బాలల హక్కుల వారోత్సవాలు

బాలల హక్కుల వారోత్సవాలునవంబర్‌ 14 బాలల దినోత్సవం, నవంబర్‌ 20 అంతర్జాతీయ బాలల దినోత్సవం. ఈ రెండు తేదీల మధ్య వారం రోజులు బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహించుకొంటున్న సందర్భంగా ‘ప్రత్యేక అవసరాలున్న పిల్లల’ స్ధితిగతులు, హక్కులు, వారి పట్ల సామాజిక బాధ్యత ఎలా వుండాలో తెలుసుకుందాం.
”వ్యత్యాసాలను పోగొట్టి, అడుగంటి పోతున్న మానవ సంబంధాల్లో విలీనత తెచ్చే సామర్ధ్యం కలిగిన వాళ్ళే పిల్లలు”.
”సమాజంలో అత్యంత హానికి గురికాగల వాళ్ళే పిల్లలు”. వారికి హింస, భయం లేని జీవితాలను అందించడమే మన బాధ్యత” అన్నారు నెల్సన్‌ మండేలా.
‘పిల్లలు’ అనే పదానికి న్యాయపరమైన నిర్వచనం కడుపులో ప్రాణం పోసుకున్నప్పటి నుండి 18 సం.లు పూర్తిగా నిండే వరకు ఉన్న వ్యక్తులందరూ పిల్లలే. అంటే జాతి, మత, కుల, ప్రాంత, భాష, పుట్టుక, అన్ని రకాల వైకల్యాలు, ప్రత్యేక అవసరాలు కలిగిన వాళ్ళంతా ఏ తేడా లేకుండా పిల్లలే. అన్ని హక్కులూ, అన్ని రాయితీలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. మానవ హక్కులు, రాజ్యాంగం, వివిధ బాలల హక్కుల చట్టాలు, వివక్షత లేని గౌరవంతో కూడిన సమానత్వం గురించి ప్రస్తావించాయి. మరి పిల్లల్లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలు అందులో భాగమే కదా! బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా మనం ప్రస్ధావించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎవరు?
చట్టంలో వివిధరకాల వైకల్యాలతో ఉన్న పిల్లలు 1) దృష్టి లోపం, (పూర్తి) 2) శ్రవణ లోపం, 3) భాషణలోపం, 4) చలన లోపం (ఎముకలు, కీళ్ళు, కండరాలు), 5) బుద్ధి మాంధ్యత, 6) మస్తిష్క పక్షవాతం (నాడీ మండల వ్యవస్ధ నియంత్రణ లేకపోవడం, బలహీనత, అవయవాల సయన్వయ లోపం, అసంకల్పిత కదలికలు), 7) ఆటిజం, (ఇది ఒక మానసిక స్ధితి తన ప్రపంచంలో తానుండటం), 8) అభ్యసన సమస్యలు, 9) బహుళ వైకల్యం (రెండు కంటే ఎక్కువ), 10) మరుగుజ్జు, 11) కుష్టు, 12) తలసేమియా, 13) హీమోఫీలియా, 14) పార్కిన్‌సన్‌, 15) కండరాల బలహీనత, 16) డిస్‌లెక్సియా, 17) తక్కువ దృష్టి, 18) యాసిడ్‌ బాధితులు, 19) సికిల్‌ సెల్‌, 20) పోలియో, 21) మానసిక రుగ్మతలు… ఇలా అనేకరకాల పిల్లలు. వీళ్ళంతా ఎక్కడో వేరే ప్రపంచంలో లేరు. మన మధ్య మన చుట్టూ ఉన్నారు. ప్రపంచంలో దాదాపు 240 మిలియన్ల మంది పిల్లలు ఏదో ఒక రకమైన వైకల్యాన్ని కలిగి ఉన్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. భారతదేశంలో 2011 సం|| జానాభాలో 1.7 శాతం ఉందని సూచించారు. ఇప్పుడు ఈ సంఖ్య కచ్చితంగా పెరిగి పుంటుందనడంలో సందేహం లేదు. నిజానికి ఇలాంటి వైకల్యాలకు సరియైన కారణాలు కచ్చితంగా ఇది అని మన పరిశోధనలు చెప్పలేక పోతున్నాయి. కొంతవరకు కొన్ని వైకల్యాలకు మాత్రమే ఈ శాస్త్రీయ పరిశోధనలు పనికొస్తున్నాయి. కొన్ని కారణాలు తల్లులు గర్భం ఉండగా పోషకాహారలోపం, రక్త సంబంధీకుల మధ్య వివాహాలు, జన్యు పరమైన లోపాలు, తరతరాలుగా మేనరిక వివాహాలు, డెలివరీ సమయంలో జరిగే ప్రమాదాలు, లోపాలు, తప్పుడు డయాగసిస్‌లు, గర్భిణీగా ఉన్నప్పుడు అనారోగ్య కారణంగా వాడిన పవర్‌ఫుల్‌ మందులు వగైగా. ఈ అంశాల పట్ల చాలా అవగాహనా లోపం ఉంది. తల్లిదండ్రులకు అవగాహన, ప్రత్యేక శిక్షణ, కౌన్సిలింగ్‌ సేవలు అందించాల్సిన బాధ్యత అందరిదీ. ఈ రంగంలో మరింత లోతుగా శాస్త్రీయ వైద్య పరిశోధనలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
