‘సత్యము – సౌందర్యముల రసవత్ సమ్మేళనమే కళ’ అని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏనాడో చెప్పాడు. మరి ఈ రెండింటిని బాలల వికాసం – అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం పెద్దల బాధ్యత. గతంలో ఇది జరిగేది. ఇప్పుడు లేదు. అందుకే పాఠశాలలు, విద్యాలయాలు రసహీనంగా, సత్యదూరంగా మారుతున్నాయి. ఫలితంగా దేశాభివృద్ధికే పునాదిగా ఉండవలసిన నీట్, యుజిసి నెట్ వంటి అత్యున్నత ప్రవేశ పరీక్షలు సైతం లోపభూయిష్టంగా సాగుతూ విద్యావ్యవస్థనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి కదూ…
ఈ నేపథ్యంలో పిల్లలకు చిన్నప్పటి నుండే కళావికాసం జరగవల్సిందే. వారి ఎదుగుదలలో లలిత కళలు భాగస్వామ్యం కావాల్సిందే. లేనిపక్షంలో వారిలో మానవీయ స్పర్శ కోల్పోయి, మనిషితనం మొద్దుబారుతుంది. కరుడుగట్టిన స్వార్థపరులుగా, హింసావాదులుగా, అసాంఘిక శక్తులుగా మారడానికి ఎంతోకాలం పట్టదు. ఈ ప్రమాదం నుండి బయటపడేందుకు మన బాలభారతాన్ని లలిత కళలతో జాగృతం చేయక తప్పదు. ముఖ్యంగా టీచర్లకు ఇది తప్పనిసరి. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులు కదా.
”పిల్లలూ దేవుడూ చల్లనివారే, కల్లకపటమెరుగని కరుణామయులే” అన్నాడు కదా కవి ఆరుద్ర. సహజంగా పిల్లలు సహృదయులు, కరుణామయులు. కుల, మత, లింగ, భాషా ప్రాంత బేధమెరుగక చక్కగా స్నేహం చేస్తారు. అరమరికలు లేని స్వచ్ఛమైన భావవ్యక్తీకరణ వారి మధ్యన జరుగుతుంది. వారి మధ్యన విరబూసే ప్రేమ ఎంతో నిర్మలమైనది. అపురూపమైనది. దానిని అలాగే పదిలంగా ముందుకు తీసుకుపోవాలంటే టీచర్లకు పెద్దలకు ఆ కళాహృదయం తప్పక వుండి తీరవల్సిందే.
ఇప్పుడు బి.ఇడిలోనూ, డి.ఎల్.ఇ.డి లోనూ కళలు – కళా విద్య అనే అంశాలు పాఠ్యాంశాలుగా రూపు దిద్దుకుంటున్నాయి. అంటే టీచర్లకు లలిత కళల పరిచయం తప్పనిసరి అయింది. లేకుంటే వారి బోధనా పద్ధతి చాలా యాంత్రికంగాను, కృతకంగానూ మారిపోతుంది. పిల్లలు అన్యాయమైపోతారు అప్పుడు. చాలా పాఠశాలల్లో (ప్రభుత్వ – ప్రయివేటు) జరుగుతున్నదిదే.
సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం – ఈ ఐదింటిని స్థూలంగా లలిత కళలుగా భావిస్తున్నారు.
సంగీతం : సంగీతం ద్వారా పిల్లల్లో వినికిడి సామర్థ్యం పెరుగుతుంది. కళ్లు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చుంటే ఎన్నెన్నో శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి. రణగొణ ధ్వనులకు, శబ్దమాధుర్యానికి గల తేడాను గమనించవచ్చు. ఎక్కడబడితే అక్కడ ఇష్టమొచ్చిన రీతిలో శబ్దకాలుష్యం చేయరాదని, ముఖ్యంగా ఆస్పత్రులు, ప్రార్థనా స్థలాల వద్ద నిశ్శబ్దం పాటించాలనే క్రమశిక్షణా పద్ధతులు మొదలైనవి అలవడుతాయి. అలాగే పబ్లిక్ ప్లేసుల్లో ఇంగితజ్ఞానం లేకుండా శబ్దంతో కూడిన సెల్‌ఫోన్ వెర్రి వాడకాన్ని నియంత్రించుకోవడం కూడా అలవడుతుంది.
