సంపూర్ణ భోజనం అంటే అందులో కూర, పప్పు, పచ్చడితో పాటు కారప్పొడి కూడా ఉండాలి. పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు, వెల్లుల్లి, కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వివిధ రూపాల్లో మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటితో పొడులు చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి. ఇడ్లీ, దోసె వంటి టిఫిన్లకు అప్పటి కప్పుడు పచ్చడి చేయలేకపోయినా.. ఈ పొడులు రుచితోపాటు, ఆరోగ్యాన్నీ అందిస్తాయి. అలాంటి కారప్పొడులు ఎలా చేయాలో ఈ రోజు నేర్చుకుందాం…
నువ్వుల పొడి…
నువ్వుల పొడి ఒకప్పుడు కచ్చితంగా ప్రతిరోజూ తినే ఆహారంలో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు నువ్వుల వాడకం చాలా వరకు తగ్గిపోయింది. నువ్వులను వేయించి పొడిచేసి ఒకసారి దాచుకుంటే… కొన్ని నెలల పాటు వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో నువ్వులు కూడా ఒకటి. రోజువారీ భోజనంలో రెండు ముద్దలు నువ్వుల పొడితో కలుపుకొని తినండి. మీకున్న నెలసరి సమస్యలు తొలగిపోతాయి.
కావలసిన పదార్థాలు : నువ్వులు – ఒక కప్పు, ఎండుమిర్చి – ఎనిమిది, ఉప్పు – రుచికి సరిపడా, కరివేపాకు – గుప్పెడు, ధనియాలు – ఒక స్పూను, జీలకర్ర – ఒక స్పూను, వెల్లుల్లి రెబ్బుల – గుప్పెడు
తయారీ విధానం : ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులు వేసి వేయించుకోవాలి. వాటిని ఓ ప్లేట్‌లో వేసి చల్లారనివ్వాలి. అదే కళాయిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రను వేసి వేయించుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు, వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలను వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. అందులో గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పొడి చేస్తే మంచి రుచి వస్తుంది. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. గాలి చొరబడని సీసాలో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసి మూత పెట్టుకోవాలి. గాలికి వదిలేస్తే ఇది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యి, ఈ పొడి వేసుకొని తింటే ఆ రుచే వేరు.
కరివేపాకు.. వెల్లుల్లితో
కరివేపాకు, వెల్లుల్లి ఈ రెండూ మన వంట గదిలో అందరికీ అందుబాటులో ఉండేవే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్‌లో చేసే కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, టిఫిన్‌లోకి ఎంతో రుచిగా ఉంటుంది. అందులోనూ వర్షాకాలంలో ఈ పొడి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.
కావలసిన పదార్థాలు :
వెల్లుల్లి రెబ్బలు – 15, కరివేపాకు – రెండు గుప్పిళ్లు, నూనె – ఒక స్పూన్, శనగ పప్పు – ఒక స్పూను, ధనియాలు – నాలుగు టీ స్పూన్లు, మినపప్పు – రెండు స్పూన్లు, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతులు – చిటికెడు, ఎండుమిర్చి – 15, ఉప్పు – రుచికి సరిపడ, చింత పండు – చిన్న నిమ్మకాయంత సైజు.
తయారీ విధానం: ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి.. తడి లేకుండా ఆర బెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెయ్యాక శనగ పప్పు, మెంతులు, మినపప్పు వేసి చిన్న మంట మీద వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఎండు మిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించి.. పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కరివే పాకును కరకర లాడేంత వరకు వేయించి.. స్టవ్ ఆఫ్ వేసి చల్లారనివ్వాలి. వీటన్నింటినీ ఓ మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో చింత పండు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరోసారి మిక్సీ తిప్పాలి. ఇదంతా కలిసేలా చేత్తో కలుపుకుని ఓ గాజు సీసాలో భద్ర పరుచుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కరివేపాకు, వెల్లుల్లి కారం రెడీ. ఈ కారం నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.
పల్లీలతో…
ఇడ్లీలు.. చట్నీతో కంటే కారంపొడితో ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. అలాగే దోశెల పైన కారంపొడిని చల్లుకుంటే ఆ రుచే వేరు.
