పాలస్తీనా విముక్తికి చైనా మద్దతు!

China supports the liberation of Palestine!ఏం చేసినా మనసా-వాచా -కర్మణా ఉండాలని పెద్దలు ఎప్పుడో చెప్పారు. భారతీయ విలువలు, వలువల గురించి నిత్యం వల్లిస్తూ ఎదుటివారికి బోధలు చేసే వారంతా అలా ఉన్నారా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. పాలస్తీనా దేశం ఏర్పాటు, అరబ్బుల సర్వసత్తాక హక్కు గురించి మాట్లాడుతున్నవారు ఆచరణలో ఏం చేస్తున్నారన్నదే ముఖ్యం. మొక్కుబడిగా మద్దతు తెలుపుతూనే అక్కడ మారణకాండకు పాల్పడుతున్న ఇజ్రాయిల్‌ గొప్పతనం, దానితో స్నేహం గురించి కబుర్లు చెప్పే విశ్వగురువు అమెరికా సంతు ష్టీకరణ, ముస్లిం వ్యతిరేక వైఖరి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గాజాలో యూదు మూకలు జరుపుతున్న మారణకాండ గురించి హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) విచారణ జరుపుతున్నది. అదే కోర్టులో తూర్పు జెరూసలెంతో సహా ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలలో ఇజ్రాయిల్‌ విధానాలు, ఆచరణతో తలెత్తిన చట్టపరమైన పర్యవసానాల గురించి కూడా మరో కేసు విచారణ జరుగుతున్నది.దానిలో పాలస్తీనా యోధులకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ కమ్యూనిస్టు చైనా అంటే ఏమిటో ప్రపంచానికి, విముక్తి పోరాటాలలో నిమగమైన వారికి ఇస్తున్న మద్దతు, వైఖరి గురించి చేసిన వాదన ఎంతో ముఖ్యమైనది.
సామ్రాజ్యవాదుల దురాక్రమణకు, వలస పాలనలో మగ్గిన చైనా, ఇతర దేశాల వారికి అదే పరిస్థితిలో ఉన్న వారి గురించి తెలిసినంతగా మరొకరికి అర్ధం కాదు. స్వాతంత్య్ర,విముక్తి పోరాటాలకు దూరంగా, మన దేశంలో సామ్రాజ్యవాదుల బూట్లు నాకిన వారు, ప్రేమ లేఖలు రాసి, చరిత్ర చెత్తబుట్టలో ఉన్న జయచంద్రుడు, మీర్‌ జాఫర్‌ల సరసన చేరిన కాషాయ దళ వారసుల గురించి పక్కన పెడదాం. అంతర్జాతీయ న్యాయస్థానంలో పాలస్తీనియన్లకు చైనా మద్దతు ప్రకటనతో సహజంగానే ఇజ్రాయిల్‌ మండిపడింది. అక్టోబరు ఏడున తమ దేశంపై హమాస్‌ చేసిన దాడికి చైనా మద్దతు ఉన్నట్లుగా తాము పరిగణిస్తామని చెప్పుకుంది.యుద్ధ నీతి ప్రకారం పౌరుల మీద పనిగట్టుకొని దాడులు చేయరాదని, హమాస్‌ తమ పౌరుల మీద అలాంటి దాడికే పాల్పడిందని ఆరోపించింది. ఆ చర్యను తప్పుపడుతున్న ఇజ్రాయిల్‌ గడచిన ఏడున్నర దశాబ్దాలుగా ఆక్రమిత పాలస్తీనాలో జరుపుతున్న దుర్మార్గాలను, తాజాగా హమాస్‌ అణచివేత పేరుతో మారణకాండ, విధ్వంసాన్ని ఏ విధంగా సమర్ధించు కుంటుంది? విముక్తికోసం పోరాడుతున్న వారిని ఉగ్రవాదులుగా చిత్రించటం ఈ రోజు కొత్తగా జరుగుతున్నదికాదు, పాల స్తీనా యోధుడు యాసర్‌ అరాఫత్‌నే ఉగ్రవాదిగా పరిగణించిన వారు హమాస్‌కు ఆ ముద్రవేయటంలో ఆశ్చర్యం ఏముంది.
పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణ క్రమంలో 57 సంవత్సరాల క్రితం 1967జూన్‌లో ఇజ్రాయిల్‌ జరిపిన ఆరు రోజుల యుద్ధం గురించి చైనా తరఫు న్యాయవాది మాట్లాడుతూ 1973లో ఐరాస సాధారణ అసెంబ్లీ ఆమోదించిన 3,070 తీర్మానం ప్రకారం వలసవాదులు, విదేశీ పెత్తనం, విదేశీ అణచివేతకు గురైన ప్రాంతాల వారు విముక్తి కోసం సాయుధ పోరాటంతో సహా అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను వినియోగించే హక్కును కలిగి ఉన్నారన్న అంశాన్ని కోర్టు ముందు ఉంచారు. ఆ మేరకు తమ విముక్తి కోసం పాలస్తీనా పౌరులకు సాయుధ పోరాటం జరిపే హక్కు ఉన్నదని చైనా స్పష్టం చేసింది. ఇప్పటికే న్యాయం చాలా ఆలస్యమైందని,దాన్ని కాదన కూడదని పేర్కొన్నది. అదీ కమ్యూనిస్టు చైనా ప్రత్యేకత.
అంతే కాదు ” తమ విముక్తి, స్వయం పాలనా హక్కు కోసం వలసవాదం, ఆక్రమణ,దాడులు,పెత్తందారీ తనాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంతో సహా విదేశీ శక్తుల మీద పౌరులు జరిపే పోరాటాలను ఉగ్రవాద చర్యలుగా పరిగణించకూడదని, దీర్ఘకాలంగా దురా క్రమణకు గురైనవారు జరుపుతున్న పోరాటాలకు చట్టబద్దమైన పునాది కూడా ఉందని” తన వైఖరిని ఈ సందర్భంగా చైనా వెల్లడించింది.అయితే సాయుధ పోరాటాన్ని సమర్ధించటం అంటే ఆ సందర్భాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని సమర్ధించటం కాదన్నది గమనించాలి.అది హమాస్‌కూ వర్తిస్తుంది. జరిగిన పొరపాట్లను తప్పుపట్టటం వేరు, ఆ పేరుతో మొత్తంగా ఉగ్రవాదులుగా చిత్రించటం తగని పని. ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయిల్‌ను వెళ్లగొట్టి తమ స్వతంత్ర దేశ ఏర్పాటుకు పాలస్తీనీయన్లు చేస్తున్న పోరాటాన్ని ఎలాంటి శషభిషలు లేకుండా సంపూర్ణంగా చైనా సమర్ధించటం విముక్తి పోరాటాలకు వేగుచుక్క వంటిది. ఈ పరిణామం విముక్తి పోరాటాల్లో ఉన్న వారందరికీ ఎంతో ఉత్తేజం, ధైర్యాన్ని ఇస్తుందని వేరే చెప్పనవసరం లేదు.