పాప పేరు ఆశ. ఆమె చాలా ఉత్సాహవంతురాలు, కానీ కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా ఆమెకు ఆందోళను కలిగించేవి. స్కూల్లో ప్రాజెక్ట్ సమర్పించాల్సిన రోజు దగ్గర పడింది. కానీ ఆశకు చాలా భయం వేసింది. ”నేను బాగా చేయలేను” అని మనసులో అనుకునేది. దిగులుగా ఉండేది. తల్లి ఏం అడిగినా చెప్పేది కాదు. ఆ పాప పేరెంట్స్ నా దగ్గరకు తీసుకొచ్చారు.
ఆశతో ముచ్చటించాను. ”ఆశా… ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది! కానీ అది ఏమీ కాదు. నువ్వు ప్రయత్నిస్తే, నీకే మంచి ఫలితం లభిస్తుంది” అని చెప్పి కొన్ని సార్లు కౌన్సెలింగ్ ఇచ్చాను.
ఆ మాటలు ఆశకు ధైర్యాన్నిచ్చాయి. ఆమె ఆ ప్రాజెక్ట్ పై పూర్తిగా శ్రద్ధ పెట్టింది. ప్రాజెక్స్ సబ్మిట్ చేయాల్సిన రోజు వచ్చినప్పుడు, ఆశ తన ప్రాజెక్ట్ను ఎంతో విశ్వాసంతో సమర్పించింది. అంతే కాదు, అందరికంటే ఉత్తమంగా చేసి, బహుమానాన్ని కూడా గెలుచుకుంది.
అప్పటి నుండి ఆశకు ఒక విషయం అర్థమైంది. భయం ఉన్నా, ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలి అని
పిల్లల మానసిక ఆరోగ్యం అనేది వారి బుద్ధి, భావోద్వేగాలు, సామాజిక జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం మరింత ప్రముఖ్యమైనది. ఎందుకంటే అది వారి భవిష్యత్తును నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
మానసిక ఆరోగ్యం ఎందుకు ముఖ్యమంటే:
1. భావోద్వేగ నియంత్రణ: పిల్లలు వారి భావాలను ఎలా నిర్వహించుకోవాలో నేర్చుకోవడం అత్యవసరం. ఈ నైపుణ్యం వారికి స్ఫూర్తిదాయకమైన, ఉత్సాహభరితమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది.
2. సామాజిక నైపుణ్యాలు: మానసిక ఆరోగ్యం కలిగిన పిల్లలు సమాజంతో సానుకూలంగా ఉండగలరు. వారు ఇతరులతో సంబంధాలు కాపాడుకోవడానికి, సమస్యలను పరిష్కరించడాన్ని నేర్చుకుంటారు.
3. అభ్యాస సామర్థ్యం: పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, వారు పాఠశాలలో ఇతర అభ్యాసాలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తారు.
మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడం ఎలా?
సానుకూల పర్యావరణం: పిల్లలకు సానుకూల పర్యావరణాన్ని కల్పించడం వారి మానసిక ఎదుగుదలకు సహాయపడుతుంది. కుటుంబం, పాఠశాల, స్నేహితులు వారి అభ్యాసంలో ముఖ్య పాత్ర పోషిస్తారు.
ఎవరితోనైనా మాట్లాడే అవకాశం: పిల్లలకు తమ సమస్యలు లేదా భావాలు పంచుకోవడానికి ఒక సురక్షిత వేదిక ఉండాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు వారికి సహాయం చేసే వారిగా ఉండాలి.
ఆరోగ్యకరమైన జీవన శైలి: మానసిక ఆరోగ్యం కోసం సరైన ఆహారం, వ్యాయామం, సేదతీరే సమయం అవసరం.
(అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం)
డా|| హిప్నో పద్మా కమలాకర్, 9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్