స్వరసాధన ద్వారా, స్వరజ్ఞానం, కుదురు, శృతి, లయ తెలుస్తాయి. 99 శాతం పాఠశాలల్లో ఇది లేకపోవడం వల్ల పిల్లల్లో జీవనలయ తప్పుతున్నది. మధురమైన సంగీతానికి మానసికంగా దూరమై పోతున్నారు. చెవిటివాని ముందు శంఖం ఊదుటెందుకు అనేలా పరిస్థితి తయారైంది. మనకి తెలియకుండా మనమే పిల్లల్ని చక్కటి సంగీతాన్ని ఆస్వాదించలేని స్థితికి నెట్టేస్తున్నాం. తల్లి జోలపాట నుండే శిశువు దూరమవుతున్నప్పుడు పిల్లల్ని తిరిగి సంగీతానికి చేరువ చేయాల్సింది ఎవరు. గురువులే. తల్లి దగ్గర పొందలేనిది పిల్లలు టీచర్ దగ్గర పొందితే అంతకన్నా ఆ టీచర్లకు ఆనందం ఏముంటుంది?
సాహిత్యం : పిల్లల్లో సాహిత్యాభిరుచి సహజంగానే వుంటుంది. చక్కటి పాటలు, మంచి మంచి కథలు హాయిగా వింటారు. అయితే టీచర్ వాటి అర్థాన్ని చక్కగా వివరించి చెప్పినప్పుడు మాత్రమే. సంగీతం ఆ పాత మధురిమై, సాహిత్యం ఆలోచనామృతం అవుతుంది. పిల్లలు కథలు వింటూ తమ ఊహలకు, ఆలోచనలకు ఎంతో పదును పెట్టుకుంటారు. ఇదో మానసిక వ్యాయామం. పిల్లల్లో ఆలోచనలు, ప్రశ్నలు రేకెత్తే విధంగా కథలు చెప్పాలి. ఈ నైపుణ్యాన్ని టీచర్లు అందిపుచ్చుకోవాలి. మంచి కథలు, పాటలు, సామెతలు జోడించి పాఠ్యాంశాన్ని భావస్పోరకంగా చెప్పగలిగితే, పిల్లల హృదయాల్లో అది బలంగా నాటుకుపోతుంది. జీవితాంతం గుర్తుండిపోతుంది.
తమలో చెలరేగే భావాలకు పిల్లలు తమకు తాము సొంతంగా అక్షర రూపం ఇవ్వగలిగితే అంతకంటే కావాల్సిందేముంటుంది. అది కదా అసలైన చదువు. అది కదా సిసలైన జీవన నైపుణ్యం. అందుకే ఇప్పుడు పిల్లలు కథలు వినడమే కాదు, కథలు, కవిత్వం రాయడానికి సైతం చాలా ఉత్సాహపడుతున్నారు. మంచి టీచర్లు అలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు కూడా.
నాట్యం : ‘ఆంగికం భువనంయశ్య’ – అంగములతో చేసే విన్యాసం. అనాదిగా మనకు ఎన్నో నృత్యరీతులు వున్నాయి. నృత్యానికి అభినయం కలిస్తే నాట్యం అవుతుంది. పిల్లల శక్తిసామర్థ్యాలు వీలైనంత ఎక్కువగా ఆటల్లోనూ, జానపద కళల్లోనూ, నాట్యంలోనూ వ్యక్తమవుతాయి. ఒకే చోట కూర్చోపెట్టి చదివిస్తే, పిల్లల్లో ఆ శక్తి సామర్థ్యాలు పొంగిపొరలే పాలులా నేలపాలవుతాయి. లేదా అల్లరికి ఆగ్రహానికి దారితీస్తాయి. ఒక్కోసారి వెర్రితలలకు తావిస్తాయి. ఈ ప్రమాదానికి చేరుకోకముందే పిల్లల్ని చక్కగా ఆటలు ఆడించాలి. డాన్స్ చేయించాలి. జానపద కళల్లో, నాటకాల్లో భాగస్వామ్యం చేయించాలి. ఊరికే అర్ధంపర్ధం లేని ఎగురుడు, గెంతుడు కాకుండా వారు చేసేదేమిటో వారికి అర్థమై చేస్తే పిల్లల హృదయ వికాసమూ మెండవుతుంది. చూసే ప్రేక్షకులూ ఆనందిస్తారు. పిల్లల్ని అభినందిస్తారు. అది వారికెంతో బలం.
