
– కలెక్టర్ నారాయణ రెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పిల్లలకు విద్యతోపాటు, విలువలను నేర్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రధానోపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డివిఎం ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో నిర్వహించిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు విద్యాబుద్ధులు ఇవ్వాలని ఆస్తులు కాదని, దానిని పరిపూర్తి చేసేది ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ప్రభుత్వ రంగంలో అనేక సమస్యలు ఉంటాయని వాటిని పరిష్కరించుకుంటూ ఉన్న వనరులతో మంచి విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు తరాన్ని తయారు చేసే వారని, ఏ ఉద్యోగంలో లేనంత సంతృప్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటుందని, అందువల్ల కష్టపడి పనిచేసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నారు. గతంలో పాఠశాలలు ఉండేవి కావని, చెట్ల కింద, గుళ్లో గురువులు పాఠాలు చెప్పేవారని, వాటిని గుర్తుతెచ్చుకొని కష్టపడి పనిచేస్తూ విద్యార్థులు సైతం కష్టపడి నేర్చుకునే విధంగా తయారు చేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కష్టపడే మనస్తత్వాన్ని ప్రాథమిక పాఠశాల దశ నుండే నేర్పించాలని, సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం బాధాకరమని, ఈ పరిస్థితులలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు పూర్తి కట్టుదిట్టంగా నిర్వహిస్తామని ఆ విధంగా విద్యార్థులను తయారు చేయాలని తెలిపారు.ప్రజలకు లబ్ధి కలిగేలా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల పై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.