తైవాన్‌ అంశంలో గీత దాటొద్దు…అమెరికాకు చైనా హెచ్చరిక!

Don't cross the line in the matter of Taiwan... China's warning to America!స్వాతంత్య్రం పేరుతో అమెరికా, ఇతర దేశాల అండచూసుకొని రెచ్చిపోతున్న తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ పాలకులను హెచ్చరిస్తూ సోమవారం నాడు చైనా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. తొలిసారిగా తన తొలి విమానవాహక యుద్ధనౌక, పలు విమా నాలు, మిలిటరీ నౌకలు,డ్రోన్లు, ఆయుధాలతో తమ సత్తా ఏమిటో పశ్చిమ దేశాలకు వెల్లడించింది. తైవాన్‌ స్వాతంత్య్రం, వేర్పాటు కోరుతున్న శక్తులకు, వాటికి మద్దతిస్తున్న అమెరికాకు కూడా ఇది గట్టి హెచ్చరిక. జాయింట్‌ స్వోర్డ్‌ 2024బి పేరుతో జరిపిన విన్యాసాల్లో అవసరమైతే తైవాన్‌ దిగ్బంధం, దాడులు ఏలా చేయగలమో చూపింది. గతంలో కూడా విన్యాసాలు జరిపినప్పటికీ దీనికి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. చైనా పిఎల్‌ఏ తూర్పు కమాండ్‌ ప్రతినిధి కెప్టెన్‌ లీ షీ మాట్లాడుతూ ఒకేసారి త్రివిధ దళాల సమన్వయంతో భూ, గగనతల, సముద్రదాడులు, రేవులు, ఇతర ప్రాంతాల దిగ్బంధనం ఎలా చేయగలమో పరీక్షించి చూపినట్లు, ఇది తీవ్రమైన హెచ్చరిక అని చెప్పారు. తైవాన్‌ నాయకత్వం పదే పదే తమ రక్షణ గగనతలం అని చెప్పుకుంటుందని, దాన్ని ఎలా చీల్చి చెండాడగలమో చూపటమే లక్ష్యంగా పలు వైపుల నుంచి దాడులను సమన్వయం ఎలా చేసేదీ చైనా త్రివిధ దళాలు చూపాయి. అందుకే ఉమ్మడి ఖడ్గం అని పేరు పెట్టారు. మెడమీద వేలాడే ఖడ్గం లేదా సుత్తి మాదిరి రూపాందించారు. చైనా-తైవాన్‌ మధ్య ఉన్న జలసంధిలో రెండు ప్రాంతాలు, తూర్పున రెండు, ఉత్తర, దక్షిణాన ఒక్కొక్క జోన్‌గా ఈ విన్యా సాలు జరిగాయి. గతం కంటే వీటిని విస్తరిం చారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాలో ఉన్న రేవుల ద్వారా తైవాన్‌ సహజవాయువు దిగుమతి చేసుకుంటు న్నది. ఆ రేవులను దిగ్బంధనం కావించి ఆర్థిక లావాదేవీలను మిలిటరీ ఎలా దెబ్బతీయగలదో ఈ సందర్భంగా ప్రదర్శిం చారు.
