గోరుముద్దలు, జోలపాటలు, చందమామ కథలు, చెమ్మచెక్క, దాగుడుమూతలు, గోళీలు, చెక్కా బిళ్ల… ఈ పదాలు వినగానే అందరికీ బాల్యం గుర్తుకొస్తుంది. బాల్యం ఒకటే కాని ప్రపంచవ్యాప్తంగా పిల్లల బాల్యాలు వేరువేరుగా ఉన్నాయి. బాల్యం ఎటువంటిదైనా బాలలకు గల హక్కులు, సంరక్షణ, విద్య, అవకాశాల గురించి ప్రజల్లో అవగాహనను పెంచడానికి దేశవ్యాప్తంగా బాలలదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
నిజానికి 1964 వరకు బాలల దినోత్సవాన్ని నవంబర్ 20వ తేదీనే జరుపుకునేవారు. భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి పిల్లలంటే చాలా ప్రేమ. ఆయన 1964 లో మరణించిన తరువాత, ఆయన జయంతిరోజు బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి బిడ్డ బాల్యం ప్రత్యేకమైనది.
బాల్యం చాలా తక్కువ విషయాలతో ఆనందంగా జీవించగలిగే కాలం. పుట్టినప్పటి నుండి ఆరు సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు మనం నేర్పించక పోయినా చూసి అనుకరించే గొప్ప లక్షణం ఉంటుంది. దానినే మరియా మాంటిస్సోరి ‘Absorbent mind’ అని చెప్పింది. అంటే స్పాంజ్‌ని ఏ రంగు నీళ్లలో వేస్తే ఆ రంగు నీళ్లను పీల్చుకున్నట్టు పిల్లలు తమ పరిసరాలను ఆ విధంగా గ్రహిస్తారు. అందువల్లే ఎవరు నేర్పించకపోయినా వారి పరిసరాలలోని భాషను, ఆ భాషా మర్యాదలను, వ్యాకరణం, యాసలతో సహా నేర్చుకుంటారు. అదే వారి మాతభాష అవుతుంది. అలాగే ప్రతి విషయాన్ని గ్రహిస్తారు. పిల్లలు గొప్ప అనుకరణదారులు. అంటే పిల్లలు తాము గమనించిన వాటిని బట్టి, ఇంకా తాము నిమగమైన వాటిని బట్టి ఎదుగుతారు. అంతేగాని బోధనలతోనో, తత్వాలతోనో కాదు. పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటామో, దానికి సజీవ నిదర్శనంగా పెద్దలు ఉండాలి. కాబట్టి వారికి అనుకరించడానికి గొప్పగా ఉండే విషయాలను అందించాలి. ఎందుకంటే బాల్యపు పునాదులపైనే వారి ఎదుగుదల ఆధారపడుతుంది. ప్రతి బిడ్డలో ప్రకాశించడానికి ఒక ఇంద్రధనస్సు వేచి ఉంటుంది.
0 నుండి 18 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలందరినీ బాలలుగానే పరిగణిస్తారు. కొందరి బాల్యం మెత్తని తివాచీపై పరిగెత్తేదైతే, మరికొందరి బాల్యం నగపాదాలతో ముళ్లు, రాళ్లల్లో ఎగుడుదిగుడు విషాద పయనమవుతుంది.
శ్రీ శ్రీ చెప్పినట్లు ”పాపం, పుణ్యం, ప్రపంచమార్గం/ కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ/ ఏమీ ఎరుగని పూవులలాంటి” వారు పిల్లలు. శైశవం స్వచ్ఛతకు మారురూపంగా భావించేదశ. ఇటువంటి బాల్యం కష్టాలకొలిమిలో చిక్కుకుంది. కర్ణుడి చావుకి కారణాల లాగా ఈనాటి బాల్యానికి రకరకాల చెదలు పడుతున్నాయి. కావ్యాలలో బాల్యాన్ని ఎంతో ఆహ్లాదకరంగా వర్ణిస్తారు. ఆనాటి వాల్మీకి నుండి అన్నమయ్య, పోతనల వరకు తమ పద్యాలలో బాల్యపు క్రీడలను ఎంతో మథురంగా కీర్తించారు. వాటిని విన్న వెంటనే, మళ్లీ టైం మిషన్‌లో వెళ్లి అందమైన బాల్యాన్ని గడపాలనుకుంటాం. సాహిత్యంలో, గేయాలలో, కథలలో, సినిమాలలో, ప్రకటనలలో మాత్రమే ఆనందాలతో కేరింతలు కొట్టే బాల్యం ఉంది. వాస్తవానికి జీవితంలో అతి ప్రమాదకరమైన దశ బాల్యం అని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం.
