పిల్లలకు వేసవి శిబిరాలు (సమ్మర్ క్యాంప్స్) ఓ ఆట విడుపులా వుండాలి. ఆ శిబిరాల్లో పిల్లలు ఆనందోత్సాహాల డోలికల్లో తేలియాడాలి. ఏడాది పొడుగునా బడిలో పడిన శ్రమను మైమరిచిపోవాలి. మరల బడి తెరిచినప్పుడు కావాల్సిన శక్తిసామర్థ్యాలు తిరిగి పొందేలా (రీచార్జి) పునరుత్తేజితులు కావాలి.
యునిసెఫ్ (ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి) పేర్కొన్నట్టు ఈ పుడమిలోని ప్రతి చిన్నారి (బాలుడు/ బాలిక) ప్రత్యేకమే. అయితే ఆ చిన్నారికిప్పుడు బాల్యమే లేకుండా పోతున్నది. ఆర్థిక, సామాజిక అంతరాలు లేకుండా వారికి అందవలసిన ఆనందాల బాల్యం అందకుండా పోతున్నది.
మనదేశంలో పాఠశాల విద్యావ్యవస్థ చిన్నారి కేంద్రంగా సాగడం లేదు. ఉపాధ్యాయ కేంద్రంగానే నడుస్తున్నది. కావున బాలల సమగ్ర వికాసం (కాంప్రహెన్సివ్ డెవలప్‌మెంట్ – సర్వతోముఖాభివృద్ధి) అంటే అటు పాఠశాల పెద్దలకు, ఇటు తల్లిదండ్రులకు చాలామందికి అర్థం కాకుండా వున్నది. నేడు అందరిదీ ఒకటే మాట. కెరీర్.. కెరీర్.. కెరీర్.. చదువు.. చదువు.. చదువు.. మార్కులు.. మార్కులు.. మార్కులు.. ర్యాంకులు.. ర్యాంకులు.. ర్యాంకులు… చిన్నప్పటి నుండే ఐ.ఐ.టి., ఎమ్సెట్, సి.ఎ., సివిల్స్.. కోచింగ్‌లు. ఈ రీత్యా చాలా క్యాంప్స్ మరల ఇంగ్లీషు, లెక్కలు చదివించేలా, బట్టీయం పట్టించేలా తరగతి గది జైళ్లలా మారుతున్నాయి. కొన్ని క్యాంప్‌లు పర్సనాల్టి డెవలప్‌మెంట్ (వ్యక్తిత్వ వికాసం) పేరుతో డబ్బు చేసుకుంటున్నాయి. తల్లిదండ్రుల ఆశలను క్యాష్ (సొమ్ము) చేసుకోవడంలో కార్పొరేట్ సంస్థల మాదిరి ఏ మాత్రం వెనుకాడటం లేదు. వేలకొలది రూపాయలు ఫీజులు వసూలు చేసుకోవడంలో సిగ్గుపడడం లేదు. చింతించడం లేదు. ఈ ఒత్తిడి వాతావరణంలో పిల్లలు కడకు ఆత్మహత్యలకు చేరువవుతున్న వాస్తవాన్ని మనం కాదనలేం.
కార్టూన్ సన్నివేశం : తల్లిదండ్రులు ఓ పిల్లవాడిని ఓ కార్పొరేట్ స్కూల్లో చేర్పించడానికి తీసుకువచ్చారు. ఆ స్కూల్లో పనిచేస్తున్న సఫాయి కార్మికుడ్ని చూపిస్తూ తండ్రి కోపంగా అంటున్నాడు. ‘వెధవా! నీవు సరిగ్గా చదువుకోలేదనుకో పెద్దయ్యాక అదిగో అలా పనిచేస్తూ నీచంగా బతకాల్సి వస్తుంది. తెలుసా’
తల్లి మాత్రం అనునయంగా బాబూ నీవు బాగా చదువుకుని పెద్దవాడయ్యాక ఇలాంటి పేదవాళ్లకి సహాయం చేయాలి తెలుసా!
