140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన భారతదేశంలో40 కోట్ల మందికి పైగా బాలలే ఉన్నారు. 18 ఏండ్లలోపు ఉన్నవారందరూ బాలలే. మైనర్‌లు. వారికి ఓటు హక్కు ఉండదు. ఈ బాలలందరికీ బంగరు భవిష్యత్ అందించడం పెద్దలుగా మనందరి బాధ్యత.
బాలల్లో మూడు దశలు ఉంటాయి. శిశు దశ, బాల్య దశ, కౌమార దశ. అరిష్టాలు తొలికి బాలలు సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఎదగాలి. బాలలందరికీ శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం కల్పించాల్సిన బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాలదే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో ప్రకటించింది. మన ప్రభుత్వం కూడా గతంలోనే బాలల హక్కులను గుర్తించి గౌరవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి పత్రంపై సంతకం పెట్టింది. అంటే మన పాలనలో మనం బాలలను విస్మరించరాదనే స్ఫూర్తి మనకు మన రాజ్యాంగమే కల్పిస్తున్నది. అలాగే బాలలకు మన దేశ ఔన్నత్యాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తుచేసే విధంగా పాఠశాలలో ప్రతిజ్ఞ ఉంటుంది. దేశప్రగతిలో బాలలను చిన్నప్పటి నుండే భాగస్వామ్యం చేయడంలో ప్రతిజ్ఞ కీలక భూమిక పోషిస్తుందనే విషయం మనం మరువరాదు.
‘భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహు విధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి నేను సర్వదా కృషి చేస్తాను… నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్నీ గౌరవిస్తాను. ప్రతి వారితో మర్యాదగా నడుచుకుంటాను. నా ప్రజల పట్ల సేవా నిరతి కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ – ఈ ప్రతిజ్ఞ సారాంశంలో రాజ్యాంగస్ఫూర్తి నిత్యం తొణికిసలాడుతూనే ఉంటుంది. ఉపాధ్యాయులు, పెద్దలు ఈ ప్రతిజ్ఞ సారాంశాన్ని ఎంత గాఢంగా అర్థం చేసుకుంటారో, పిల్లలకూ అంతే గాఢంగా అర్థం చేయంచగలరు.
వారే ‘ప్రతిజ్ఞ’ పట్ల నిర్లక్ష్యంగా, యాంత్రికంగా, మొక్కుబడి తంతుగా వ్యవహరిస్తే పిల్లలు కూడా అలాగే తయారవుతారు. యథారాజ తథా ప్రజ కదా..
ఇకపోతే రాజ్యాంగ ప్రవేశిక మనకు ఏం చెప్తున్నది.. ‘భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తు హోదాల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వంను చేర్చుటకు, అలాగే వ్యక్తి గౌరవాన్ని, జాతి సమైక్యతను రక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకై సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకున్నాము’
ఇది కూడా ఒక విధంగా ప్రతిజ్ఞ వంటిదే. అయితే చిన్నప్పుడు బడుల్లో చేసిన ప్రతిజ్ఞ, పెద్దయ్యాక కార్యాలయాల్లో, కార్యస్థలాల్లో అంతటా లేకపోవడం శోచనీయం. ఫలితంగా రాజ్యాంగస్ఫూర్తి భావన, కేవలం చరిత్ర, రాజనీతి, న్యాయవాద, పాత్రికేయ రంగాల పెద్దల వంటి కొందరికే పరిమితమై సామాన్యులకు దూరమయింది.
చిన్ననాడు చేసే ప్రతిజ్ఞ కాని, పెద్దయ్యాక స్పృహలో ఉంచుకోవాల్సిన రాజ్యాంగ ప్రవేశిక గాని ఆచరణ యోగ్యమే కాదు, ఆచరణ సాధ్యం కూడా. ప్రజలందరిలో రాజ్యాంగ స్పృహ వివేకం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం రాణిస్తోందని బాబాసాహెబ్ అంబేద్కర్ పదే పదే వక్కాణించడం ఈ కోవలోనే.
ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లో తప్ప చాలా వరకు కార్పొరేట్ ప్రయివేటు స్కూళ్లలో అసలు ప్రతిజ్ఞే చేయించడం లేదు. పైగా కులాల వారీగా, మతాల వారీగా కూడా విద్యాసంస్థలు ఏర్పడడం భారత రాజ్యాంగ సమైక్యత స్ఫూర్తికి ఆటంకం కూడా.
మన రాజకీయ వ్యవస్థ కూడా ఓటు కోసం కులాలవారీగా, మతాల వారీగా చీలిపోవడం చూస్తున్నాం. కొందరు నేతలైతే రాజ్యాంగబద్దంగా నడుచుకుంటామని ప్రమాణం చేసి కూడా తమ కులమతాలకనుగుణంగా పాలన చేయడం గమనిస్తూనే ఉన్నాం. కరుడుగట్టిన రాజకీయ స్వార్థంతో మనుషుల మధ్య చిచ్చుపెట్టే మత ఘర్షణలు రగుల్గొల్పి, ఆ మంటల్లో అమాయకులను బలికొంటున్న వైనాన్ని కాదనలేం.
ఈ నేపథ్యంలో దీనికి ప్రధాన విరుగుడు బాలలు చేసే ప్రతిజ్ఞే కీలకాంశమని మరో మారు చెప్పకతప్పదు. పిల్లల హృదయాల్లో నిష్కల్మషమైన స్వచ్ఛ భావాలు ఉంటాయి. వారికి అందరూ సమానమే. కుల, మత, భాషా, ప్రాంతీయ వైషమ్యాలకు అతీతంగా స్నేహం చేస్తారు. అరమరికలు లేకుండా కలసిపోతారు. కవి ఆరుద్ర చెప్పినట్టు పిల్లలూ – దేవుడూ చల్లనివారే. కల్లకపటమెరుగుని కరుణామయులే. కరుణా సముద్రంలో మునిగితేలే పిల్లలను త్రికరణశుద్ధిగా ముందుకు నడిపించాలంటే ప్రతిజ్ఞ ఒక బలమైన పునాది. మంచి భారతీయ పౌరులుగా ఎదిగేందుకు ఆ ప్రతిజ్ఞ జీవితంలో అడుగడుగునా తోడ్పడుతుందనేది కాదనలేని సత్యం.
కె.శాంతారావు 9959745723