బాల సాహిత్యం అంటే కేవలం నీతులు బోధించి ఊరుకోవడం కాదు, ‘బాల సాహిత్యం పిల్లల కోసం, పిల్లల ఆనందం కోసం రాసే సాహిత్యమని’ నమ్మి ఆ దిశగా పయనిస్తున్న పెద్దలు, ‘తిరుమల’ పేరుతో అందరికీ తెలిసిన ఈటూరి అనంత పద్మనాభం. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ బజార్‌లో అక్టోబర్ 5, 1956న పుట్టారు యీటూరి. శ్రీమతి, శ్రీ సూర్యలక్ష్మి, రామచంద్రయ్య ఈటూరి వీరి తల్లిదండ్రులు. తెలుగు సాహిత్యంలో బి.ఎ చదివిన వీరు వ్యవసాయం, వ్యాపారం ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు.
ఈటూరి ఖమ్మం కేంద్రంగా ఎనభయ్యవ దశకంలో ‘రమ్య సాహితీ సంస్థ’ను స్థాపించి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత లలిత గీతాలు, జానపదాలు కూర్చిన ఈటూరి వాటిని ‘మల్లి మల్లెలు’ పేరుతో అచ్చులోకి తీసుకు వచ్చారు. వ్యాపార రంగంలో స్థిరపడి, ఇతర వ్యాపకాలతో సాహిత్యానికి దూరంగా వుండి ఇరవై అయిదేళ్ళ సుదీర్గ విరామం తర్వాత మళ్ళీ సాహిత్య సృజనా రంగంలోకి లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈటూరి బాల సాహిత్యాన్ని తన ప్రధాన స్రవంతిగా ఎన్నుకుని రచనలు చేయడం అభినందనీయం.
పుస్తక పఠనం, రచనా వ్యాసంగం తన ప్రధాన వ్యాపకంగా వున్న ఈటూరి బాల సాహిత్యంలో అచ్చంగా ఐదు పుస్తకాలు రచించి ప్రచురించారు. మొదటి రచన ‘బాలా నందం-బ్రహ్మానందం’ మే 2017లో అచ్చయ్యింది. మిగతా నాలుగు పుస్తకాలు దాదాపు అయిదారేళ్ళ సమయంలో రాసినప్పటికీ అవి నాలుగు పుస్తకాలుగా ఒకేసారి నవంబర్ 2022లో అచ్చయి, ఒకే రోజున ఆవిష్కృతమయ్యాయి. ఆ పుస్తకాలు ‘నవ్వులు-పువ్వులు’, ‘తెలుగు-వెన్నెల’, ‘తెలుగు- వెలుగు’, ‘ఆటలు-పాటలు’ మొదలగు బాల గేయాలు, కవితలు.
యాదృచ్చికమే కావచ్చు కానీ ఇటీవల ఖమ్మం నుండి అన్ని వయస్సుల వారు బాల సాహిత్య సృజన చేయడం మనం చూస్తున్నాం. సీనియర్ కవులు, రచయితలు, పరిశోధకులు మొదలుకుని బడి పిల్లల వరకు వీరిలో ఉన్నారు. ఈటూరి అనంత పద్మనాభం ఆరుపదులు దాటిన వయస్సులో ఉత్సాహంగా రచనలు చేయడం మనం చూడవచ్చు. ఒకేసారి అచ్చయిన ఈ నాలుగు పుస్తకాలే కాక మరో నాలుగు పుస్తకాలకు సరిపోయే గాసం వీరి అమ్ముల పొదిలో సిద్ధంగా ఉంది. త్వరలో అవి కూడా అచ్చులో రానున్నాయి.
కవి అనంత పద్మనాభంకు ఒక చక్కని ‘అభిలాష’ వుంది. ‘పిల్లల్లాగే ఉండాలి/ ఎప్పుడు నవ్వుతు ఉండాలి/ లోకం తెలవని పాపల్లే/ ముద్దులు మూటలు కట్టాలి/ కల్లాకపటం ఎరుగక/ కోపం తాపం తెలవక/ మల్లెలలా స్వచ్ఛంగా/ పరిమళాలు వెదజల్లాలి’ అని. మంచి పిల్లలు ఎలా ఉండాలో తన గేయాల్లో చెబుతారీ తాతయ్య, అంతేకాదు పిల్లల ఆలోచనలు వాళ్ళ తరపున చెబుతారు, పిల్లల అల్లరిని తన గేయాల్లో వాళ్ళ పక్షాన వకాల్తా తీసుకుంటారు. పిల్లల మమతలేమిటో తన గేయాల్లో చూపిస్తారు. ఆటలు, పాటలు, పనులు, చదువులు, సంస్కారాలు ఒక్కటని కాదు అన్నింటినీ అనంతపద్మనాభం అనంతంగా, అందంగా తన బాల గేయాల్లో చూపిస్తారు. ‘ఆటలె పిల్లలకు ఆరోగ్యం/ ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న మాట చెప్పిన పద్మనాభం అందుకు పిల్లలను సన్నద్దం చేస్తూ ఆటలాడితె ‘మగతతనం మాసిపోయి/ విజ్ఞానం వికసిస్తుంది’ అని చెబుతారు. ‘ఊరంటె గుడి ఉండాలి/ ఊరంటె బడి ఉండాలి’ అని చాటిన ఈ బాలల కవి ‘బడిలోన పిల్లలు కిలకిల లాడాలి’ అని ఆకాంక్షిస్తారు. ‘మల్లెల బంధం/ మధుర సుగంధం/ తల్లీ పిల్లల/ అనుబంధం’ అని చెప్పే ఈటూరి ‘ఉయ్యాలలో మా బాబు/ ఊరంతటికి ముద్దు/ మా చిన్ని బాబు/ మాకెంతో ముద్దు’ అంటారు. ‘పల్లెలు పచ్చగ ఉండాలి/ ఎల్లరు సుఖముగ ఉండాలి/ పాడి పంటలతో కళకళలాడుతూ/ దేశం పచ్చగ ఉండాలి’.
పోతన చిన్నికృష్ణుని బాల్య క్రీడలను, లీలలను మందార మకంరందాలొలికేలా వర్ణిస్తే, ఈటూరి వెలుగు-వెన్నెల నిండా అంతటా చిన్ని కృష్ణుని లీలలను, ఆటలను, పాటలను పిల్లల కోసం చెబుతారు. ‘చెట్టు మీద బావ/ చెట్టు కింద నేను’, ‘అల్లరివాడు నల్లనివాడు/ కంటికి కనపడడు/ చేసే అల్లరి అంతా చేసి/ గమ్మున ఉంటాడు’ అంటాడు. ‘మోహనకృష్ణ’ గేయంలో ‘పిల్లన గ్రోవిని పెదవిన పెట్టి/ పిల్లలనంత చేరగ పిలిచి/ వేణువు మ్రోగించాడు/ తీయని రాగం పాడాడు’ అని చెబుతాడు. ఇంకా పల్లెలు, గ్రంథాలయాలు, పౌష్టికాహారం, శ్రమశక్తి, దేశం, భక్తి, దేశభక్తి, ఇల్లు, పిల్లలు ఇలా కాదేది అనర్హం అన్నట్టు బాలల కోసం, వారి ఆనందం కోసం తనకు తారసపడిన ప్రతిదానిని తన మనవలు, మనవరాళ్ళతో పాటు తెలుగు పిల్లలకు కానుకగా అందిచారీ తాత ఈటూరి అనంత పద్మనాభం. జయహౌ! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్
9966229548