చక్కని బొమ్మలు నేర్పిన బాలల నేస్తం!

Children's friend who taught nice toys!ఇతర ఎన్ని వృత్తుల్లో మనం రాణించి రచనలు చేసినా ఉపాధ్యాయ వృత్తిలో వుండి రచయితలుగా వెలిగినవాళ్ళే ఎక్కువ. ఆ వృతికి వుండే వెసులుబాటు, నిరంతర అధ్యయనావకాశం, నిరంతరం పిల్లలతో గడిపి ప్రతిక్షణం మనకు మనం రిచార్జ్‌ అయ్యే అవకాశం ఉండడం అందుకు మరో కారణం కూడా! బడిలో పాఠాలు చెబుతూనే బాలల కోసం రచనలు చేస్తున్న ఉపాధ్యాయ కవి, రచయిత, బాల వికాస కార్యకర్త గుముడాల చక్రవర్తి గౌడు.
ఈయన మహబూబ్‌ నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల గ్రామంలో 5 జూన్‌, 1971న పుట్టారు. శ్రీమతి గుముడాల రోషనమ్మ – శ్రీ రాఘవులు గౌడు వీరి అమ్మానాన్నలు. తెలుగు సాహిత్యంలో ఎం.ఎ, తెలుగు పండిత శిక్షణ పూర్తిచేసిన చక్రవర్తిగౌడు వృత్తిరీత్యా తెలుగు భాషోపాధ్యా యులుగా పని చేస్తున్నారు. కవి, చిత్రకారులు అయిన చక్రవర్తి గౌడు సాహితీ రంగంతో పాటు చిత్రకళా రంగంలోనూ గుర్తింపు పొందాడు.
‘అక్షర కిరణం’, ‘పిల్లలమఱ్ఱి’ పత్రికలకు సంపాదక సభ్యునిగా వ్యవహరించిన చక్రవర్తి గౌడు పాఠ్యపుస్తక రచయితగా వున్నారు. వివిధ పత్రికల్లో పలు చారిత్రిక అంశాలపై వ్యాసాలు వ్రాశారు. నైజాం పోలీసులపై తిరుగుబాటు చేసి అమరులైన పదకొండు మంది అప్పనంపల్లి గ్రామ వాసుల ఆత్మకథ ‘నేను అప్పనంపల్లిని మాట్లాడుతున్న’ చక్రవర్తి తల్లి నేలమీది ప్రేమతో వ్రాసిన రచన. ఇది అమర వీరుల ఆత్మార్పణానికి అచ్చమైన నివాళిగా వచ్చిన రచన. ఇదేకాక కార్గిల్‌ కవితా భేరి, అక్షర కిరణం, సప్తస్వరాలు, సారాక్షసి మరణ గీతం, పాలమూరు గోస, నెమలీక, పాలమూరు కవితా సుధ వంటి అనేక సంకలనాల్లో కవిగా చక్రవర్తి గౌడు రచనలు వచ్చాయి. బాల వికాస కార్యరక్తగా ‘అ’పూర్వం’ తిపుడం పల్లి పూర్వ విద్యార్థుల అనుభవాలను ప్రచురించాడు. ‘వందేమాతరం’ వయోజన విద్యా వాచకం చక్రవర్తి గౌడు వ్రాశారు.
బాల సాహితీవేత్తగా వివిధ పత్రికల్లో కథలు, గేయాలు, వ్యాసాలు, పిల్లల కోసం ప్రత్యేకంగా వేసిన బొమ్మలు అచ్చయ్యాయి. పుస్తక రూపంలో అచ్చయిన వీరి బాల సాహిత్యంలో ‘అక్షర గేయాలు’ మొదటిది. ఇది ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం వ్రాయబడింది. ఇది కవిగా చక్రవర్తి బాలల కోసం వ్రాసింది కాగా, చిత్రకారునిగా పిల్లల కోసం ప్రచురించిన మరో పుస్తకం ‘అక్షర చిత్రాలు’. ఇది వర్ణమాల లోని అక్షరాలను భూమికగా చేసుకుని ఆయా అక్షరాలను ఎలా బొమ్మలుగా మలచవచ్చో ఈ బొమ్మల్లో చక్రవర్తిగౌడు చిత్రించి చూపించాడు. ఇది కేవలం బాలలకు బొమ్మలను దిద్దడం, వేయడంతో పాటు విషయజ్ఞానాన్ని తొలి దశలోనే ఎలా నేర్పవచ్చో తెలిపు బొమ్మల పుస్తకం. చెన్నై యూత్‌ ఫెస్టివల్‌ చిత్రకళా పురస్కారం, జిల్లా స్థాయి ఉత్తమ కళాకారునిగా జ్ఞాపిక, లయన్స్‌ క్లబ్‌ ఉపాధ్యాయ పురస్కారం, జిల్లా స్థాయిలో విద్యాశాఖ వారి ఉపాధ్యాయ పురస్కారం, ప్రపంచ తెలుగు మహాసభల సత్కారం, బాల సాహిత్య పరిషత్‌-అరుణోదయ బాల సాహిత్య పురస్కారం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జిల్లా పురస్కారం, కాలుష్య నియంత్రణ మండలి గ్రీన్‌ చాంపియన్‌ అవార్డు వంటివి వీరు అందుకున్న అవార్డుల్లో కొన్ని.
