దలకు సైతం చైతన్యం కల్పిస్తారు. ఆటాపాటల్లో సత్తా చాటుతున్న వారిని చిన్న వయస్సులోనే చేెరదీసి ప్రోత్సహిస్తున్నారు. శిక్షణలిచ్చి విశ్వ క్రీడల్లో విజేతలుగా నిలబెడుతున్నారు. వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్‌లు, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
మలయాళంలో బాల సాహిత్యా అకాడమీ ఏర్పడి, రచనలు, ముద్రణలు అక్కడి నుంచి వెలువడుతాయి. పుస్తక పఠనం, ప్రతి ఇంట్లో లైబ్రరీ, క్యాంపెయిన్ నిర్వహించి పఠనాసక్తిని పెంచుతారు. బాలల కార్యక్రమంలో కుటుంబాలు, పెద్దలు పాల్గొంటారు. రాజ్యాంగ పీఠికను చదివించడం బాలల అసెంబ్లీ, పార్లమెంటు కార్యక్రమాలు, లౌకిక, మానవత్వ, సమతా మమతల పండుగలు, వన భోజనాలు నిర్వహిస్తారు. సూర్య, చంద్ర గ్రహణాలు మూఢనమ్మకాలను సవాల్ చేస్తూ.. పదివేల మంది పిల్లలు రోడ్లు మీదికొచ్చి గ్రహణాన్ని వీక్షించారు. సైన్స్ వండర్ షోలతో కొత్త విషయాల్ని నేర్పిస్తారు. ఈ ప్రపంచం పిల్లలదే, ఎదగడానికి ఎల్లలు లేవు. విజ్ఞాన ఆధారిత సమాజ నిర్మాణంలో కేరళ ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నది.
భూపతి వెంకటేశ్వర్లు
9490098343