అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అందువలన ప్రతి దేశం తన భద్రత గురించి జాగ్రత్తపడటం సాధారణ అంశమే. ఇటీవలి కాలంలో కొన్ని దేశాలను బూచిగా చూపి ఆ పేరుతో మిలిటరీ ఖర్చు పెంచేట్లు అమెరికా కుట్రలు చేస్తోంది, తప్పుడు సమాచారం అందిస్తోంది. ఎందుకంటే ఆయుధాలను అమ్ముకొని లాభాలు సంపాదించటమే పనిగా అమెరికన్ కార్పొరేట్లు పెట్టుకున్నాయి. ఉదాహరణకు మనకు చైనాతో విరోధాన్ని పెంచేందుకు అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులు మన ప్రాంతంలో చైనా కొత్త గ్రామాలను నిర్మిస్తున్నట్లు కొన్ని ఫొటోలను అమెరికా విడుదల చేసింది. అది వాస్తవం కాదని, తమ ప్రాంతంలోనే పాతబడిన ఇండ్ల స్థానంలో కొత్తవాటిని నిర్మిస్తున్నట్లు మన మిలిటరీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అమెరికా మాటలను నమ్మి అవసరం కంటే అధికంగా మిలిటరీ ఖర్చు చేసిన దేశమేదీ బాగుపడిన దాఖలాల్లేవు. సాధారణ పరిస్థితుల్లో కూడా ప్రతిదేశం తన మిలిటరీ పరికరాలను నవీకరించుకోవటం అవసరం, దానికి మన దేశం మినహాయింపు కాదు. దానిలో భాగంగానే ఫ్రాన్సు నుంచి మన దేశ రాఫెల్ యుద్ధ విమానాలను మన ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇటీవలనే ప్రధాని నరేంద్రమోడీ అక్కడికి వెళ్లి కొత్తగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చారు. ఫ్రెంచి కంపెనీతో కలసి జెట్ ఇంజన్ల అభివృద్ధికి ఒప్పందం చేసుకున్నట్లు కూడా ప్రకటించారు.
పారిస్‌లో ఇటీవలనే విమాన ఎగ్జిబిషన్ జరిగింది. ఈ సందర్భంగా నాటో కూటమి గూఢచార సంస్థలో పని చేసి రిటైరైన ఒక అధికారి బ్రేకింగ్ డిఫెన్స్ అనే మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఉంది.” చైనా స్వంతంగా జెట్ ఇంజన్ల రూపకల్పన, ఉత్పత్తి చేసేదిగా మారాలని ఎవ్వరూ కోరుకోవటం లేదని ” అన్నాడు. అది ఒక్క చైనాకే వర్తిస్తుందని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఇప్పటికే ఆ రంగంలో ఉన్న దేశాలు ఎవరికైనా షరతులతో అమ్ముతాయి తప్ప ఎవరినీ స్వంతంగా ఎదగనివ్వవు. పశ్చిమ దేశాలు ఎంతగా అడ్డుకుంటున్నప్పటికీ సవాలుగా తీసుకొని చైనా ముందుకు పోవటం వాటికి ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ దేశాలు ప్రత్యేకించి అమెరికా ఇతర దేశాలను భయపెట్టేందుకు ముందుగానే హడావుడి ప్రకటనలు చేస్తాయి. ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తాయి. చైనా అంశానికి వస్తే అది చేసి చూపించిన తరువాతే చెబుతుంది. పారిస్ విమాన ప్రదర్శన జూన్ 24న ముగిసింది. అక్కడ చైనా స్టాల్ ఉన్నప్పటికీ ఎవరూ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తరువాత నాలుగు రోజులకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రాడార్లకు దొరకని, గురిచూసి దాడిచేసే చైనా ఐదవ తరం చెంగుడు జె-20 బాంబరు వీడియోను విడుదల చేసింది. దాని సత్తా గురించి పశ్చిమ దేశాలు ఇప్పుడు జుట్టుపీక్కుంటున్నాయి. అంతకు ముందు పరీక్షించినప్పటికీ తొలిసారిగా జె-20ని రెండు డబ్ల్యుఎస్-15 కొత్త ఇంజన్లతో విడుదల చేశారు. దీంతో అమెరికా, దాని మిత్ర దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
గతంలో చైనా తమ విమానాలకు అవసరమైన జెట్ ఇంజన్లను రష్యా నుంచి కొనుగోలు చేసింది. అవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. ఎంతకాలం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తాం, మనమే ఎందుకు రూపకల్పన చేసి ఉత్పత్తికి పూనుకోకూడదని 2016 ఆగస్టులో జెట్ ఇంజన్ల విడిభాగాలు తయారు చేసే యూనిట్లను ఒక దగ్గరకు చేర్చి 750 కోట్ల డాలర్ల పెట్టుబడి, 96వేల మంది సిబ్బందితో ఏరో ఇంజిన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఎఇసిసి)ను ఏర్పాటు చేశారు. అది చేపట్టిన అనేక ప్రాజెక్టులలో డబ్ల్యుఎస్-15 ఇంజిన్ ఒకటి. రెండు సార్లు విఫల పరీక్షల తరువాత ఇటీవలే దాన్ని జయప్రదంగా ఎగురవేశారు. అంతకు ముందే అదే సీరీస్‌లో తక్కువ సామర్ధ్యం కలిగిన ఇంజన్లు తయారు చేసి జె-20 విమానాలకు అమర్చారు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న జెట్ ఇంజన్లను కూడా వాటికి అమర్చుతున్నారు, జె-20 బాంబరును 2011 నుంచీ నిర్వహిస్తున్నారు. సమర్దవంతమైన స్వంత ఇంజన్లతో నడపటమే తాజా ప్రత్యేకత. ఎక్కడి నుంచైనా యుద్ధ విమానాలను కొనుగోలు చేసినపుడు రెండు నుంచి ఎనిమిది వరకు ఇంజన్లను అదనంగా కొనుగోలు చేస్తారు. ఖర్చు రీత్యా అన్ని దేశాలు ఇలా చేయలేవు. ఇంజన్లు విడిగా కావాలంటే తమ సుఖోయి-35 ఫైటర్ జెట్‌లను ఎక్కువగా కొనుగోలు చేయాలని రష్యా షరతు పెట్టింది. అందువలన దాని మీద ఆధారపడటం సాధ్యం కాదని చైనా భావించింది. కొన్ని అంశాల్లో ఆ విమానాల కంటే తమ జె-16 ఫైటర్లు మెరుగైనవని చైనా నిపుణులు పేర్కొన్నారు. జూన్ 28న ఎగిరిన జె-20 బాంబరుకు ఒక కొత్త ఇంజను, మరొక పాత ఇంజను అమర్చారు. ఒకటి విఫలమైతే రెండవది పని చేస్తుంది. పరీక్షలో నిగ్గుతేలినప్పటికీ ఇంకా అనేక పరీక్షలు, మెరుగుపరచిన తరువాతే ఆ ఇంజన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తారని చైనా మాజీ సైనికాధికారి సాంగ్ ఝోంగ్‌పింగ్ చెప్పాడు.
