ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి..

– తంగళ్లపల్లి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ 
– జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ప్రభుత్వ వైద్యశాలల్లోనే 75 శాతం ప్రసవాలయ్యేలా చూడాలని వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు తంగళ్ళపల్లి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీ.హెచ్.సీ) కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీ.హెచ్.సీ ఆవరణలో గడ్డి, నిరుపయోగ మొక్కలు పెరగడంతో వాటిని తొలగించాలని ఎం.పీ.ఓ.ను ఆదేశించారు. పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. సీసీ కెమెరాలకు మరమ్మత్తు చేయించి, వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. అనంతరం పీ.హెచ్.సీ లోని ఓ.పి. ఇతర రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ల్యాబ్, ఫార్మసీ ఆయా గదులను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ దవాఖానల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై గర్భిణీలకు అవగాహన కల్పించాలని 75 శాతానికి పైగా ప్రసవాలు ఇక్కడే జరిగేలా చూడాలని ఆదేశించారు. గర్భిణీలు ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవించేలా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది చూడాలన్నారు. ఏ.ఎన్.ఎం., ఆశా కార్యకర్తలతో నిత్యం సమావేశం ఏర్పాటు చేస్తూ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అఫిజా బేగం సిబ్బంది పాల్గొన్నారు.