చిత్రలేఖనం : చేతులకు మెదడుకు నాడీమండల వ్యవస్థ ద్వారా అవినాభావ సంబంధం వుంటుంది. మనిషి ప్రత్యేకత ఇదే. అస్పష్టమైన భావానికి చేతుల ద్వారా ఓ స్థిర రూపం ఇస్తాడు. అందుకే పిల్లల్ని చిన్నప్పటి నుండి బొమ్మలు గీయించాలి. కేవలం వాటిని అందమైన బొమ్మలుగానే చూడకూడదు. అవి పసి మనసుల భావ వ్యక్తీకరణ సాధనాలుగా టీచర్లు గమనించాలి. తద్వారా వారి మనోభావాల్ని టీచర్లు చదవాలి. ప్రతి విద్యార్థీ ప్రత్యేకమే. అందుకే పిల్లల చేత చేతులూ వేళ్లూ సులభంగా కదిలేలా (మోటారు స్కిల్స్) సాధన చేయించాలి. ప్రకృతి రంగులమయం. వర్ణభరితమైన ప్రకృతిని చలనశీలమైన సమాజాన్ని చూస్తూ తెలుసుకుంటూ, చేస్తూ నేర్చుకుంటూ ముందుకుసాగటానికి చిత్రలేఖనం తొలి సోపానమవుతుంది.
శిల్పం : ‘పైన కఠినమనిపించును. లోన వెన్న కన్పించును’ అన్నాడు మహాకవి సినారె. తాము కోరుకున్న విధంగా పిల్లలు మట్టి బొమ్మలు పూర్వం తయారు చేసుకునేవారు. ఇప్పుడది మృగ్యమైంది. పక్షి గూడు కట్టినట్టు పిల్లలు అలాంటి బొమ్మలను చాలా జాగ్రత్తగా నిర్మించుకుంటారు. ఒక వస్తువు తయారీలో ‘నిర్మాణం’ విలువ ఏమిటో స్వతహాగా తెలుసుకుంటారు. ఆ ఓర్పు, నేర్పు తెలిసిన కొద్దీ విధ్వంసానికి మనిషి దూరమవుతాడు. లేకుంటే విధ్వంస సంస్కృతి దగ్గరవుతుంది. దేనినైనా చెడగొట్టడం, పాడుచేయడం చాలా సులభం. నిర్మించడమే కష్టం. అనుభవ పూర్వకంగా ఇది అర్థమైతే తప్ప మనిషిలో ఏ మార్పూ సులభంగా రాదు.
అందుకే టీచర్లు పిల్లలకు చిన్నప్పటి నుండే లలిత కళల్ని పరిచయం చేయాలి. కళ అనంతం. జీవితం స్వల్పం. పిల్లల వికాసానికి, అభివృద్ధికి లలిత కళలు ఎంతగానో తోడ్పడతాయనేది కాదనలేని సత్యం. కనుకనే ఇటీవల తెలంగాణా సారస్వత పరిషత్ నిర్వహించిన బాలసాహిత్య సమ్మేళనంలో ‘లలితకళా పరిచయం’ అనే అంశాన్ని చర్చకు పెట్టారు. తదనుగుణంగా ఆ ఒరవడిలో ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో అనేక పాఠశాలల్లో లలిత కళల గురించి ఎక్కడికక్కడ ప్రత్యేక చర్చ జరగడం ఎంతైనా ముదావహం.
– కె.శాంతారావు, 9959745723