సామాజిక అంశాలు : ఒక బిడ్డ వైకల్యంతో ఉంటే ఆ సమస్య, ఆ బాధ తల్లిదండ్రులది మాత్రమే కాదు. ఆ కుటుంబం, తోబుట్టువులు అందరి మీద ఉంటుంది. బాధపడే బిడ్డను, తల్లిదండ్రులను ఎక్కువ బాధ పెట్టేది సమాజమే. అవగాహనాలేమితో వింతగా చూస్తారు. భయపడతారు, భయపెడతారు. అక్కున చేర్చుకోవాల్సింది పోయి అస్పృశ్యతను చూపిస్తారు. ఫలితంగా వైకల్యం గల పిల్లలు ఇంటికి పరిమితమైపోతారు. సమాజంలో కలవలేరు. చుట్టూ ఉన్న జనాలు, బంధువులతో సహా ‘అయ్యో’ అంటూ అనవసరమైన జాలి చూపిస్తారు. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత అని వెక్కిరిస్తారు. దాంతో తల్లిదండ్రులు బిడ్డల స్ధితి చూసి కుమిలిపోవాలో, సమాజాన్ని పట్టించుకోవాలో తెలియక ఒక నిరాసక్తతకు, కుంగుబాటుకి లోనై నీరసించిపోతారు. దాంతో కుటుంబాల్లో గొడవలు… ఇలా మొత్తంగా తల్లిదండ్రుల స్ధితి మారిపోతుంది. కొన్ని కుటుంబాల్లో అయితే అలాంటి బిడ్డనుకన్నందుకు తల్లిదే తప్పన్నట్లు బిడ్డను ఏ అనాధాశ్రమంలోనో వదిలేస్తేనే కాపురానికి రమ్మనే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు, దానికి తోడు మూఢనమ్మకాలు… వెరసి బిడ్డలు మరింత దిగజారిపోయేలా చేసుకొనే మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోయేస్ధితి. ఇంకా కొంతమంది తల్లిదండ్రుల ముందు ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే… ‘మేమున్నంత కాలం చూసుకుంటాం. మా తర్వాత ఎవరు? డబ్బు ఉన్నా చూస్తారనే నమ్మకం లేదు’. ఇలా ఆధారపడే పిల్లలకి సంబంధించి ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలు. ఒక బిడ్డ బతికి బట్టకట్టాలంటే కనీస అవసరాలతోపాటు సమాజం పరిసరాలు ఎంతో ముఖ్యం.
చట్టపరమైన అంశాలు : సి.ఆర్‌.సి. విశ్వ బాలల హక్కుల తీర్మానంలో భారతదేశం సంతకం చేసి పిల్లలకు అన్ని హక్కులు అందిస్తామని హామీ ఇచ్చింది. అవన్నీ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకూ వర్తిస్తాయి. భారత రాజ్యాంగం, మానవ హక్కులు వివక్షతలేని సమాన హక్కులు కల్పిస్తుండగా ప్రత్యేకంగా యు.ఎన్‌.సి.ఆర్‌.పి.డి. (కన్వెక్షన్‌ ఆన్‌ ది రైట్స్‌ ఆఫ్‌ పీపుల్‌ విత్‌ డిజబిలిటీ) 2007 అంతర్జాతీయ సదస్సు అనేక అంశాలను తీర్మానించింది. ప్రత్యేక అవసరాలున్న వారి కోసం ఆత్మగౌరవం, సమానత్వం, సాధికారత, సమాచారం, అభివృద్ధి, భద్రతతో, సాంకేతిక సహాయం, వివక్షత, మహిళలు, బాలికలు, ఆర్థిక సహాయం, శిక్షణలు, రవాణా, ఆస్తులనష్టం, అన్యాయం, సమానన్యాయం, గ్యారంటీ, వ్యక్తిగత స్వేచ్ఛ, కౄరత్వం, చులకన, హింసకు వ్యతిరేకంగా శాసనాలు, దోపిడీ, దూషణలు, అభివృద్ధి, పునరావాసం, రక్షణ, వివాహం హక్కు, విలీనవిద్య, విలీన వైద్యం, పనిహక్కు, వసతులు, ఆహారం, నివాసం, బట్టలు, రాజకీయ హక్కు, సాంస్కృతికం, ఆటలు, విశ్రాంతి, ప్రచారం, పరిశోధన, సంఘాలు, గుర్తింపు, అమలు బాధ్యత మొ|| అంశాలు పొందుపరచడం జరిగింది.