కావలసిన పదార్థాలు : పల్లీలు – ఒక కప్పు, ఎండుమిర్చి – 15, ధనియాలు – ఒక స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 15, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – రెండు స్పూన్లు, జీలకర్ర- అర స్పూను.
తయారీ విధానం : స్టవ్ మీద కళాయి పెట్టి పల్లీలను వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేయించుకోవాలి. వీటిని బాగా వేయించాక స్టవ్ కట్టేయాలి. వీటన్నింటిని ఒక మిక్సీ జార్లో వేసి పొడిలా చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలను, ముందుగా వేయించుకున్న వేరుశెనగ పలుకులను, రుచికి సరిపడా ఉప్పును వేసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. అంతే కారంపొడి రెడీ అయినట్టే. ఈ పొడి దాదాపు మూడు నెలలు నిల్వ ఉంటుంది. ఇడ్లీల్లోకి ఈ పొడి అదిరిపోతుంది.
వెల్లుల్లి కారం
పక్కా కొలతలతో చేస్తే దీని రుచి అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకుంటే ఏడాదంతా వస్తుంది అన్నంలోకైనా, ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లలోకి కూడా ఈ వెల్లుల్లి కారంపొడి టేస్టీగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు : వెల్లుల్లి – 20 రెబ్బలు, ఎండుమిర్చి – 15, ధనియాలు – రెండు స్పూన్లు, జీలకర్ర – అర స్పూను, మినప్పప్పు – రెండు స్పూన్లు, కరివేపాకు – గుప్పెడు, ఉప్పు – రుచికి తగినంత, నూనె – ఒక స్పూను.
తయారీ విధానం : స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక మినప్పప్పును వేసి వేయించాలి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేసి వేయించాలి. అవి వేగాక ఎండుమిర్చి, కరివేపాకులు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతోనే తీసుకోవాలి. మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలను, ఉప్పును వేసి మిక్సీ వేయాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పదార్థాలను వేసి పొడిలా చేసుకోవాలి. అంతే వెల్లుల్లి కారప్పొడి రెడీ అయినట్టే. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి దాచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది.
అవిసె గింజలతో…
ఫ్లాక్స్‌సీడ్స్ అంటే తెలుగులో అవిసె గింజలు. వీటిని ఆహారంలో భాగం చేసుకొమ్మని వైద్యులు సిఫారసు చేస్తూ ఉంటారు. అయినా వాటిని తినేవారి సంఖ్య చాలా తక్కువ. అవిసె గింజలతో చేసిన ఆహారాలు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా అందుతాయి. అలాగే దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి అవిసె గింజలు తినడం వల్ల అజీర్తి సమస్యలు రావు.
కావలసిన పదార్థాలు : అవిసె గింజలు – ఒక కప్పు, జీలకర్ర – అర స్పూను, చింతపండు – ఉసిరికాయ సైజులో, ఎండుమిర్చి – 20, కరివేపాకులు – గుప్పెడు, మెంతులు – పావు స్పూను, ధనియాలు – రెండు స్పూన్లు, మినప్పప్పు – ఒక స్పూను, శనగపప్పు – రెండు స్పూన్లు, నూనె – రెండు స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, వెల్లుల్లి – ఎనిమిది రెబ్బలు.
తయారీ విధానం : స్టవ్ మీద కళాయి పెట్టి అవిసె గింజలను చిన్న మంటపై కొద్దిగా వేయించుకోవాలి. వాటిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. అదే కళాయిలో నూనె వేసి ఎండుమిర్చి, శెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, చింతపండు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అన్నింటిని తీసి పక్కన పెట్టుకోండి. అవి చల్లారాక మిక్సీ జార్లో అవిసె గింజలను వేయండి. వాటిని మెత్తని పొడిలా చేసుకోవాలి. అందులోనే ఈ ఎండుమిర్చిల మిశ్రమాన్ని కూడా వేసి మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టుకోవాలి. ఇవి మెత్తగా అయ్యాక ఉప్పును కూడా వేసి మళ్లీ మిక్సీ పట్టుకోండి. అంతే అవిసె గింజల కారప్పొడి తయారైనట్టే. దీన్ని మీరు అన్నంలోనే కాదు, ఇడ్లీ, దోశ వంటి వాటితోనూ తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది.