చైనా శాంతి మంత్రం – నాటో యుద్ధోన్మాదం!

”రష్యా సంబంధాలను చైనా మరింతగా పటిష్టపరుచుకుంది. చైనా బూటకపు శాంతి పథకాన్ని సక్రమమైంది అని చెప్పేందుకు పుతిన్‌ కనీసం తొలి అడుగు కూడా వేయలేదు. రష్యాను ఒక సామంత రాజ్యంగా మారుస్తూ పుతిన్‌-షీ ఒక నూతన ప్రపంచ వ్యవస్థ నిర్మాణం చేస్తున్నారు. ఆర్థిక ఆంక్షలు పుతిన్‌-షీ జిన్‌పింగ్‌ను దగ్గరకు చేర్చాయి. రష్యా-చైనా మధ్య తలెత్తే వివాదాలను లాభప్రదం చేసుకొనే అవకాశం ఉంది. అమెరికా మీద ఉన్న పరస్పర వ్యతిరేకత ఈ సంబంధాన్ని నిర్వచించింది. దీనిలో పసలేదు కానీ ప్రతీకాత్మక జిన్‌పింగ్‌-పుతిన్‌కు విజయం. పుతిన్‌ ప్రమాదం నుంచి బయట పడ్డాడు గానీ ఆశించినంతగా కాదు.” ఈ వ్యాఖ్యలన్నింటిని చూస్తుంటే ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుద్దో వాడే పండుగాడు అన్న పోకిరి సినిమా డైలాగ్‌ గుర్తుకు వస్తోంది. మూడు రోజుల పాటు మాస్కోలో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ జరిపిన పర్యటన ప్రభావ మిది అంటే అతిశయోక్తి కాదు.
అంతకు పది రోజుల ముందు శత్రు దేశాలుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య కుదిరిన ఒప్పందానికి సూత్రధారి చైనా కావటాన్ని అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ”దక్షిణ చైనా సముద్రం నుంచి అమెరికాను చైనా ఒక పెట్టెలోకి ఎలా నెట్టింది” అంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాస్తే ”అమెరికాను పక్కన పెట్టి ఇరాన్‌-సౌదీ ఒప్పందాన్ని కుదిర్చిన చైనా” అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక స్పందించింది. ఇక రెండు దశాబ్దాల ముందు నుంచీ చైనా కుప్పకూలుతుంది చూడండి అంటూ పంచాంగాలు చెబుతున్న గార్డన్‌ జి చాంగ్‌ కూడా మాట మార్చక తప్పలేదు. ”మధ్య ప్రాచ్యం నుంచి అమెరికాను నెట్టివేస్తున్న చైనా” అంటూ న్యూస్‌వీక్‌ పత్రికలో రాశాడు. చైనా 2011లో కుప్పకూలి పోతుందని 2001లో ఏకంగా ఒక పుస్తకమే రాశాడు. అది జరగకపోవటంతో 2012లో కూలుతుంది చూడండి అంటూ 2011 డిసెంబరులో ప్రకటించాడు. అది జరిగి కూడా పన్నెండేళ్లు దాటింది. వీటన్నింటిని చూసిన తరువాత చైనా పలుకుబడి పెరుగుతున్నదనేదాని కంటే తమ అడుగు జారుతున్నదని, తమను అభిమానించే వారిలో పునరాలోచన కలుగుతున్నదనేదే అమెరికా నేతల అసలు దుగ్ద. ప్రపంచ ప్రజాభిప్రాయమనే ప్రవాహానికి ఎదురీదుతున్నామనే స్పృహ వారిలో లేదు. బహుశా ఇలాంటి పరిణామాలను అమెరికా ఊహించి ఉండదు.