చక్రవర్తి గౌడు పిల్లల కోసం తెచ్చిన తొలి పుస్తకం ‘అక్షర గేయాలు’. ఇది చక్కని చిక్కని లయ, అంత్యప్రాసలతో కూడిన బుజ్జి గేయాల సంపుటి. ఒక రకంగా ఆంగ్లంలో ఉన్న నాన్‌సెన్స్‌ రైమ్స్‌ వంటివి అన్నమాట. ప్రతి గేయం సరళంగా, చిన్నగా ఉండి పాడివినిపిస్తే అంగన్‌వాడి పిల్లల నుండి అందరికి నచ్చుతాయి. వాటిలో ‘అమ్మమాట వింటాను/ అరటిపండు తింటాను/అక్కతో ఆడుకుంటాను/ అన్నకు టాటా చెబుతాను’, ‘ఆవుపాలు తాగేస్తా/ ఆసనాలు వేసేస్తా/ ఆటలెన్నో ఆడేస్తా/ ఆనందంగా గడిపేస్తా’ ‘ఇటుకలెన్నో తెచ్చేస్తా/ ఇసుకతో ఇల్లు కట్టేస్తా/ ఇనుప కుర్చీపై కూర్చుంట’ వంటి గేయాలు ఇందులో ఉన్నాయి. ఇంకా… ‘ఈగల వలన నష్టం/ ఈలలు వేయడం ఇష్టం’, ‘ఉల్లితోట లోనికి /ఉడుత ఒకటి వచ్చింది / ఉసిరి చెట్టు ఎక్కింది / ఉసిరికాయ తెంపింది’, ‘ఏనుగులమ్మ ఏనుగులు/… ఏటిగట్టుకు వెళ్ళాయి/ ఏరులో నీరు తాగాయి’, ‘కడవలోన నీరు చల్లన/కలువపూలు తెల్లన/కలం చేత పట్టుకొని/కథలెన్నో రాయనా!’ అంటూ సాగుతాయి అక్షర గేయాలు. గేయాన్ని చక్కగా నడపడంలో చక్రవర్తి గౌడ్‌ది అందె వేసిన చేయి. ఆ నేర్పే పిల్లల మనసుకు హత్తుకునేలా చేశాయి ఆయన గేయాలను. ‘జడ వేసుకుంది అక్క/జల్లెడ పట్టింది అమ్మ’ అన్న గేయం చూసినప్పుడు నాన్‌సెన్స్‌ రైమ్స్‌లో విధంగా వివిధ విషయాలను లయ కోసం చెప్పడం కనిపిస్తుంది. ‘టక్కరి నక్క వచ్చింది/ టమాట తోటకు వెళ్లింది/టకటక చప్పుడు అయ్యింది/ టక్కున నక్క ఉరికింది’, ‘దండం గురువుకు పెట్టాలి/దండలు దేవుడికెయ్యాలి’, ‘బడి నుండి వచ్చాను/ బంతి ఆట ఆడాను’, ‘రంగురంగుల రథము/రతనాల రథము’, ‘గుణింతాల కథ… ‘క’థ చెబుతాను వినండి/ ‘కా’కులు దూరని కారడవిలో/’కి’లకిల పక్షుల చప్పుళ్ళు/ ‘కీ’చులాడిన పక్షికి గాయం అయ్యింది/ ‘కు’ంటుతూ కొమ్మపై వాలింది/ ‘కూ’ర్చుని ఆలోచించండి’ అని వ్రాస్తారు చక్రవర్తి గౌడు. ఈ గేయాలను పిల్లలకు ఆనందంతో పాటు ఆలోచనలను కలిగింపజేసేవిగా ఉండడం విశేషం. చక్రవర్తి గౌడ్‌ మరో పిల్లల పుస్తకంక బొమ్మల పుస్తకం. ఎబిసిడిలతో చిత్రం, పండ్లు కూరగాయలతో బొమ్మ/ఐస్‌క్రీం స్ఫూన్లతో బొమ్మ వంటివి ఎలా చేయాలో ఇందులో ఆయన వరసగా చూపించాడు. వాటికి చాక్‌లెట్‌ కవర్లు, రబ్బరుబ్యాండ్లు వంటివి వాడారు. ఇంకా మొంతులు కాగితాలతో గణితం బొమ్మలు, ‘ఇ’తో ఉడుత, ‘ఈ’తో ఈక, ‘ఉ’తో ఉడుత, ‘ఎ’ తో ఎలుక బొమ్మ వంటివి ఇందులో ఉన్నాయి. పిల్లల కోసం చక్కని గేయాలు, బొమ్మలను అందించిన గుముడాల చక్రవర్తిగౌడ్‌కు శుభాకాంక్షలు జయహౌ! బాల సాహిత్యం.
డా|| పత్తిపాక మోహన్‌
9966229548