పిల్లల ఆత్మ ధైర్యం!

Children's spirit courage!భయంకరంగా జరుగుతూన్న యుద్ధం వల్ల కుప్ప కూలిపోయిన మేడలు, చెల్లా చెదరుగా పడివున్న కాంక్రీట్‌ కప్పులు, గోడలు చూపులు వెళ్లినంతవరకు కనిపిస్తున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రెస్‌ అండ్‌ టీవి రిపోర్టర్‌, కెమెరామెన్‌ శిథిలాలను దాటుకొంటూ కవరేజ్‌ కోసం ముందుకు వెళ్లుతున్నారు. హృదయవిదారక దృశ్యాలను చిత్రీకరించసాగాడు కెమెరామెన్‌. పైన ఆకాశంలో రాకెట్లు, బాంబులు, బెలెస్టిక్‌, క్రూజ్‌ మిసైల్స్‌ వగైరా వగైరాలు విహార యాత్రలకు వెళ్లుతున్నట్లున్నాయి. మానవ ప్రాణాలకు విలువ లేనట్లుంది. అప్పుడప్పుడు అగ్నిగోళాలు కనులకు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఎప్పుడు ఏ వైపు ఎక్కడ ఏమి పడతాయో చెప్పలేని పరిస్థితులు. సైరన్‌ల మోతలు కర్ణభేరీలను చేధిస్తున్నాయి.
కొద్ది దూరంలో దహనక్రియల కోసం ఉమ్మడిగా సమాధులు ఏర్పాటు చేసి ఉన్నాయి. కనీసం ఇరవై ఐదు మీటర్ల పొడువు ఐదు మీటర్ల వెడల్పు మూడు మీటర్ల లోతులో ఉన్న కాలువ లాంటి స్థలంలో మూడేండ్ల నుంచి పదేండ్ల పసిపిల్లలు హాయిగా అనందంగా తయారుగా ఉన్న ఆ సమాధులలో ఆడుకొంటున్నారు.
ప్రెస్‌ రిపోర్టర్‌ ఆశ్చర్యంగా అక్కడ ఆడుకొంటూన్న ఓ ఆరేడేండ్ల ముద్దు లొలికే పిల్లవాడిని అడిగాడు, ”మీరిలా ఆడుకొంటున్నారు… పైన రాకెట్లూ ఎగురుతున్నాయి. ఏ క్షణంలోనైనా మీ మీద పడొచ్చు…మీకు భయంగా లేదా!?”
”భయం దేనికి మా అమ్మ నాన్న అక్కా చెల్లెళ్ళు… ఇంకా ఎందరో మాకు తెలిసిన వాళ్లు… మాతో అడుకున్న వాళ్లు… ఇదిగో ఇక్కడే షహీద్‌ (అమరులు) అయి ఉన్నారు. మేం ఎప్పుడు వాళ్లతో కలుస్తామో తెలియదు!?” అని జవాబిచ్చాడు భజాలనెగురేస్తూ. అప్పటికే మరికొందరు పిల్లలు అక్కడ గుమిగూడారు. వాళ్ల మొహాలపై విషాద రేఖలున్నా పెదవులపై చిరునవ్వులు మొగ్గ తొడగసాగాయి. ‘బ్రేవ్‌ కిడ్స్‌’ అనుకొంటూ ముందుకెళ్లారు వారిద్దరు.
ప్రెస్‌ అండ్‌ టీవి రిపోర్టర్‌ గా పాలస్తీనా భూభాగంలో నిత్యం జరుగుతూన్న అమానుషాలు, శిథిలాలలో చిక్కిపోయిన జీవితాలు, వాటి కింద ఇంకా వెలికితీయని మృతదేహాల కుళ్లిపోయిన వాసన భీభత్స యుద్ద వాతావరణాన్ని, సిగ్గు పరెచేలా నాసిక పుటాలను అదరగొట్టుతున్నాయి. నలు వైపులా వికృత దృశ్యం. అనుక్షణం మృత్యు భయంతో కొట్టుమిట్టాడుతూన్న సమయంలో పిల్లల ఆటల నవ్వుల కేరింతలు వింతగా అనిపిస్తున్నాయి ఆక్కడి పరిసరాలకు.
ఎడతెరపి లేకుండా, ఎక్కడబడితే అక్కడ బాంబుల వర్షం కురుస్తోంది. అయోమయ భవితవ్యాన్ని పాలస్తీనా అనాధ బాల్యం అక్కడ చావు కోసం ఎదురు చూస్తూ ఆడుకొంటున్నారు.
కొందరు పిల్లల చెతులపై వారి వారి పేర్లు రాసి ఉన్నాయి.
ఓ ఆరేండ్ల పిల్లవాడిని అడిగాడు రిపోర్టర్‌, ”నీ చేతులు బాగా దుమ్ముపట్టి ఉన్నాయి. ఎన్ని రోజుల్నుంచి చేతులు కడుక్కోలేదు?”
”మా అమ్మ ఈ బిల్డింగ్‌ కింద ఇంకా అలాగే పడి ఉంది. ఆమెను బయటికి తీయడానికి ఇంత వరకెవరూ రాలేదు. మేము చచ్చిపోతే మా ఆచూకీ కోసం మా అమ్మలు ఇలా మా చేతుల పై మా పేర్లు రాస్తుంటారు. కాని మా అమ్మ చనిపోయింది. ఆమె రాసిన పేరును చేతులు కడిగి చెరుపేసుకోదలచుకోలేదు” అని అరబ్బిలో చెప్పి పిల్లలతో ఆడుకోవడానికి పరుగెత్తుకొంటూ వెళ్లి వాళ్లతో జత కూడాడు.
రిపోర్టర్‌ కండ్లలో కన్నీళ్లు ఆగకుండా జలజల రాలాయి.
– మొహ్మద్‌ అమ్జద్‌ అలీ,
00 966 507662638