ప్రపంచ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తాజా అమెరికా పర్యటన అంతర్జాతీయంగా దుమారం రేపింది. అమెరికా, చైనాల మధ్య కొంతకాలంగా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు నెలకొన్న సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచశాంతి కోసం చైనా అధినేత జిన్‌పింగ్ చొరవ చూపారు. తాజాగా అమెరికా వెళ్లి అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. అగ్రరాజ్యంతో విభే దాలు పరిష్కరించుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయన్నారు. ఏమైనా జిన్‌పింగ్, అమెరికా పర్యటన ప్రపంచశాంతిని కాంక్షించే వారికి ఊరటనిచ్చింది.
జిన్‌పింగ్ అమెరికాలో మూడు రోజుల పాటు పర్యటిం చారు. ఆసియా- పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సులో పాల్గొనడానికి అగ్రరాజ్యానికి వచ్చారు. అపెక్ ఆర్థిక సదస్సుకు శాన్‌ఫ్రాన్సిస్కో ఆతిథ్యం ఇచ్చింది. ఈనెల 17న సదస్సు ముగి సింది. అపెక్ సభ్యదేశాధినేతలు, ప్రధానమంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో ముఖాముఖి భేటీ అయ్యారు జిన్‌పింగ్. శాన్‌ఫ్రాన్సిస్కోకు సమీ పానగల ఉడ్‌సైడ్‌లో ఇరు దేశాధినేతలు ముఖాముఖి సమావేశ మయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సమావేశం లో అనేక కీలక అంశాలపై జో బైడెన్, జిన్‌పింగ్ చర్చించారు. ఈ నేపథ్యంలో అమెరికా, చైనాల మధ్య అత్యున్నతస్థాయి సైనిక సంప్రదింపుల ప్రక్రియను పునరుద్ధరించాలని ఉభయ దేశాధి నేతలు నిర్ణయించారు. అంతేకాదు మాదకద్రవ్యాల నిరోధంలో పరస్పరం సహకరించుకోవాలని జో బైడెన్, జిన్‌పింగ్ నిర్ణయిం చుకున్నారు. రెండు దేశాల మధ్య అనేక అంశాలు, విభేదాలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయితే సదరు విభేదాలు పరిష్క రించుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయని అనడం శాంతిప్రియులకు ఊరటనిచ్చింది.
కొన్నేళ్లుగా అమెరికా- చైనా మధ్య ఆధిపత్య పోరు కొన సాగుతోంది. సోవియట్ యూనియన్ కూలిన తర్వాత చాలా కాలంపాటు అగ్రరాజ్యమైన అమెరికాకు ఎదురే లేకుండా పో యింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏకధృవ ప్రపంచం నడి చింది. అయితే ఆ తరువాతికాలంలో చైనా ఆర్థికంగానూ, సైనిక పరం గానూ బలపడింది. ఆర్థికంగా అగ్రరాజ్యమైన అమెరికాను కూడా సవాల్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. తాజా మార్కెట్ రేటు ఆధారం గా చూస్తే, ప్రపంచంలో అమెరికా నెంబర్ వన్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కొనుగోలు శక్తి ఆధారంగా చూస్తే చైనా ఇప్పటికీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థే. ప్రపంచపటంపై అనేక దేశాలకు అతి పెద్ద ఎగుమతి దేశంగా చైనాయే ఉంది. జర్మనీ, బ్రెజిల్, జపాన్ సహా అనేక ఇతర దేశాలకు అతి ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా కొనసా గుతున్నాయి. 2001 సంవత్సరంలో ప్రపంచంలో కరెన్సీ పరం గా చైనా 35వ స్థానంలో ఉంది. ప్రస్తుతం చైనా టాప్ ఫైవ్ దేశాల్లో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో చైనా తన కరెన్సీ యు వాన్‌ను ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేయడానికి ప్రయత్ని స్తోంది. యువాన్ విషయంలో చైనా ప్రయత్నాలు ఫలిస్తే డాలర్ దెబ్బతినడం ఖాయమంటున్నారు ఆర్థికరంగ నిపుణులు. అంత ర్జాతీయ మార్కెట్‌లో డాలర్ దెబ్బతినడం అంటూ జరిగితే అమె రికా బలహీనపడినట్లే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అంతేకాదు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు చైనా పెద్ద ఎత్తున రుణాలు అందచేస్తోంది. చైనా ప్రభుత్వంతో పాటు సర్కార్ నియంత్రణలో ఉన్న అనేక సంస్థలు కూడా ఈ రుణాలిచ్చే కార్యక్రమంలో ముందున్నాయి.
ఇదిలా ఉంటే అమెరికా, చైనా మధ్య ఇటీవలికాలంలో విభే దాలు మరింత తీవ్రమయ్యాయి. రాజకీయ పరిణతిలేని డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరే ఇందుకు కారణంగా అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. చైనాకు చెందిన కొన్ని యాప్స్, తమ దేశ అంతర్గత సమాచారాన్ని చోరీ చేస్తున్నాయన్న సాకుతో వాటి వినియోగాన్ని అమెరికా నిషేధించింది. అటు దౌత్యపరం గానూ రెండు దేశాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వైఖరి కొనసా గింది. చైనాలో తమ కాన్సులేట్ కార్యాలయాలను సైతం అమె రికా మూసివేసింది. చైనాలోని తమ రాయబారులను వెనక్కి పిలిపించుకుంది అమెరికా. ఇవేకాదు, అంతర్జాతీయంగా చైనా ను బద్నాం చేయడానికి అమెరికా చేయని ప్రయత్న మంటూ లేదు. తైవాన్‌ను చైనా మీదకు ఉసిగొల్పి స్వతంత్ర దేశమంటూ నాటకాలాడిస్తోంది అమెరికా. తైవాన్ ఒక్కటే కాదు వీలు దొరికి నప్పుడల్లా హాంకాంగ్‌ను కూడా చైనాకు వ్యతిరేకంగా ఉసిగొల్పు తోంది. చైనామీద అమెరికా అక్కసు పెంచుకోవడానికి కారణం ఒక్కటే. అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రరాజ్యమైన అమెరికాను చైనా సవాల్ చేయడమే. అలాగే వాణిజ్యయుద్ధంలోనూ అమెరికాతో ఢ అంటే ఢ అంటోంది చైనా. ఇప్పటికైతే అనేక అంశాల్లో అమెరికా, చైనా ఉత్తర, దక్షిణ ధృవాల కిందే లెక్క. అయితే అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది పాత సామెతే. ఏ క్షణం ఏమైనా జర గొచ్చు అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. జిన్‌పింగ్, అమెరికా పర్యటనను కూడా ఇదే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఏమైనా ప్రపంచ శాంతి కోసం పరిత పించే వారికి జిన్‌పింగ్ అమెరికా పర్యటన ఆనందాన్ని ఇచ్చింది. ఆయన చొరవను ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయి.
– ఎస్. అబ్దుల్ ఖాలిక్
63001 74320