బాలల విజ్ఞానశాస్త్ర పద్య, గేయ కవి, రచయిత

బాలల విజ్ఞానశాస్త్ర పద్య, గేయ కవి, రచయితబాల సాహిత్యం అనగానే కథ, కవిత్వం, గేయం వంటివి జ్ఞప్తికి వస్తాయి. నవలలు, నాటికలు మనసులో మెదులుతాయి. అయితే బాలల కోసం మూలకాలు మొదలు భౌతికశాస్త్ర అంశాల వరకు, ప్రయోగాల సారాలు మొదలు సూత్రాలు, ప్రతిపాదనల వరకు చక్కని గేయాలుగా, పద్యాలుగా, కవితలుగా మలచి బాలల కోసం అందించిన వైజ్ఞానికశాస్త్ర బాలల కవి తంగుడిగె శ్రీనివాసరావు.
తంగుడిగె శ్రీనివాసరావు తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులో అక్టోబర్‌ 10, 1969న పుట్టారు. శ్రీమతి గంగాదేవి, శ్రీ శ్రీధరరావు వీరి తల్లిదండ్రులు. ఎం.ఎస్సీ చదివి భౌతిక, రసాయనశాస్త్ర బోధకులుగా ఉన్న వీరు తన బోధనాంశాల్ని గేయాలుగా పిల్లలకు అందించే పనిచేసి అందులో కృతకృత్యులయ్యారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మల్లారంలో విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వీరికి మాతృభాష పట్ల ఆసక్తి, ప్రేమ వీరిని పద్య కవిగా, బాల విజ్ఞాన సాహితీవేత్తగా మలిచాయి. విద్యాబోదనలో మండల స్థాయిలోనూ, నిజామాబాద్‌ జిల్లా స్థాయిలోనూ ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం అందుకున్నారు. రోటరీ క్లబ్‌, టి.యు.పి.ఎస్‌ నిజామాబాద్‌ సంయుక్తంగా వీరికి ఉపాధ్యాయ పురస్కారాన్నిచ్చి సత్కరించాయి.
నాలాంటి వారికి గడబిడగా కనిపించే మూలకాలని ఎంత బాగా అర్థం చేసుకుని వృత్తిరీత్యా పాఠాలు బోధిస్తున్నారో, అంతే ధ్యాసగా, అంతకు మించి ప్రేమగా పద్మాన్ని తన టెస్టు ట్యూబ్‌లో పండించి ఫలితాలను బాలల పరం చేస్తున్నారు తంగుడిగె. వీరి పద్య రచన ‘భక్తి మాలిక’. ఇది ఆటవేలది పద్యాలతో పాటు ఉత్పలమాల వంటి వృత్తాలున్న రచన. ఇందులో నవవిధ భక్తిమార్గాలకు నిదర్శనంగా జ్ఞాన సరస్వతి మొదలు చిన్నికృష్ణుని స్ఫురణాంకితంగా పద్యాలు చెప్పారు. ‘చదువులమ్మ మాట చక్కని పూదోట/ పద్మమల్లి నీకు పందిరేతు’, ‘పంకమందు పుట్టె పంకజము లలిత/ కళలకమ్మ, కవిత కట్టు మనెను/ అమ్మతోడు నిలిచి అమృతము పంచిన/ పద్యమాల నల్లి పాలుపోస్తి’ వంటి తేట తెలుగు పద్యాలు చదివిన పాఠకులకు ఈ కవి విజ్ఞానశాస్త్ర బోదకుడంటే ఆశ్యర్యం కలుగక మానదు. ‘వృత్త మాలిక’ వీరి మరో పద్యకృతి. పర్యావరణం పట్ల ప్రేమ, బడిలోంచే బాలలకు స్వచ్ఛతపట్ల, ఆకుపచ్చని ఆశయాలపట్ల ప్రేమ కలిగించేలా పలు రచనలు చేశారు. ఈ కోవలోనే ఈయన హరితాన్ని కాంక్షిస్తూ బాలల కోసం రాసిన ‘అష్టోత్తర హరిత హారము’ చక్కని ఆటవెలది రచన. ‘గాలి నిచ్చె చెట్టు గాయమైవుండగ / నీరుపోసి పెంచు నీతిగుండు/ నీడనిచ్చి మీకు నీరాజన మొలుకు/ వానచుక్క వచ్చె వందనాలు’ అష్టోత్తరములోని రచన.