అన్నిటికన్నా భయంకరమైన వాస్తవం పిల్లలకు ప్రేమను, ఆప్యాయతను, భద్రతను అందించే కుటుంబ సభ్యులనుండే హింసను, వేధింపులను ఎదుర్కోవటం. అది శారీరికం కావచ్చు, మానసికం కావచ్చు. నమ్మిన వ్యక్తి పిల్లలను దుర్వినియోగం చేయగలడని తెలిస్తే భరించడం చాలా కష్టం. ముఖ్యంగా పిల్లలపై లైంగిక హింస. ఇది ప్రతి దేశంలోనూ, సమాజంలోని అన్ని విభాగాలలోనూ జరుగుతోంది. పెద్దలు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. హింసలకి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ బాధితులే. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు, సవతి తల్లిదండ్రులు, వయసులో పెద్దవారైన తోబుట్టువులు, తాతలు, ఇరుగుపొరుగు వారే లైంగికవేధింపులకు పాల్పడడం శోచనీయం. పిల్లల లైంగిక వేధింపులు చాలా సామాజిక, ఆరోగ్య సమస్యలకు మూల కారణమవుతున్నాయి.
పిల్లలు తల్లిదండ్రుల తరువాత అంతగా ఇష్టపడేది, నమ్మేది, ప్రేమించేది వారి టీచర్లనే. అందుకే పాఠశాలలను విద్యను నేర్పించే ఆలయాలుగా భావిస్తారు. గురుదేవోభవ అంటూ ఉపాధ్యాయులకు సమున్నతస్థానాన్ని కల్పించారు. కానీ ప్రస్తుతకాలంలో దేవాలయాల్లాంటి బడుల్లో పిల్లలు భౌతికంగా, మానసికంగా హింసను, అనేక రకాలైన బెదిరింపులను ఎదుర్కుంటున్నారన్నది అందరికీ తెలిసిన చేదు నిజం. పసిపిల్లలపై దాడి జరిగితే ఏం జరిగిందో కూడా వారు చెప్పుకోలేరు. విద్యావ్యవస్థలో పిల్లలు ఇలాంటి లైంగిక అత్యాచారాల నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియజేయాలి.
ఇప్పుడు మనందరం గమనించాల్సిన విషయం ఒకటుంది. ఎక్కువ శాతం తల్లిదండ్రులు పిల్లల అవసరాలపై మాత్రమే దష్టి పెడుతున్నారు. పిల్లలకు ఖరీదైన వస్తువులను ఇస్తున్నాం కనుక వారిని గొప్పగా పెంచుతున్నామని అనుకుంటున్నారు. కాని పిల్లలతో మానసికంగా దగ్గర కావటం లేదు. పిల్లలకు మానసిక భద్రత చాలా అవసరం. చిన్నపిల్లల్లో ఆత్మహత్యలు పెరగడం చాలా ఆందోళన కలిగించే విషయం. దీనికి ముఖ్య కారణం, పిల్లలపై తల్లిదండ్రుల అంచనాలు ఎక్కువగా వుండడమే. చిన్నారుల స్కూల్ బ్యాగులకే కాదు, మెదళ్లకు కూడా మోయలేని భారాన్ని లక్ష్యంగా పెడుతున్నారు. చదువులలో ర్యాంకుల ఆధారంగానే వాళ్లని గుర్తిస్తున్నారు. తాము నెరవేర్చుకోలేని కలలని సాకారం చేసుకోవడానికి పిల్లలపై ఒత్తిడిని తెస్తున్నారు. తల్లిదండ్రుల ‘గొంతెమ్మ కోరికలు’ తీర్చడానికి పాఠశాలలు పిల్లలపై ఊహించలేనంత సిలబస్ భారాలను మోపుతున్నారు. ప్రతిబిడ్డా భిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. పిల్లల ప్రత్యేకతను మసకబారనివ్వకూడదు. వారి ఆకాంక్షలకు మద్దతునివ్వాలి. అపరిమిత ఊహలకు రెక్కలనివ్వాలి. ఎందుకంటే పిల్లల దష్టిలో ‘ప్రపంచంలో ఏడువింతలు కాదు, ఏడు మిలియన్లు’ ఉన్నాయి. పిల్లల వైఫల్యాలను అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు కాని ఉపాధ్యాయులు కాని ఆసక్తి చూపరు. వైఫల్యాల భయంతో ఆందోళన చెంది, ఆత్మవిశ్వాసం నశించి ఆత్మహత్యలను సమాధానంగా ఎన్నుకుంటున్నారు.
