బాలలే మానవాళి భవిష్యత్తు.!

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
పిల్లల గురించి ఆలోచించడమంటేనే దేశ భవిష్యత్తు గురించి యోచించడం మార్పు ఏదైనా మొదట పిల్లల నుండే రావాలి. ఆ ఆలోచన నుండే ఇందూరు బాలోత్సవం అంకురించింది. రేపటిపౌరుల ఉత్సాహ వేదికగా చదువుల పండుగ ను ప్రతి యేడు క్రమం తప్పకుండా నిర్వహించాలని సోదరత్వం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా చెట్టా పట్టాలు వేసుకుని బాలలంతా బారులు తీరే ఇందూరు బాలోత్సవ పిల్లల జాతరకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మన పిల్లల్లో దాగిన అద్భుత అసమాన ప్రతిభా పాఠవాలకు వేదికగా ఈ పండుగను నిర్వహిస్తున్నాము అని అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, ప్రధాన కార్యదర్శి రామారావు, కోశాధికారి రామ్మోహన్రావు శుక్రవారం తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు ఇది మనము పాఠశాల స్థాయి నుండి విన్న, వింటూ ఉన్నమాట. మనము బాలల స్థాయి నుంచి పౌరులము అయ్యాము. మంచి పౌరులము అయ్యాము. కానీ మన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే సంఘటనలు, దేశ ప్రగతి, వీటిని విన్నప్పుడు, చూసినప్పుడు ప్రతి ఒక్కరం స్పందిస్తాం. ఉండకూడనివేవో ఈ పౌర సమాజంలో ఉన్నాయి. అవసరమైనవి తక్కువగా ఉన్నాయి. ఈ సమాజంలో ఉండకూడనివి. ఉదాహరణకు: అవినీతి, మూఢనమ్మకాలు, మత్తు మరియు మద్యం, రోడ్డు యాక్సిడెంట్స్, అత్యాచారాలు, మహిళల పట్ల వివక్షత, కుల, మత వివక్షతలు, అంటు వ్యాధులు, అనారోగ్యం, అవిద్య, క్రమశిక్షణ రాహిత్యము. ఇలా అనేకం అంటే మన విద్యా వ్యవస్థలో లోపం ఉంది. పాఠశాల స్థాయిలో నేర్పవలసిన అంశాలు సరైన పద్ధతిలో నేర్పడం లేదు. ఆడుతూ, పాడుతూ విద్య నేర్చుకోవాలి. అది తనకు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అందుకే చీకటిని తిడుతూ కూర్చోకుండా మన వంతు బాధ్యతగా పండుగ వాతావరణంలో విద్యార్థులకు సరైన ఆలోచన విధానంతో కూడిన కార్యక్రమాలు రూపకల్పన చేద్దామనే భావాన లోనుంచి పుట్టినదే బాలోత్సవం. గతంలో జన విజ్ఞాన వేదిక పక్షాన అనేక బాలోత్సవాలు నిర్వహించిన అనుభవం మనకుంది. ఈ బాలోత్సవం లక్ష్యం. ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథం, మానవత, సంస్కరణాభిలాష, పరిశీలన స్వభావం పెంపొందించుకోవాలి. ఈ లక్ష్యంలో భాగస్వాములమవుతున్నందుకు మనమంతా ఆనందించాలి. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 2 వ వారంలో నిజామాబాద్ నగరంలో నిర్వహించ తలబెట్టిన ఈ బాలోత్సవాన్ని విజయవంతం చేసేందుకు సహకరించవలసిందిగా కోరుతున్నామన్నారు.