డోనాల్డ్ ట్రంప్ గత ఏలుబడిలో చైనా మీద ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కొనసాగుతుండగానే మరోసారి ఎన్నికలు వచ్చాయి. ఒక వేళ ట్రంప్ గెలిస్తే అనే భయం అమెరికాలో మొదలైంది.దానికి ఇంకా వ్యవధి ఉంది. ఈ లోగా ఐరోపా యూనియన్ మరోవాణిజ్య పోరుకు తెరలేపింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న విద్యుత్ వాహనాలపై దిగుమతి పన్ను మొత్తాన్ని పదిశాతంగా ప్రస్తుతం ఉన్నదాన్ని గరిష్టంగా 36శాతానికి పెంచి త్వరలో అమలు చేయనుంది. ‘మీ పని ఇట్లా ఉందా మా తడాఖా చూడండి’ అంటూ ఐరోపా నుంచి దిగుమతి చేసుకుంటున్న జున్ను, ఇతర పాల ఉత్పత్తులు, మద్యంపై ప్రతికూల చర్యలు తీసుకొనేందుకు చైనా కూడా సమరశంఖం పూరించింది. తెగేదాకా లాగితే వాణిజ్యపోరు మరిన్ని వస్తువులకు విస్తరించటం ఖాయం. 2018 నుంచి 2023వరకు వివరాలను చూస్తే జర్మనీ, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియాలు అన్నీ కలసి చేసిన విద్యుత్ వాహనాల ఉత్పత్తి కంటే చైనా (పదమూడు మిలియన్లు) ఎక్కువగా చేసింది. దిగుమతులతో ఈ దేశాల్లో ఉన్న వినియోగదారులు ఎంతో లబ్దిపొందుతున్న ప్పటికీ స్థానిక కంపెనీలు పోటీలో నిలవలేకపోవటంతో వాటి ప్రయోజ నాలను కాపాడేందుకు ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాలను విద్యుత్ వాహనాలను కనుమరుగుచేసే విధంగా మార్కెట్ పెరుగుతున్నది.చైనా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల కారణంగా తమ సంస్థలు దెబ్బతినటమేగాక కార్మికులకు ఉపాధి కూడా పోతున్నదని అమెరికా, ఐరోపా దేశాలు గగ్గోలు పెడుతున్నాయి.
దిగుమతి పన్ను, సబ్సిడీల గురించి చైనా-ఐరోపా యూనియన్ మధ్య జరిగిన సంప్రదింపులు విఫలం కావటంతో ఎవరికి వారు రక్షణాత్మక చర్యలు చేపడుతున్నారు. గతంలో విధించిన దిగుమతి పన్నుల కారణంగా చైనాకంటే ఎక్కువగా అమెరికా వినియోగదారుల మీదనే భారం ఎక్కువగా పడినట్లు తేలింది. అందువలన పక్కనే ఉన్న మెక్సికోలో చైనా కంపెనీలు ఉత్పత్తులను ప్రారంభించి ఎగుమతులు చేస్తూ దిగుమతి పన్ను తప్పించుకుంటున్నాయి. దీంతో మెక్సికోతో ఉన్న ఒప్పందం గురించి అమెరికా పునరా లోచనలో పడింది. స్థానికంగా ఉత్పత్తి గురించి కేంద్రీకరిస్తున్నప్పటికీ కార్పొరేట్ సంస్థలు ఎక్కడ చౌకగా శ్రామికశక్తి దొరికితే అక్కడికే వెళుతున్నాయి తప్ప అమెరికాలో ఏర్పాటు చేయటం లేదు. ఐరోపాలో కూడా అదే స్థితి. కాలుష్య నిబంధనలు కఠినతరంగా ఉండటం మరొక కారణం. ఐరోపా ఎగుమతి చేస్తున్న జున్ను, ఇతర పాల ఉత్పత్తుల్లో చైనా వాటా పన్నెండుశాతం ఉంది. విద్యుత్ వాహనాలకు ప్రతిగా అది ప్రతికూల చర్యలకు దిగితే తమ పరిస్థితి ఏమిటని ఆ కంపెనీలు, దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ కారణంగానే ఐరోపా సమాఖ్యలో చైనాతో వాణిజ్య పోరుకు ఏకీభావం కూడా లేదు. కొద్ది నెలల క్రితం జరిగిన ఓటింగ్‌లో దిగుమతి పన్నుల పెంపుదలను పన్నెండు దేశాలు సమర్ధించగా నాలుగు వ్యతిరేకించాయి, పదకొండు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ పూర్వరంగంలో ఇప్పుడు పన్నుల పెంపుదల గురించి ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ దాని అమలు అనేక ప్రశ్నలను ముందుకు తెస్తున్నది.ప్రాధమికంగా ఒక కారుధర 30వేల యూరోలుంటే ఇప్పుడు పదిశాతం(మూడువేల యూరోలు)గా ఉన్న దిగుమతి పన్ను సగటున 30శాతానికి పెరిగితే పదివేల యూరోలు భారం పడుతుంది.
ఐరోపాలో ఇప్పుడిది ఒక చర్చగా మారితే అమెరికాలో మరొకటి మొదలైంది. ఒకవేళ అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే మరింతగా వాణిజ్యపోరు విస్తరిస్తుందనే భయం నెలకొన్నది.వస్తున్న వార్తల ప్రకారం పరిస్థితి ఎటుబోయి ఎలా ఉంటుందో తెలియదు గనుక ఎన్నికలకు ముందే భారీ ఎత్తున చైనా నుంచి విడిభాగాలు, వస్తువుల దిగుమతికి పూనుకున్నారు. వాటి మీద ఆధారపడిన పరిశ్రమల విస్తరణ నిర్ణయాలను వాయిదా వేస్తున్నారు.
గాల్వన్ లోయ ఉదంతాల తరువాత మన దేశం ప్రత్యేకంగా పేరు పెట్టకుండానే భూ సరిహద్దు ఉన్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల మీద ఆనేక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.తాజాగా వెలువడిన వార్తలను బట్టి ఎలక్ట్రానిక్, విద్యుత్ వాహనాల రంగంలో నేరుగా లేదా పరోక్షంగా చైనా కంపెనీల పెట్టుబడులను అనుమతించాలని, వాటితో ఒప్పందాలకు ఆమోద ముద్ర వేయాలని మనదేశంలోని కార్పొరేట్లు ప్రధాని నరేంద్రమోడీ మీద తెస్తున్నట్లు, దానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. అదే జరిగితే మనదేశాన్ని చైనా వాహనాలు ముంచెత్తటం ఖాయంగా కనిపిస్తోంది.ఐరోపా, అమెరికాలో ఇప్పటికే ఆ పరిస్థితి ఏర్పడిన కారణంగా అక్కడి ప్రభుత్వాలు చైనాతో వాణిజ్యపోరుకు దిగాయి.