ఈ ఏడాది ప్రారంభంలో ఒక చైనా పత్రికలో రాసిన విశ్లేషణలో తమ జె -20 ఐదవ తరం బాంబరు అమెరికా తయారీ ఎఫ్ – 35, ఎఫ్ -22 కంటే ఉన్నతమైనదని పేర్కొన్నారు. ఒక ఉదంతంలో తూర్పు చైనా సముద్రంలో చైనా-అమెరికా విమానాలు చాలా దగ్గరగా వచ్చాయి. ఆ సందర్భంగా అమెరికన్ పైలట్లు చైనా విమానాన్ని చూసి ప్రభావితులైనట్లు అమెరికా పసిఫిక్ ఎయిర్‌ఫోర్సు కమాండర్ జనరల్ కెనెత్ విల్స్‌బాచ్ చెప్పిన మాటలను ఆ పత్రిక ఉటంకించింది. అమెరికా నవీకరణ అవసరాన్ని గురించి చెప్పేటపుడు చైనా ఆయుధ వ్యవస్థల గురించి అటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారని వాటిని పట్టించుకోనవసరం లేదని కొందరు కొట్టిపారవేశారు. కానీ విమానం ఎగిరిన తీరు చూస్తే దాని కంట్రోలు వ్యవస్థలు సక్రమంగానే ఉన్నట్లు కనిపిస్తోందని, గతంలో ఈ మాత్రం కూడా తెలియలేదనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. తమ ఎఫ్-35 మాదిరిగా జె-20 ఉందని దాని గురించి అడగ్గా విల్స్‌బాచ్ ఏమీ మాట్లాడలేదు. అయినప్పటికీ చైనా విమానం గురించి సమాచారం పెద్దగా తెలియదంటూనే అమెరికా పత్రికల్లో రెండింటి గురించి విశ్లేషణలు చేస్తున్నారు. తమ ఎఫ్35, ఎఫ్22ను కాపీ కొట్టినట్లు ఆరోపిస్తున్నారు. తమ విమానాలతో వేగం, సాంకేతిక అంశాలను పోల్చి చూపుతున్నారు. చైనా గురించి ఇలాంటి ఆరోపణలు, ఎద్దేవాలు ఎప్పటి నుంచో చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అమెరికా విమానాల సామర్థ్యం తమకంటే మెరుగైనదే అని చైనా నిపుణులు చెబుతున్నారు. తమ వాటిని మెరుగుపరచుకొనే క్రమంలో బీజింగ్ ఉంది. జె-20 విమాన సామర్ధ్యం గురించి పశ్చిమ దేశాలు నిర్ధారణకు రాలేకపోతున్నాయి. ఒక వేళ చైనా వాటిని వినియోగంలోకి తెస్తే ఎఫ్ 22తో చైనాను ఢకొీట్టగలమా, తగినన్ని అందుబాటులో ఉన్నాయా అని తర్జనభర్జన పడుతున్నాయి. చైనా డబ్ల్యుఎస్-15 జెట్ ఇంజన్ ఉత్పత్తి ఆలస్యం అవుతున్నదని గతంలో వార్తలు వచ్చాయి. 2019 చివరి నాటికే 50 జె-20 విమానాలను చైనా తయారు చేయనుందని పశ్చిమ దేశాలు అంచనా వేశాయి. ఒక వేళ 50 లేదా వంద తయారు చేసినా అమెరికా వద్ద ప్రస్తుతం ఉన్నవాటి కంటే చాలా తక్కువ అని, లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ నివేదిక ప్రకారం 195 ఎఫ్-22 విమానాలను ఇప్పటికే అంద చేయగా వాటిలో 186పోరుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపున వికీపీడియా సమాచారం ప్రకారం చైనా వద్ద జె-20 విమానాలు మూడు రకాలు 210కి పైగా ఉన్నాయి. ఇలాంటి బాంబర్లను అమెరికా తరువాత చైనా మాత్రమే రూపొందించింది. తాజా సమాచారం ప్రకారం 2023లో లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ 147 నుంచి 153 ఎఫ్-35 ఫైటర్ జెట్లను తన ఖాతాదార్లకు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది, అయితే వాటిలో 50 వరకు ఈ ఏడాది తయారుకాకపోవచ్చునని బల్గేరియన్ మిలిటరీ డాట్ కామ్ జూలై 22న పేర్కొన్నది. ఇదే సమయంలో చైనా జె-20 ఉత్పత్తి ఏడాదికి 120 మించనున్నదని కూడా తెలిపింది. ఎఫ్-35ఏ, సి రకాల బాంబర్లు నాలుగు నుంచి ఆరు క్షిపణులను, అదే జె-20 ఎనిమిది క్షిపణుల వరకు మోసుకుపోగలదని కూడా ఆ వార్తలో పేర్కొన్నారు.