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అన్నట్లు ”నేటి పిల్లలు రేపటి భారతదేశాన్ని తయారుచేస్తారు. వారిని మనం పెంచే విధానం దేశభవిష్యత్తుని నిర్ణయిస్తుంది”.
పుస్తకం, గొడుగు, మెదడు వీటిని తెరిచినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. కాని మన దేశంలో పలకాబలపం పట్టాల్సిన బాల్యం పలుగూపారలను పడుతోంది. బాలకార్మిక నిర్మూలన కోసం ఎన్ని చట్టాలు వచ్చినా పేదరికం కారణంగా అవి విఫలమౌతున్నాయి.
రాజ్యాంగం పిల్లలకు కొన్ని హక్కులను కల్పించింది. వాటిలో ముఖ్యంగా చెప్పికోదగ్గది బాలలందరికీ ఉచిత నిర్భంద విద్య. కాని రెక్కాడితే డొక్కాడని బడుగు జీవులు బడికి వెళ్లే వయసు ఉన్న పిల్లలని కూడా పనికే పంపుతున్నారు. పనిచేసే చోట ప్రమాదకర పరిస్థితుల వల్ల ఎన్నో జీవితాలు మొగ్గలోనే ఆవిరివుతున్నాయి.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మానవహక్కుల గురించి అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకుపోయింది. కానీ పిల్లల హక్కుల గురించి జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరగలేదు. పిల్లల దుస్థితిని చూసి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) 1925లో ప్రపంచ బాలలదినోత్సవం అనే భావనతో ముందుకొచ్చింది. ఈ బాలలదినోత్సవం ద్వారా అన్ని వత్తులలోని వ్యక్తులకు బాలల హక్కులు, వారి సంక్షేమం, సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. 1954లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా నవంబర్ 20వ తేదీని ప్రపంచ బాలల దినంగా ప్రకటించింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేటందుకు పలుచర్యలు చేపట్టడం ఈ బాలల దినోత్సవ లక్ష్యం. లింగ, జాతి, మతం, వైకల్య ధోరణి, ఇతర హోదాలతో సంబంధం లేకుండా ప్రతిబిడ్డకు అవకాసాలను అందించాలని ప్రచారం చేస్తారు. ఎందుకంటే పిల్లల హక్కులు, సంరక్షణ దక్పధాలు బలపడడానికి ప్రచారం, ఉద్యమం అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో 1989లో బాలల హక్కులను పేర్కొంటూ, యునిసెఫ్(UNICEF) పిల్లల అవసరాలకు వర్తించే లక్ష్యాలను, ప్రాథమిక హక్కులను రూపొందించింది. వీటిలో ముఖ్యమైనవి.
(1) 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచితనిర్భంధ విద్య
(2) వాక్ స్వాతంత్య్రం
(3) ఆలోచనా స్వేచ్ఛ
(4) భయం నుండి విముక్తి
(5) ఎంపిక, నిర్ణయాలు తీసుకునే హక్కు
(6) మాత భాషలో విద్య .
వీటితో పాటు కొన్ని చట్టాలను కూడా రూపొందించారు. అందులో ముఖ్యమైనది బాల కార్మిక నిషేధ చట్టం.