రెండింటా ఒకటే దృశ్యం. ఒకటే సన్నివేశం. కానీ తల్లిదండ్రుల ఆలోచనల్లో పిల్లల చదువుపట్ల ఎంత తేడా? భిన్న దృక్పథాలు అవి… ఒకటి – సాటి మనిషిని మనిషిగా గుర్తించకుండా ఆ శ్రమను గౌరవంగా చూడకుండా నీచంగా చూసే చెడ్డ సంస్కృతి. రెండు – సాటి మనిషిని మనిషిగా చూస్తూ, ఆ శ్రమనూ గౌరవిస్తూ వారికి చదువు సహాయ పడాలనే సానుకూల మంచి సంస్కృతి.
ఈ రెండు సంస్కృతులు మన ఆలోచనల్లో మన జీవన విధాల్లో కలసిపోయాయి. ఫలితం పిల్లలు గందరగోళ అగాధంలో పడిపోతున్నారు.
ఇప్పుడున్న వ్యవ్యస్థలో ఆ కార్టూన్, పిల్లల ఎదుగుదల పట్ల పెద్దల మనస్తత్వానికి అద్దం పడ్తున్నది. ఈ పెద్దల్లో తల్లిదండ్రులే కాదు, ఉపాధ్యాయులు కూడా వుంటున్నారు.
చదువు అనేది కేవలం కెరీర్ అనుకుంటూ, దాని కొనసాగింపుగా భద్రత కలిగిన ఉద్యోగం. అదీ తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం వచ్చేది, తద్వారా కంఫర్ట్‌ఫుల్ జోన్‌లోకి ప్రవేశించి ఆదాయాలు, ఆస్తులు పెంచుకుంటూ ఇతరులపై ఆధిపత్యం చలాయించడం, సౌకర్యవంతమైన లాలస జీవితం గడపడమే అని, చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా, ఎవరెట్టా పోతే మనకేంటి, మనం బాగుంటే చాలు అనే స్వార్థ చింతనలో పడిపోవడం.. కొండకచో చిన్నచిన్న అక్రమాలు, అన్యాయాలు, అవినీతి పద్ధతులు, చూసీ చూడనట్టు పాటించినా తప్పులేదనే భావనకు రావడం… ఇవన్నీ షరా మామూలుగా దైనందిన జీవితంలో భాగంగా చాలామందికి జరిగిపోతున్నాయి.
మన రాజకీయ వ్యవస్థే అలా వున్నది కూడా. కార్పొరేట్లు, పాలకులు, ‘క్విట్‌ప్రోకో’ మాదిరి ఒకర్ని మరొకరు సమర్ధించుకునేలా ఎన్నికల బాండ్ల వ్యవహారం బట్టబయలైన సమాజంలో మనం జీవిస్తున్నాం మరి. ఆ ప్రభావం పెద్దలపై పడి, పెద్దల నుండి పిన్నలకు జారకుండా ఎలా వుంటుంది? అలాగే దుర్వ్యసనాలు మందు, సిగరెట్లు, ఖైనీ, గుట్కాలు, కూల్‌డ్రింక్స్, కుర్‌కురేలు ఆరోగ్యాన్ని హరించేవి. ఫోన్‌లో బెట్టింగ్‌లు కట్టడం, గేమ్స్ ఆడడం, పోర్న్ కల్చర్ (బూతు చిత్రాలు) చూడడం, హింస, అకృత్యాలకు పాల్పడడం అన్నీ పెద్దల నుండి పిన్నలకు చేరేవే. చివరికిప్పుడు డ్రగ్స్ కూడా పాఠశాల విద్యార్థులకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో మన బాలలను ఈ భయంకర విపత్తుల నుండి రక్షించుకోవడం మనకో పెద్ద టాస్క్. యజ్ఞం వంటిది.
అందువల్ల ఈ తరుణంలో పెద్దలైన ప్రతి ఒక్కరూ మన పిల్లల వికాసానికి, అభివృద్ధికి తోడ్పడుతున్నామా? లేక అవరోధంగా మారుతున్నామా? లేక మన దుర్బుద్ధితో, చెడు అలవాట్లతో చెడగొడుతున్నామా? అనేది తేల్చుకోవాలి.
ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ స్వచ్ఛంగానే వుంటారు. ఏ కల్మషం లేకుండా ఎదగాలనే కోరుకుంటారు. మన పిల్లలంతా మన భావి సంపద. దేశ సంపద. అందమైన భవిష్యత్తును పిల్లలకు అందించడం పెద్దలుగా మన బాధ్యత కూడా. ముందుగా ఈ బాధ్యతను ఉపాధ్యాయులు (టీచర్లు) గుర్తెరగాలి. ప్రజాకవి కాళోజీ అన్నట్టు పుట్టుక నీది, బాల్యం నీది, బతుకంతా సమాజానిది. సమాజం శ్రమ లేకుండా ఎవరూ బతకలేరు కదా.
ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా వుండాలంటే అర్ధం తెలియని విషయాలు తెలుసుకోవడమే కాదు, చేసిన, చేస్తున్న తమ తప్పులను, పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు సాగడం. లేకుంటే వారు పాఠాలు చెప్పే పద్ధతి ‘ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి’ అన్నట్టు తయారవుతుంది పరిస్థితి. ప్రతివారు ‘తమరు శుద్ధం, తడికకు బెజ్జం’ అన్నట్టు ఉంటే పిల్లల్లో ఎలా మార్పు వస్తుంది? (ఎన్నికల్లో రాజకీయనేతల ప్రసంగాలు చాలామందివి అలాగే వున్నాయి కదా) ఆవు చేలో మేస్తే మరి దూడ గట్టున మేస్తుందా..?
ఇకపోతే పిల్లల చదువులు ప్రధానంగా రెండు విద్యలపై ఆధారపడి వుంటాయి. 1. శాస్త్ర సాంకేతిక విద్య, 2. సామాజిక విద్య. ఈ రెండింటిలో అంతర్లీనంగా మానవీయ విలువలు ప్రస్పుటించాలి. ప్రతిబింబించాలి.
కానీ అలా జరగడం లేదు. విద్య ప్రైవేటీకరణ అవుతున్న కొద్దీ కెరీరే ముందుకొస్తున్నది తప్ప సమానత్వం, ప్రజాస్వామ్యం, సేవాభావం, మానవత్వం మొదలైన భావాలు కనుమరుగైపోతాయి. అప్పుడు పిల్లలు నిజంగానే కరుడుగట్టిన స్వార్థచింతనాపరులుగా ఏదీ పట్టించుకోని వ్యసన బానిసలుగా మారుతూ వ్యక్తిత్వ హననం వైపు కొట్టుకుపోతారు. ఇప్పుడు చాపకింద నీరులా జరుగుతున్న ప్రమాదం అదే.
అలా కొట్టుకుపోకుండా వుండేందుకు ఈ సమ్మర్ క్యాంప్స్ పిల్లలను సమగ్ర వికాసం వైపుకు నడిపించాలి. ఆటపాటలతో అలరించాలి. కథలు చెప్పాలి, బొమ్మలు గీయించాలి. క్రాఫ్ట్స్ పనులు చేయించాలి. నాటికలు వేయించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా భాషా, సాహిత్య, సంగీత మధురిమల రుచి చూపించాలి. మానవీయ విలువలు బోధించే ప్రత్యామ్నాయ బోధనకు పెద్ద పీట వేయాలి.
అసలు పిల్లలందర్నీ శారీరక, మానసిక సామాజిక ఆరోగ్యంతో ఎదిగేలా చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ) ఏనాటి నుంచో ఘోషిస్తుంది.
ఆటలు, ఆట స్థలాలే లేకపోతే శారీరక ఆరోగ్యం ఎలా వస్తుంది? కథను శ్రద్ధగా వినడం చేతకాకపోతే మనసులో సరైన ఆలోచనలు, తర్కం, విచక్షణ, ఊహా సామర్ధ్యాలు ఎలా మొదలవుతాయి? ఆ మానసిక ఆరోగ్యం, వ్యాయామం (సైకలాజికల్ ఎక్సర్‌సైజ్) లేకపోతే మనస్సు ఎలా లలితమవుతుంది? కారుణ్య భావనలు ఎలా మొలుస్తాయి?