స్టాక్‌హౌమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) 2022 వార్షిక నివేదికలో ప్రపంచంలో మిలిటరీ ఖర్చు కొత్త రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నది. అంతరిక్షం, సైబర్ రంగాలలో అమెరికా ముందున్నందున మిగిలిన దేశాలతో పాటు చైనా కూడా తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటున్నది. సైబర్ నిఘాలో అమెరికా ప్రపంచ ఛాంపియన్ అని చైనా వర్ణిస్తున్నది. చైనా రూపొందిస్తున్న సైబర్ ఆయుధాలతో ఉపగ్రహాలను కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చని సిఐఏ తన నివేదికలలో పేర్కొన్నది. అమెరికాకు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ సమాచార వ్యవస్థ ద్వారా రష్యా సేనల గురించి ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ మిలిటరీ ఖర్చు 2021తో పోల్చితే 2022లో 3.7శాతం పెరిగింది. డాలర్లలో 2022 ఖర్చు 2,240బిలియన్లు, ఇది ప్రపంచ జిడిపిలో 2.2శాతం. మొత్తం ఖర్చులో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాల వాటా 63శాతం. అమెరికా 39, చైనా 13, రష్యా 3.9,భారత్ 3.6, సౌదీ 3.3శాతం చొప్పున కలిగి ఉన్నాయి. ఇక రష్యా ఖర్చు దాని జిడిపిలో ఒక ఏడాది కాలంలో 3.7 నుంచి 4.1శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఉక్రెయిన్ ఖర్చు 640శాతం పెరిగి జిడిపిలో 3.2 నుంచి 34శాతానికి పెరిగింది. దక్షిణ చైనా సముద్రం గురించి అమెరికా లేవనెత్తుతున్న వివాదం, తైవాన్‌పై చైనాను రెచ్చగొడుతున్న కారణంగా ఈ ప్రాంతంలోని అనేక దేశాలు ఆయుధాల కొనుగోలుకు పూనుకున్నాయి.
అమెరికా రక్షణ ఖర్చు 877 బి.డాలర్లతో పోలిస్తే చైనా 292 బి.డాలర్లు తక్కువే. ఆత్మరక్షణ సిబ్బంది తప్ప మిలిటరీ ఖర్చు లేదని చెప్పుకొనే జపాన్ ఖర్చు 46బి.డాలర్లకు చేరింది.దక్షిణ కొరియా 46.4బి.డాలర్లకు పెరచింది.ఈ రెండు దేశాలూ అమెరికా రక్షణలో ఉన్నాయి. మన దేశం 2021తో పోలిస్తే మరుసటి ఏడాది ఖర్చు(81.4బి.డాలర్లు) ఆరుశాతం పెంచినట్లు సిప్రి పేర్కొన్నది. స్టాక్‌హౌం సంస్థ పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం ప్రపంచంలో 40దేశాలు గణనీయంగా ఖర్చు చేస్తున్నాయి. వాటిలో మన దేశం మూడవ స్థానంలో ఉండగా మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ 10.3 బి.డాలర్లతో 24వదిగా ఉంది. తలసరి మిలిటరీ ఖర్చును డాలర్లలో చూస్తే అమెరికా 2,240,చైనా 163, శ్రీలంక 116, పాకిస్తాన్ 50, మయన్మార్ 48, భారత్ 43,బంగ్లాదేశ్ 27, నేపాల్ 7 చొప్పున ఖర్చు చేస్తున్నది. అమెరికా, ఇతర ధనిక దేశాల కూటమి ప్రపంచాన్ని ఉద్రిక్తతల వైపు నడిపిస్తూ వినాశనం వైపు నడిపిస్తున్నది.
ఎం. కోటేశ్వరరావు
8331013288