‘పాపం పుణ్యం ప్రపంచ మార్గం… కష్టం సౌఖ్యం శ్లేషార్ధాలూ… ఏమీ ఎరుగని పూవుల్లారా… ఆకసమున హరివిల్లు విరిస్తే… అవి మీకే అని ఆనందించే… కూనల్లారా’ అంటూ కల్మషమెరుగని బాలల గుర్తించి ప్రస్తావించారు మహాకవి శ్రీశ్రీ. ‘నా సర్వస్వం నీకిచ్చేస్తా… నా బాల్యం నాకు ఇచ్చెయ్యరు’ అని అడుగుతారు సినారె. అంటే బాల్యం అంత మధురమైనది. కష్టసుఖాలు ఎన్నున్నా సంపూర్ణ ఆరోగ్యంతో… విజ్ఞానవంతులు కావాలి బాలలు అని కోరుకున్నారు ఆ మహానుభావులు. పిల్లలు దేశ భవితకు వనరులు, వారధులు, ఆశాదీపాలు. వారి శ్రేయస్సే దేశాభివృద్ధికి మూలం. అందుకే అంటారు… ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని.
అటువంటి బాల్యాన్ని ఆనందంగా, ఆరోగ్యవంతంగా అనుభవించడం ప్రతి చిన్నారి జన్మహక్కు. ఎవరికైనా బాల్యం ఒక అందమైన జ్ఞాపకం. మనిషి వ్యక్తిత్వం బాల్యాన్ని పెనవేసుకునే వికసిస్తుంది. మనిషిగా ఎంత ఎదిగినా బాల్యపు జ్ఞాపకాలు, అనుభవాలు అప్పుడప్పుడు తట్టి లేపుతూనే వుంటాయి. అమ్మ లాలిపాట, గోరుముద్దలు, నాన్న మురిపెం, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల గారాబాలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అత్తామామల ప్రేమానురాగాల మధ్య బాల్యం ఆనందంగా గడిచిపోతుంది. అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
నేడు ఎంతమంది జీవిత పుస్తకంలో బాల్యం రంగులద్దిన పుటగా చోటుచేసుకుంటోందన్నది అందరం వేసుకో వలసిన అతి ముఖ్యమైన ప్రశ్న. ఈనాటి చదువు గుదిబండగా మారి బాల్యాన్ని కబళించేస్తోంది. ఆటలు, పాటలు కనుమరుగైపోయాయి. పిల్లలు ఏకాకులవుతున్నారు. చిన్న వయసులోనే కండ్లద్దలు అమరి, ఒంటికి దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుకొంటున్నాయి. మానసిక ఒత్తిడి వారి అనుభవంలోకి వస్తోంది. లేత మనసులను మొగ్గ దశలోనే తుంచివేస్తున్నారు.
అయితే నేటి సమాజంలో బాల్యం అంటే రంగురంగుల అనుభూతులే కాదు, మింగుడుపడని విషాదాలూ వుంటున్నాయి. వారి ప్రమేయం లేకుండానే అనుభవించక తప్పని కష్టాలూ వుంటాయి. అమ్మమ్మ, నానమ్మ ఇళ్లల్లో ఆటపాటల మధ్య సాగిపోయే బాల్యం నేడు ఒంటరిపాలైంది. కుంచించుకుపోయిన కుటుంబ వ్యవస్థలో, ఇరుకు ఇళ్ళలో, పలకరింపులు కూడా మరిచి, ప్రపంచీకరణ వలలో చిక్కుకుపోయిన తర్వాత అందమైన బాల్యం, బాల్య స్నేహాల బంధమెక్కడిది? స్మార్ట్ ఫోన్ల మధ్య బంధీ అయిపోయింది. నేరాల్లో పసి వయసు పాత్ర క్రమంగా పెరుగుతోంది. మొక్కగా ఉన్న దశలో సరైన విధంగా శిక్షణ ఇవ్వకపోతే తర్వాత పశ్చాత్తాపపడినా ఉపయోగం లేదు. మనిషి జీవితంలోని నాలుగు దశల్లో కీలకమైన బాల్యం కుంటుపడితే మిగిలిన దశలన్నీ గాడి తప్పుతాయన్న ఎరుక కలిగి ఉండాలి. అప్పుడు పొరపాటు చేయం, పశ్చాత్తాపపడం. పరిపూర్ణ జీవితం ఆసాంతం రేపటి తరం సొంతం అవుతుంది.
పెరుగుతున్న ఆర్థిక భారాలతో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. పిల్లల మంచిచెడ్డలు చూడడమూ కష్టతరమౌతోంది. ఏ బిడ్డకైనా తల్లి తొలి గురువు. తల్లిదండ్రులతో పాటు పెద్దలు నేర్పిన నీతి, బాధ్యతలు మంచి పౌరులుగా ఎదగడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వాలు కనీస మౌలిక వసతులను కల్పించాలి. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం, మౌలిక వసతులు కల్పించడం మన బాధ్యత. ‘మీదే మీదే సమస్త విశ్వం… మీరే లోకపు భాగ్యవిధాతలు.. మీ హాసంలో మెరుగులు తీరును.. వచ్చేనాళ్ల విభాప్రభాతములు.. అని శ్రీశ్రీ అన్నట్టు చిన్నారుల మోమున హాసం మెరిసినప్పుడే నిజమైన ‘బాలల దినోత్సవం’.