– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
– చీర్లవంచలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ – తంగళ్లపల్లి
గ్రామంలోని పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదివేలా చూడాలని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ పరిధి తెనుగువారిపల్లె లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, గ్రామంలోని రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని పంచాయితీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం తరగతి గదులు, మధ్యాహ్నం భోజనం పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. వాటర్ ప్యూరిఫైర్, ఫ్యాన్లు మరమ్మతులు చేయించి, అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కిచెన్ షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. పాఠశాలకు మంచి భవనం ఉందని, కానీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొన్నారు. గ్రామంలోని పిల్లలందరూ ఇదే పాఠశాలలో చదివేలా చూడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన, సాంకేతికతతో కూడిన బోధనపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.విద్యార్థులు చదువులో రాణించేలా క్రమశిక్షణతో కూడిన భోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కార్తిలాల్ పాల్గొన్నారు.