తైవాన్‌ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ తాము కూడా తమ దళాలతో గమనించామని, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు తాము 153 విమానాల గమనాన్ని పరిశీలించామని, 90సార్లు తమ గగన తలంలోకి ప్రవేశించాయని, కొన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చినట్లు చెప్పారు. ఏడు నౌకలు, మరో నాలుగు ఇతర నౌకలు తైవాన్‌ దీవి చుట్టూ చక్కర్లు కొట్టాయని ఆరోపించారు. ఈ ఏడాది మే నెలలో పిఎల్‌ఏ ఒకసారి విన్యాసాలు నిర్వహించింది.అక్టోబరు పదవ తేదీన తైవాన్‌ ప్రాంత ప్రభుత్వ అధ్యక్షుడు లారు మాట్లాడుతూ చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ తమకు ప్రాతినిధ్యవహించదని, దానికా హక్కు లేదంటూ తాము స్వతంత్రంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. విన్యాసాలు పౌరులకు వ్యతిరేకంగా కాదని, వేర్పాటువాద శక్తులను హెచ్చరిం చేందుకేనని, వారికి చీమ చొరబడేంత అవకాశం కూడా ఇచ్చేది లేదని, శాంతియుతంగా విలీనానికే ప్రాధాన్యత ఇస్తామని చైనా చెప్పింది. ఒకే చైనా విధానానికి అనుగుణంగా తైవాన్‌ దీవి చుట్టూ పహరాకు నౌకాదళాన్ని నిరంతర వినియోగిస్తూనే ఉంటామని కూడా స్పష్టం చేసింది
తైవాన్‌ ప్రాంతంలో చైనా అంతర్భాగమే అంటూనే శాంతియుతంగా విలీనం చేసే సమయం ఆసన్నం కాలేదంటూ అమెరికా నాటకాలాడుతోంది. బలవంతం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని పదేపదే ప్రకటిస్తోంది. చైనా అంటే తైవాన్‌లో ఉన్న ప్రభుత్వమే అని ఐరాస 1971వరకు గుర్తించింది. అంతకు ముందు దశకంలో సోవియట్‌ యూనియన్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన వివాదాలను అవకాశంగా తీసుకొని చైనాను తమవైపు తిప్పుకోవచ్చు అనే రాజకీయ ఎత్తుగడతో అసలైన చైనాకు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ప్రధాన ప్రాంతాన్నే గుర్తించేందుకు అమెరికా పావులు కదిపింది. దాంతో భద్రతా మండలిలో 71వ దశకంలో శాశ్వత సభ్యదేశంగా కమ్యూనిస్టు చైనాను గుర్తించింది. అయితే ఆ సమయంలో జరిగిన చర్చలు, నిర్ణయాల్లో తైవాన్‌ విలీనం శాంతియుతంగా జరగాలని పేర్కొంది. దాన్ని సాకుగా చూపుతూ అలాంటి సమయం ఇంకా రాలేదని గత ఐదు దశాబ్దాలుగా అమెరికా భారీ ఎత్తున ఆయుధాలను అందచేస్తూ తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చూస్తున్నది. బలవంతంగా విలీనం చేసుకుంటామంటే తైవాన్‌లో ఉన్న చిప్స్‌ పరిశ్రమలను పూర్తిగా ధ్వంసం చేస్తామని బెదిరించింది.
తప్పనిసరైతే తప్ప రెండుకోట్ల 30లక్షల జనాభా ఉన్న తైవాన్‌ను బలవంతంగా విలీనం చేసుకోబోమని చైనా చెబుతున్నది. బ్రిటన్‌, పోర్చుగీసు కౌలు గడువు తీరిన తరువాత ప్రపంచ ఆర్థిక కేంద్రాలలో ఒకటైన హాంకాంగ్‌, ఆసియా లాస్‌వేగాస్‌గా పేరుమోసిన జూద కేంద్రం మకావు దీవులు చైనా ఆధీనంలోకి వచ్చాయి.వాటిని వెంటనే చైనా సమాజంలో కలిపితే వచ్చే సమస్యలను, అక్కడ ఉన్న విదేశీ పెట్టుబడులను గమనంలో ఉంచుకొని యాభై ఏండ్లపాటు 2047వరకు అక్కడ ఉన్న వ్యవస్థలను కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దాన్నే ఒకేదేశం-రెండు వ్యవస్థలుగా పిలుస్తున్నారు. ప్రత్యేక పాలనా యంత్రాంగాలను అక్కడ ఏర్పాటు చేశారు. వాటికి ఎన్నికలను కూడా జరుపుతున్నారు. తైవాన్‌ పట్ల కూడా అదే విధానాన్ని అనుసరిస్తామని చెప్పినప్పటికీ అమెరికా ఇచ్చిన ఆయుధాలు, అవసరమైతే జోక్యం చేసుకుంటామన్న మాటలను నమ్మి అక్కడి పాలకులు పదే పదే ససేమిరా అంటున్నారు. చైనా తాజా మిలిటరీ విన్యాసాల పూర్వరంగమదే.