1989లో ప్రపంచ నాయకులు ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒప్పందాన్ని స్వీకరించటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు చారిత్రాత్మకంగా సురక్షిత, ఉన్నతమైన జీవనప్రమాణాలు అందజేయడానికి మార్గం నిర్దేశింపబడింది. ఈ 1989లో జరిగిన బాలల హక్కుల కన్వెన్షన్ అన్ని దేశాలు పాటించాల్సిన సార్వత్రిక ప్రమాణాలను అందించింది. అది పిల్లల పట్ల కొత్త దష్టిని ప్రతిబింబించింది. పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తి కాదు, వారు నిస్సహాయస్థితిలో వున్న దానం చేయదగిన వస్తువులు కాదు. వారు మానవులు. పిల్లలను వ్యక్తులుగా, కుటుంబం, సంఘంలో సభ్యునిగా, వయసుకు తగ్గ అభివద్ధి దశకు తగిన హక్కులు వారికున్నాయి. ప్రపంచంలో మూడింట రెండువంతుల కంటె ఎక్కువ మంది పిల్లలు భద్రత లేని దేశాల్లో నివసిస్తున్నారు.
చాలా సందర్భాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికీ చిన్నవారిలాగానే చూస్తారు. వయస్సులో వచ్చిన మార్పులు, ఎదిగిన పిల్లల అవసరాలను పట్టించుకోరు. స్వేచ్ఛ, క్రమశిక్షణ సమపాళ్లలో ఉండాలి. చదువు ఎంత అవసరమో ఆటపాటలు అంతే అవసరం. పిల్లలలోని టాలెంట్‌ని బయటికి తీయాలి. ప్రోత్సహించాలి. పేరెంటింగ్ అంటే పిల్లలకు భద్రతను, మద్దతునూ అందించాలి. ఆటిజం లేదా కొన్ని వైకల్యాలున్న పిల్లల అభివద్ధికి మామూలు పిల్లలకు కేటాయించే సమయం కంటే ఎక్కువ సమయం అవసరమవుతుంది.
ఇలా ఎన్నో మార్గనిర్దేశకాలు చేసుకుంటూ, బాలల కోసం ఉత్సవాల పేరిట ఎన్నో పథకాలను, హక్కులను, చట్టాలను చేసినా వారిపై జరిగే అమానుష చర్యలను ఎవరూ ఆపలేకపోతున్నారు. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 152 మిలియన్లకు పైగా బాలబాలికలు ప్రమాదకరమైన పరిస్థతులలో కార్మికులుగా మనుగడసాగిస్తున్నారు. బాలకార్మికులలో కూడా లింగకోణం ఉంది. బాలికలు చాలా వరకు ఇంటి పనులలో సతమతమవుతూ, లైంగిక దోపిడీకి గురౌతుంటే, బాలురు వ్యవసాయ పనులలో, ప్రమాదకరమైన రసాయన పురుగుల మందుల పిచికారీలలో, భారీ యంత్రాలలో పనిచేస్తున్నారు. దీనివల్ల కాన్సర్, వంధత్వం, దీర్ఘకాలిక వెన్నునొప్పి సమస్యలతో సతమతమవుతున్నారు. వీటితో పాటు ప్రస్తుత బాల్యం గతంలో ఎవరూ కనీవినీ ఎరుగని సంక్షోభంలో ఉంది. చేతిలోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో నేరాలకు మూలమవుతోంది. స్మార్ట్ ఫోన్ ద్వారా లభిస్తున్న జ్ఞానం విషం కన్నా హానిచేస్తోంది. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల, అవసరాల కన్నా ఎక్కువ సమాచారం వల్ల జరుగుతున్న అనర్థాలు లెక్కలేనన్ని.
పిల్లలకి తల్లిదండ్రులు సమయాన్ని ఇస్తూ వారి ప్రవర్తనని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లలకు తమను తాము ఎలా నియంత్రించుకోవాలో నేర్పించాలి. ‘వడ్రంగిలా కాకుండా తోటమాలిగా’ అన్వేషించడానికి సురక్షితమైన స్థలాన్ని ఇవ్వాలి. చిల్డ్రన్స్ డే ని ‘హాపీ చిల్డ్రన్స్’ డే గా జరుపుకోవాలంటే ప్రభుత్వాలు, ప్రజలు పిల్లల హక్కులను గౌరవించాలి. అవి అమలయ్యేటట్లుగా చర్యలు తీసుకోవాలి.
“Children are the future. Nurture them right, so that they grow up to be able leaders and lead the world towards light”
హాపీ చిల్డ్రన్స్ డే.
– డా.నీరజ అమరవాది, 9849160055