అలానే కులమతాలకు అతీతంగా స్నేహపరిమళాలు పిల్లల్లో పరుచుకుంటేనే కదా సామాజిక ఆరోగ్యం వెల్లివిరిసేది. ముఖ్యంగా బాలల హక్కులు గుర్తిస్తేకదా… వారికి పెద్దలుగా మనం సామాజిక ఆరోగ్యాన్ని అందివ్వగలం. మనం ఎంత పైపై చదువులు చదివినా, మనమే కులమతాల రొంపిలో దిగితే మన పిల్లల్లో వికాసం ఎలా వెల్లివిరుస్తుంది?
అందుకే సమ్మర్ క్యాంప్‌లు పిల్లల కేంద్రంగా సాగే బోధనకు తెరతీయాలే తప్ప, మామూలు తరగతి గదుల పాఠాల మాదిరి సాగరాదు. పిల్లల కన్నా పెద్దలకు ముఖ్యంగా సమ్మర్ క్యాంప్ నిర్వాహకులకు ఈ స్పృహ వుండాలి.
సమ్మర్ క్యాంప్ పెడుతున్నామంటే పిల్లలకు ఆనందంగా వుండే వాతావరణం సృష్టించాలి. ‘ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం. ఆటలకన్నా పాటలకన్నా అల్లరి చేయడం మరీ ఇష్టం’ అన్నట్టు పిల్లలు వుంటారు. ఆ అల్లరిని (ఎనర్జీని) గుర్తించి, రుజుమార్గంలో నడిపించేలా ఆ టీచర్లు (రిసోర్స్ పర్సన్స్) వుండాలి. పిల్లల్లో పిల్లల్లా కలిసిపోవాలి. టీచర్లంటే భయం వుండకూడదు. మేం ఏదైనా స్వేచ్ఛగా నేర్చుకోగలమనే ఆర్మస్థైర్యం పొందాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆచరణ ద్వారా అనుభవసహిత జ్ఞానాన్ని నేర్చుకోవడాన్ని (లెర్నింగ్ బై డూయింగ్) అలవాటు చేయాలి.
అందుకు కథలు చెప్పాలి. పాటలు నేర్పాలి. మ్యాజిక్ చేయించాలి. ఆటలు ఆడించాలి. క్రాఫ్ట్‌వర్క్ చేయించాలి. ప్రతిదీ వారు సొంతంగా ఆలోచిస్తూ, సొంతంగా పని చేస్తున్నామనే ఉత్సాహాన్ని వారిలో రేకెత్తించాలి. అందుకోసం ఈ టీచర్లు ఎప్పటికప్పుడు పిల్లల నుండి కొత్త విషయాలు నేర్చుకుంటూ బోధనా ప్రణాళికలను నవ్యంగా, నాణ్యంగా రూపొందించుకోవాలి. మనం మొండిగా, యంత్రంగా మారితే పిల్లలు కూడా మొండిగా యంత్రంగా మారిపోతారనే విషయం ఆ టీచర్ల మదిలో సదా మెదులుతూ వుండాలి.
పిల్లలు చేసే ప్రతి పనిలో ఓ కళ, ఓ సృజనాత్మకత వుంటుందనే విషయం గ్రహించాలి. దాన్ని కాపాడుతూ పిల్లల్ని ముందుకు నడిపించాలి. ఆ క్రమంలో పిల్లలు తమ బలాలను, బలహీనతలను గుర్తెరిగి, బలాలను పెంచుకుంటారు. బలహీనతలను అధిగమిస్తారు. అప్పుడు సెల్ఫ్ అడ్వకసీ (స్వయం నిర్ణయాధికారం)తో ఎదుగుతారు. అలా తమ జీవితంపై తమకే సాధికారం ఏర్పడేలా సవ్యంగా నడుచుకుంటారు. సమ్మర్ క్యాంప్‌లు అలా పిల్లల సమగ్ర ఎదుగుదలకు బీజాలు వేయాలి. బాలల మీద ప్రేమ వున్నవారు ఇప్పటికే అలాంటి క్యాంప్‌లు, బాలోత్సవాలు నిర్వహిస్తూ ప్రత్యామ్నాయ బోధనకు శ్రీకారం చుడుతున్నారు. పిల్లల్లో మంచి సంస్కృతికి, వికాసానికి బాటలు వేస్తున్నారు.
– కె.శాంతారావు, 9959745723