పాక్‌ ఆక్రమిత కాశ్మీరు ఎలా మన అంతర్గత అంశమో తైవాన్‌ కూడా చైనా స్వంత విషయమే. దానిలో జోక్యం చేసుకోవటం అంతర్జాతీయ సూత్రాలకు విరుద్దం. మన పాలకులు ఎప్పుడైనా ఆక్రమిత కాశ్మీరును విముక్తం గావిస్తామని ప్రకటిస్తున్న సంగతి విదితమే. అయితే గత ఏడున్నర దశాబ్దాలుగా అలాంటి చర్యకు పూనుకోలేదు. ఎందుకంటే కారణాలనేకం, తైవాన్‌ విషయంలో కూడా చైనా అదే మాదిరి బలప్రయోగానికి పూనుకోవటం లేదు. అది వారు తేల్చుకోవాల్సిందే. ఆక్రమిత కాశ్మీరు అంశంలో పాకిస్తాన్‌ జోక్యం చేసుకుంటున్నట్లుగానే తైవాన్‌ విషయంలో అమెరికా అంతకంటే ఎక్కువగా వేలు పెడుతోంది.పాక్‌ ఆక్రమిత కాశ్మీరుకు మిలిటరీ, ఆయుధాలు లేవు, అదే తైవాన్‌కు యుద్ధ విమానాలు, క్షిపణులు, నౌకాదళం పూర్తి స్థాయి మిలిటరీ ఉంది. ప్రతి యేటా అమెరికా సమకూరుస్తోంది. తాజా సమా చారం ప్రకారం మిలిటరీ శక్తి ఉన్న 145 దేశాలలో తైవాన్‌ 24వదిగా ఉంది. సర్వీసులో మొత్తం 2.15లక్షల మంది సైనికులు, 50వేల మంది పారా మిలిటరీ, మిలిటరీలో 35వేల మంది వైమానిక దళ సిబ్బంది,40వేల మందితో నౌకాదళం ఉంది, 286 యుద్ధ విమానాలుండగా వాటిలో ఏ క్షణంలోనైనా దాడి చేసేందుకు 229 సిద్ధంగా ఉంటాయి, ఇవిగాక కొన్ని హెలికాప్టర్లు ఉన్నాయి. నాలుగు జలాంతర్గాములతో సహా 93 రకాల మిలిటరీ నౌకలు ఉన్నాయి. ఇలాంటి శక్తితో తలపడితే ప్రాణనష్టం ఎక్కడ జరిగినా మరణించేది చైనా పౌరులే. అందుకే ప్రతిరోజూ రెచ్చగొడుతున్నా చైనా నాయకత్వం ఎంతో సంయమ నంతో ఉంటోంది.
అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తాజా పరిణామాలపై మాట్లా డుతూ..తైవాన్‌ జలసంధి, ఆ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలకు ముప్పు రాకుండా చైనా సంయమనం పాటించాలని బోధ చేశారు. తైవాన్‌ పాలకుడు లారు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు, చర్యలు అక్కడి ప్రజలకు నష్టదాయకమని చైనా పేర్కొన్నది. రాజకీయ స్వప్రయోజనాల కోసం తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టటమే తైవాన్‌ జాతీయ దినోత్సవం పేరుతో చేసిన లారు ఉపన్యాసమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ చెప్పారు. మే నెలలో లారు బాధ్యతలు చేపట్టారు, అతనొక ప్రమాదకర వేర్పాటు వాది అని అప్పుడు చైనా వర్ణించింది. అమెరికా కూడా తక్కువ తినలేదు. అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసి చైనా హెచ్చరికలను ఖాతరు చేయకుండా 2022లో తైవాన్‌ పర్యటన జరిపి తమ మద్దతు వారికే అన్న సందేశమిచ్చారు. చైనా నాయకత్వ తీరుతెన్నులను చూసినపుడు అనివార్య పరిస్థితుల్లోనే నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుంది తప్ప అనవసరంగా వ్యవహరించదు. రానున్న ఐదేండ్లల్లో చైనా ఎలాంటి దాడులు చేయదని తాము నమ్ముతున్నట్లు సెప్టెంబరు నెలలో చేసిన ఒక సర్వేలో 61శాతం మంది తైవాన్‌ చైనీయులు చెప్పినట్లు వెల్లడైంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల తమ ఆర్థిక సమస్యల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు, ఆయుధ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టటం తద్వారా ఆయుధ అమ్మకాలను పెంచుకోవటం చూస్తున్నదే. అందుకే ఏదో ఒక మూల అలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నది. దాన్లో భాగంగానే దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తైవాన్‌, దీవులు, అంతర్జాతీయ సముద్రమార్గంలో స్వేచ్చగా రవాణా తదితరాల పేరుతో చిచ్చుపెట్టేందుకు పూనుకున్నది. తాను అండగా ఉంటానంటూ దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలను నమ్మించేందుకు,చైనాను బెదిరించేందుకు అమెరికా కూడా పదిరోజుల పాటు సాగేమిలిటరీ విన్యాసాలను ప్రారంభిం చింది. చైనా విన్యాసాలు బాధ్యతా రహితం, ఆ ప్రాంతాన్ని అస్థిరపరిచేవిగా, భారీ ఎత్తున జరిగినట్లు అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ ఆరోపించింది.తైవాన్‌కు 800 కిలోమీటర్ల దూరంలో దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌తో కలసి పదిరోజుల పాటు అమెరికా నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తోంది.
తైవాన్‌ భద్రత విషయంలో తీవ్రంగా ఆలోచించాలంటూ అమెరికా రక్షణశాఖ మాజీ అధికారి ఎల్‌బ్రిడ్జ్‌ కోల్బీ రాసిన విశ్లేషణను మే 11వ తేదీన తైపే టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. చైనా దురాక్రమణను అడ్డుకోవాలంటే మరింత ఎక్కువగా రక్షణ ఖర్చు పెంచాలని తైవాన్‌కు సూచించారు.తమకు తైవాన్‌ అవసరం ఎంతో ఉన్నప్పటికీ దాని కోసం త్యాగాలు చేయాలని తమ నేతలు అమెరికన్లను అడిగే స్థితి లేదన్నారు. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలోని టోకియో, సియోల్‌ వంటి జనసమ్మర్ధం గల ప్రాంతాలకు సమీపంలోని అమెరికా సైనిక స్థావరాల మీద అణ్వాయుధాలను ప్రయోగించి ధ్వంసం చేస్తామని చైనా బెదిరించిందని ఆరోపించారు. అటువంటి పరిస్థితిలో తాము నేరుగా చైనా యుద్ధ విమానాలను ఎదుర్కోనేందుకు సిద్ధం కాదని, రష్యాపై పోరుకు ఉక్రెయిన్‌కు ఇస్తున్న మాదిరి గానే పరోక్షంగా సాయం అందచే స్తామని తైవాన్‌ ఒంటరిగా పోరాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి 1949లో రూపొం దించిన దేశాల హక్కులు, విధులకు సంబంధించిన ముసాయిదా లో ప్రతి దేశం అంతర్గత, విదేశీ వ్యవహరాలను ఎలా నిర్వహించాలో స్పష్టంగా పేర్కొన్నది. బయటి నుంచి ఎలాంటి జోక్యం, ఒత్తిడి లేదా మార్గదర్శనానికి తావు లేకుండా సాయుధ దళాల నియామకంతో సహా అనేక అంశాలు దానిలో పొందు పరిచింది. ఐరాస తీర్మానం ప్రకారం తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే, అది తిరుగు బాటు రాష్ట్రంగా ఉన్నప్పటికీ దాని మీద పూర్తి అధికారం చైనాదే. అందువలన అంతర్గతంగా వేర్పాటు వాదాన్ని అదుపు చేయటంతో పాటు తైవాన్‌ చుట్టుపక్కల ప్రాంతాల మీద కూడా అంతర్జాతీయ నిబంధనలు అనుమతించిన మేరకు ఆధిపత్యం చైనాకే ఉంది.