– అమ్మో ఇంత పిరమా?
– మామిడి పచ్చళ్ల తయారీపై ప్రభావం
నవతెలంగాణ – నసురుల్లాబాద్
మార్కెట్ లో ఏ వస్తువు ధర చూసిన ఇరవై నుంచి ముప్పయి రూపాయలు ఎక్కువగానే అమ్ముతున్నారు. కొందరు కృత్రిమ కొరత సృష్టించి మరి రేట్లు పెంచేస్తున్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని బీర్కూర్ నస్రుల్లాబాద్ బాన్సువాడ తదితర మండలాల్లో నిత్యవసర వస్తువులు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. మామిడి కాత చేతికి అందడానికి తోడు వేసవి సెలవులు కావడంతో జనాలు పచ్చళ్లు చేసుకోవడంపై దృష్టి సారిస్తారు. మిర్చి, అల్లం, వెల్లుల్లి వంట నూనె ధరలు చుక్కలనంటుతుండంతో పచ్చడి చేసుకోవడానికి సాధారణ జనాలు జంకుతున్నారు. మామిడికాయ పచ్చడి చేసుకోవడానికి ప్రధానంగా అల్లం, వెల్లుల్లి, మిర్చి పొడి అవసరం. గత సంవత్సరం అల్లం, వెల్లుల్లి ధరలు కిలో రూ.100 నుంచి 120 వరకు ఉండగా, ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ.240, అల్లం నాణ్యమైనది రూ.140 చొప్పున విక్రయిస్తున్నారు. పచ్చళ్లకు వినియోగించే కారం పొడి కిలో రూ.600 వరకు ఉంది. నువ్వులు, ఆవాల ధరలు కూడా గతంలో కంటే పెరిగాయి. ఈ సంవత్సరం మామిడికాత ఆశాజనకంగా కాసినప్పటికీ, ఎండల తీవ్రత వల్ల మామిడి కాయలు దెబ్బతినడంతో నాణ్యమైన కాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని గురువారం బాన్సువాడ, మంగళవారం బీర్కూర్, వర్ని, బుధవారం నసురుల్లాబాద్ లో భారీ సంత జరుగుతుంది. సంత మార్కెట్లో మామిడి పచ్చడి కాయలు సైజును బట్టి రూ.8 నుంచి 10 వరకు విక్రయిస్తున్నారు. వాటిని ముక్కలుగా చేసుకోవడానికి ఒక్కో కాయకు రూ.5 చొప్పున తీసుకుంటున్నారు. గుజ్జు కాయలు కిలో రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఎండాకాలంలో మామిడి కాయలతో పచ్చళ్లు చేసుకొని ఏడాది పాటు తినడానికి జనాలు ఆసక్తి చూపుతారు. ఈ సంవత్సరం పచ్చళ్లు తయారు చేసుకోవడానికి అవసరమైన అన్ని సరుకుల ధరలు చుక్కలనంటడంతో వాటి తయారీకి ప్రజలు భయపడుతున్నారు.