ఒక వైపు తనదైన శైలిలో శాంతి, అభివృద్ధి విధానాలతో ప్రపంచ దేశాలకు చైనా దగ్గర అవుతుంటే మరో వైపు ఉద్రిక్తతలు, విధ్వంసం ఆచరణగా అమెరికా, నాటో కూటమి దేశాలు ప్రపంచం ముందు నానాటికీ నిరూపించుకుంటున్నాయి. మాస్కోలో చైనా శాంతి ప్రతిపాదనలను ముందుకు తీసుకువచ్చిన సమయంలోనే నాటో విధ్వంస అజెండాను వెల్లడించింది. అందుకే ఏ గూటి చిలక ఆ పలుకునే వల్లిస్తుందంటారు. వ్లదిమిర్‌ పుతిన్‌ ఘర్షణ పూర్వక బలహీనతకు లోనయ్యాడని, దీర్ఘకాలిక యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలంటూ 2014 నుంచి నాటో సెక్రటరీ జనరల్‌గా ఉన్న జీన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ సెలవివ్వటాన్ని ప్రపంచ శాంతిశక్తులు గర్హించాలి. గార్డియన్‌ పత్రికతో మాట్లాడుతూ పుతిన్‌ వద్ద తక్షణమే ఎలాంటి శాంతి ప్రతిపాదనలు లేవంటూ ఉక్రెయిన్‌కు మారణాయుధాలను అందించేందుకు నాటో సిద్దం కావాలని చెప్పటం బరితెగింపు తప్ప మరొకటి కాదు. చైనా శాంతి ప్రతిపాదనలు, దాని మీద పుతిన్‌ స్పందనలో ఏవైనా లోపాలుంటే వాటిని విమర్శించటం ఒక పద్ధతి అదేమీ లేకుండా మరింతగా ఈ రెచ్చగొట్టుడేమిటి? ఒకవైపు పుతిన్‌ వద్ద ఆయుధాలు నిండు కుంటున్నాయని, గట్టిగా ఒక్క ఊపు ఊపితే ఉక్రెయిన్‌కు విజయం ఖాయమని ఐరోపా, అమెరికా జనాలను నమ్మించేందుకు చూస్తున్నారు. మరోవైపు పుతిన్‌ మరింత మంది సైనికులను పంపుతున్నాడని, ఆయుధ ఉత్పత్తిని భారీగా పెంచుతున్నందున అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ ఇతర పశ్చిమ దేశాలు మారణాయుధాలు ఇవ్వాలని, మిలిటరీ ఖర్చు పెంచాలని అతగాడు చెప్పటమంటే ప్రపంచాన్ని మరింత నాశనం చేసేందుకే నాటో కూటమి పూనుకుందన్నది స్పష్టం. తాజా పరిణామాలపై పశ్చిమ దేశాల్లో వెల్లడవుతున్న స్పందన, మీడియా వ్యాఖ్యలు చైనా మీద అసూయను వెల్లడిస్తున్నాయి. మధ్య ప్రాచ్యంలోని చమురు ఇతర సంపదలను ఆక్రమించుకొనేందుకు, లాటిన్‌ అమెరికాను తన పెరటితోటగా పరిగణించటం, ఆఫ్రికాను ఇంకా చీకటి ఖండంగానే ఉంచాలని చూసే వైఖరి తప్ప రెండవ ప్రపంచ పోరు తరువాత అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఆ ప్రాంత దేశాల వృద్ధికి చేసిందేమిటన్నది ప్రశ్న. అనేక దేశాల్లో అంతర్యుద్దాలను సృష్టించటం, మితవాద, మిలిటరీ, నిరంకుశక్తులను ప్రోత్సహించి ప్రజలను అణచి వేయటం తప్ప పశ్చిమ దేశాలు పట్టుమని పది దేశాలను అభివృద్ధి చేసిన దాఖలాను ఎవరైనా చూపగలరా? దానికి భిన్నంగా చైనా అభివృద్ధి పథకాలకు నిధులు అందిస్తున్నది తప్ప ఏ దేశంలోనూ అంతర్గత వివాదాలను సృష్టించలేదు, ఒక వైపు కొమ్ముకాసిన ఉదంతమూ లేదు. దేశాల పట్ల కూడా అదే వైఖరి అందుకే ఇరాన్‌-సౌదీ పాలకులు చైనా నాయకత్వం మీద విశ్వాసం ఉంచి ఒప్పందానికి వచ్చారు. అదే చైనా ప్రత్యేకత!