– అమెరికా కుయుక్తులు ఫలించేనా?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సొంత పట్టణమైన విల్మింగ్టన్‌లో ఈ వారాంతంలో క్వాడ్ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు ఎజెండాలో చైనా సంబంధిత అంశాలే ప్రధానంగా వున్నాయని వైట్‌హౌస్ పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనాతో గల వ్యూహాత్మక పోటీ నేపథ్యంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతోనే క్వాడ్ సదస్సును నిర్వహిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్వాడ్ సభ్య దేశాలకు గల విభిన్నమైన వ్యూహాత్మక ప్రయోజనాలు, చైనాతో వారికి గల ఆర్థిక బంధాలు దృష్టిలో పెట్టుకుంటే విభజనలు తీసుకువచ్చి, ఘర్షణలు సృష్టించాలన్న అమెరికా ఎత్తుగడ నెరవేరడం కష్టం కావచ్చని వారు భావిస్తున్నారు. భద్రత విషయంలో చూసినట్లైతే ఆసియా పసిఫిక్ దేశాలు అమెరికా మీద మరింత ఆధారపడేలా చూసేందుకు క్వాడ్‌ను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లకు వారి వారి అభిప్రాయాలు వున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాతో వ్యూహాత్మక విలీనానికి సంబంధించి అంశాలు వున్నట్లే చైనాతో ఆర్థిక విలీనాంశాలు కూడా క్వాడ్ సభ్య దేశాలకు వున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో క్వాడ్ ద్వారా ఆసియా – పసిఫిక్ ప్రాంతంలో చీలికలు, ఘర్షణలు తీసుకు రావాలన్న అమెరికా ప్రయత్నాలు బెడిసికొట్టే అవకాశాలు లేకపోలేదని చైనా విదేశీ సంబంధాల యూనివర్శిటీ ప్రొఫెసర్ లీ హైడాంగ్ వ్యాఖ్యానించారు.