ఆసక్తి, ఆలోచనతలతో పాటు పాఠాన్ని పాటలుగా చెప్పాలన్న తపనతో చేసిన రచనలు ‘మూలకాల పెట్టె’, ‘సైన్స్‌ బాల వినోదిని’. ఒకటి పద్య రచన, మరొకటి గేయ రచన. మూలకాల పట్టిక సైన్స్‌ను చదివిన విద్యార్థులకు తెలుసు. అటువంటి పట్టిక గుట్టును పద్యాల్లో చెప్పి మెప్పించిన బాలల కవి తంగెడుగ. మూలకాలు, ఆవర్తన పట్టికలు, అయోనైజేషన్‌ ఎనర్జీ వంటివి మామూలుగా బాలల బుర్రలోకి ఎక్కడం కష్టం. అయితే పట్టికలోని గ్రూపులు, ఇతరాలు అన్ని సులభంగా అర్థమయ్యేలా చెప్పడం సాధ్యం కాదు. అటువంటి దానిని ‘ముద్దగా లభించు పుడమిపై లిథియము/ ఉష్ణ వాహకముగ ఉద్బవించు/ చర్మరోగమునకు చల్లని మందయ్యె/ మొదటి గ్రూపులోన ముద్దు గొలిపె’ అంటే ముద్ద రూపంలో దొరికే లిథియం ఒక ఉష్ణవాహకమని, చర్మరోగానికి మందని చెబుతారు. ఈ కోవలోనే ‘స్వల్ప సాంద్రత గల స్ఫటిక రూపమ్మిదె/ ఆర్సెనికు విషమ్ము అవనిలోన/ వేడి పొగల గక్కు వెల్లులి వాసన/ కంచు గట్టిదనము దెంచు నిదియె’, ‘హాలోజనులలోన హాయిగా విహరించు/ పురుగుమందులందు పుష్కలమయి/ గ్రీకు పదమనంగ షోకైన బ్రోమిను/ అధికచర్య జరుపునట్టి ద్రవము’ అని చెబుతారు. ఈ కోవలో ‘ఎస్‌’, ‘పి’, ‘డి’, ‘ఎఫ్‌ (లాంథనైడులు), ‘ఎఫ్‌’ (ఆక్టినైడులు), జడవాయువులను గురించి చక్కని పద్యాలు కూర్చారు. ‘వాసనగల జడవాయువై గగనాన/ హీలియమ్ము దిరుగునని/ గ్రహణ సమయమందు కనుగొన బడినట్టి/ తేలికైన ముఖ్య మూలకమిది’ అని జడవాయుల గురించి చెప్తారు. ‘సైన్స్‌ బాల వినోదిని’ గేయ సంపుటిలో ‘మూలకాల ఆవర్తన పట్టిక’ను ‘క్షారమృత్తికంటు కాంతిని వెదజల్లె/ హాలోజనులు చేరి హాయిగుండె/ అడుగు నుండె గుంపు అంతరపరివర్త/ తీరికయ్యె/ జడము గుండి చివరి జడవాయువై చేర/ గ్రూపు కట్ట నిలిచిగూడ చేసే’, ‘శక్తి’ గురించి ‘వెలుగునిచ్చె నినుడు వెంకన్న సాక్షిగా/ సహజశక్తి నిచ్చి సాగిపోయె/ సోపతెట్టు ముందు సోలారు కుక్కరు/ రక్ష చేయు శక్తి రాత్రిపూట’ ‘ద్వని’ గురించి ‘భూమి ఊగి పోయి భూకంపమేవచ్చే/ కడలిలోన ధరణి కదలిపోగ/ సిగలిచ్చి చూపె సిస్మోగ్రఫీ నచట/ ప్రాణ నష్టమయ్యి పగిలె పుడమి’ అంటారు. ఇంకా ‘విద్యుత్‌’, ‘కృత్రిమ ఉపగ్రహాలు’, ‘కర్బన రసాయనాలు’ ఇలా అనేక అంశాలను బాలలకు అర్థమయ్యేలా చెబుతారు తంగెడుగ. వైజ్ఞానికాంశాల్ని సాహిత్యంగా రాయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. మరిన్ని మంచి రచనలు బాలల కోసం తేవాలని బాలల విజ్ఞానశాస్త్రకారుడు తంగెడుగ శ్రీనివాసరావును కోరుతున్న. జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548