సమాన హక్కుల, అవకాశాల చట్టం 1995 : ప్రత్యేక ప్రతిభావంతుల కోసం ఈ చట్టంలో సమానావకాశాలు, హక్కుల రక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం, విద్య, శిక్షణ, స్కాలర్‌షిప్స్‌ మొదలైన అంశాలు పొందుపర్చబడ్డాయి.
నేషనల్‌ ట్రస్ట్‌ ఆక్ట్‌ 1999 : ఈ చట్టం ప్రత్యేకంగా ఆటిజం, సెరిబ్రల్‌ పాల్సీ మెంటల్‌ రిటారేషన్‌, మల్టిబుల్‌ డిజబిలిటీస్‌ కోసం ఏర్పాటు చేయబడింది. ఈ కేటగిరీస్‌ కోసం సంబంధిత అంశాలు, సేవలు ఈ చట్టంలో పొందుపరిచారు. దీని కింద జాతీయ, ప్రాంతీయ సెంటర్స్‌ ద్వారా విద్య, వైద్యం, పునరావాసం కోసం మానవ వనరుల అభివృద్ధిచేసి శిక్షణలు, పరిశోధనలు చేస్తున్నారు.
2016లో ఆర్‌.పి.డబ్ల్యూ.డి (దివ్యాంగుల హక్కుల చట్టం) చట్టం వచ్చింది. వేధింపులు, హింస, దోపిడీ, అనాథలు, ప్రభుత్వ బాధ్యత, సైగలభాష పథకాలు, స్కూల్స్‌లో 5% రిజర్వేషన్‌, 5 సం. వయసు సడలింపు, ఉచిత న్యాయ సహాయం, ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్స్‌, అంతే కాక ఈ చట్టం కింద మోసం చేస్తే 2 సం. జైలు, 5 లక్షల ఫైన్‌, దాడి, రేప్‌, కించపరిచినా, అవమానించినా 5 సం. శిక్ష మొ|| అంశాలు పొందుపరిచారు.
2017 మానసిక ఆరోగ్య చట్టం : త్వరలో 1/3 భారతీయులు మానసిక రుగ్మతలకు లోనవబోతున్నారు. పిల్లల్లో 12% మానసిక రుగ్మతలకు గురౌతున్న పరిస్థితిలో ఈ చట్టం రూపొందించబడింది. వైద్య నిర్ణయాలు, ప్రపంచ ఆరోగ్య సంస్ధ స్టాండర్స్‌ ప్రకారం ట్రీట్‌మెంట్‌, పేషెంట్‌ నామినేషన్‌, పేషెంట్‌ హక్కులు, క్వాలిటీ సర్వీసెస్‌, గోప్యత కాపాడటం, కౄరమైన, అమానమీయ అగౌరవ పరచే చర్యలకు ఈ చట్టంలో శిక్షలు పొందుపరిచారు.
ఐ.సి.పి.యస్‌. (సమగ్ర శశురక్షణ పథకం) కింద జిల్లా స్థాయిలో మానసిక వైకల్యం కలిగిన పిల్లల్ని గుర్తించి సి.డబ్ల్యు.సి. (చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ) ద్వారా స్పాన్సర్‌షిప్‌ ఏర్పాటు చేయవచ్చు. అలాగే అనాథలైన ప్రత్యేక అవసరాలున్న పిల్లల్ని సి.డబ్య్లు.సి ముందు హాజరుపరచి ప్రభుత్వానికి అప్పగించివచ్చు. జె.జె. యాక్టు ప్రకారం పునరావాసం కల్పించవచ్చు.
అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక అవసరాలున్న పిల్లలకోసం పని చేస్తున్నాయి. వారికి సరియైన ప్రోత్సాహం, ప్రభుత్వ సహకారం లభిస్తే మరిన్ని సేవలు అందిచడానికి వీలుంటుంది. ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించడం, పరిశోధనలు చేయడం, ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ఈ స్వచ్ఛంద సంస్థలు పని చేస్తాయి. మెడికల్‌ క్యాంప్స్‌, సదరమ్‌ క్యాంప్స్‌, పెన్షన్స్‌ ఇతర ప్రభుత్వ రాయితీలు, అపరేషన్స్‌, థెరపీలు మొదలైన అనేక అంశాలలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమైనది. ప్రత్యేక అవసరాలున్న పిల్లల తల్లిదండ్రుల నిస్సహాయ పరిస్థితులను అవకాశంగా తీసుకుని దోపిడీ చేసే వ్యాపార సంస్థలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి.
విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం పిల్లలందరికీ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశం నిరాకరించరాదు. వారికున్న వైకల్యాలను నిపుణులైన వైద్యుల ద్వారా అంచనాలు వేసి అవసరమైన శిక్షణలు, పునరావాస చికిత్సలు అందించాలి. ప్రతిజిల్లాలోనూ సమగ్రశిక్ష తరుపున ‘భవిత’ రిసోర్స్‌ సెంటర్స్‌ పనిచేస్తున్నాయి. ప్రత్యేక విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు సెంటర్‌లోనూ, కమ్యూనిటీలోను తమ సేవలందిస్తారు. శారీరక వైకల్యాలుంటే వ్యక్తిగత సంరక్షణ రవాణా, అభ్యాస వైకల్యాలుంటే ఆశ్రయ గృహాలు, సంరక్షణ గృహాలు, నర్సింగ్‌కేర్‌ వంటి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మహిళాశిశు సంక్షేమశాఖ ద్వారా డి.డి.ఆర్‌.సి. (డిస్ట్రిక్ట్‌ డిసేబుల్డ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌) జిల్లా స్ధాయిలో కొన్ని చోట్ల ఏర్పాటయ్యాయి. అక్కడ అన్ని వైద్య సౌకర్యాలు ఇతర సహాయాలు ఉచితంగా పొందవచ్చు. అలాగే సమస్యల పరిష్కారాలకు, న్యాయ సహాయాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధను సంప్రదించవచ్చు. అంతేకాక 15 సం.లు పై బడిన పిల్లలకు ఓకేషనల్‌ శిక్షణ, వికలాంగుల కౌశల్‌ వికాస్‌ యోజనా పథóకం కింద శిక్షణ, ఆ తర్వాత ఉద్యోగావకాశాలు కూడా పొందవచ్చు. పిల్లల్లో ముందు ప్రీ ఓకేషనల్‌ స్కిల్స్‌ పెంపొందించి, వారిలో ఆధారపడే పరిస్ధితిని తగ్గిస్తూ సెల్ఫ్‌ అడ్వకసీపై శిక్షణ ఇస్తారు. దాంతో పవర్‌లెస్‌నెస్‌ టు ఎంపవర్‌మెంట్‌ త్రూ సెల్ఫ్‌ అడ్వకేసి వస్తుంది.
ముగింపు : వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడూ పిల్లలుగానే ఉండే అదృష్టం ఉన్నవాళ్ళు మనచుట్టూ ఉన్నారు. వారిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదీ. ఏ మాలిన్యం అంటని ఈ పిల్లలకు మనం చేయదగ్గ సహకారం మనం చూపే ‘దయ’ మాత్రం కాదు. గుర్తించి, అర్ధం చేసుకొని, వారిని బలపరచడం ద్వారా మన మానవత్వపు ఉనికిని చాటుకునే అవకాశాన్ని వినియోగించుకోవడం మాత్రమే! తేడాగా, తక్కువగా చూస్తూ మన తక్కువదనాన్ని వ్యక్తపరచకుండా, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు మనకి మరింత ప్రత్యేకం అని గుర్తుంచుకుందాం.
– పి.శ్యామలాదేవి,
ఎక్స్‌ చైర్మన్‌, ఛైల్డ్‌వెల్‌ఫేర్‌ కమిటీ
91 99896 86730