ప్రజానాట్యమండలి పాట చింతల యాదగిరి

Chintala Yadagiri song by Prajanatyamandaliప్రజానాట్యమండలి పాట. ఆ పాట రెండు లక్షల మంది బాల కార్మికులను బడిబాట పట్టించింది. ఆ పాట విన్న ప్రభుత్వాలు బాల కార్మిక నిర్మూలన పథకాలు చేపట్టాయి. కఠిన ముఖ్యమంత్రులను సైతం కన్నీరు పెట్టించేత సున్నితమైనది ఆ పాట. అలాంటి పాటే ”నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో/ నా సంకల మేడితో సాలిరువాలు దున్నినానయ్యో”. బహుశా చరిత్రలో తామే రాశామని ఎంతో మంది చెప్పుకుంటున్న పాట ఇదే కావచ్చు. నిజానికి ఈ పాట రాసింది, ఇంకెన్నో పాటలను అల్లింది నల్లగొండ జిల్లా, మేళ్ల దుప్పలపల్లి అనే పల్లెటూరి వాడు. ఏడవ తరగతిలోనే డ్రాప్‌ అవుట్‌ అయి ఎడ్లగాసి, నాగలి దున్ని వ్యవసాయానికి బాల్యాన్ని ఎరువుగా మార్చిన ఒకానొక చింతల యాదగిరి.
అతడి పాటలు అందరికీ తెలుసు. అతడు మాత్రం ఎక్కువ మందికి తెలియదు. చింతల యాదగిరి విరివిగా రాస్తున్న కాలంలో ప్రజానాట్యమండలి పాటగా, కవిగా, గాయకుడిగా స్థిరపడి, సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. కనుకనే ఆయన రాసిన రాతలు, సాహిత్యం, ప్రజానాట్యమండలికి సొంతమై ఉన్నాయి. తెలుగు సమాజం విన్న, పాడుకున్న అతడి పాటలు మచ్చుకు కొన్ని పరిశీలిద్దాం.
”గుండెలోన రగిలిన బాధ కన్నీరై కారుతుంది/ కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది” అంటూ చింతల యాదగిరి కంటికి కనిపించని బాధకు రూపంగా కన్నీటిని వస్తుగతంగా మనకు చూపెడుతున్నాడు. ఇలా అతను పాటను ఎత్తుకునే పల్లవే మనల్ని కట్టి పడేస్తుంది. కనుకనే ఈ పాటకు పలు యూట్యూబ్‌ల్లో పది మిలియన్లకు పైగా వ్యూస్‌ కనిపిస్తున్నాయి. పాట మొత్తం భావాన్ని ఒక్క పల్లవిలోనే పొదగడంలో, మొదటి లైన్లలోనే పదునైన పద ప్రయోగంతో, శ్రోతల్ని తన వైపుకు తిప్పుకోవడంలో చింతల యాదగిరికి ఉన్న టెక్నిక్‌ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దానికి తోడు కష్టాలకు కారకులు ఎవరో తెలుసుకోమని తన పాటల ప్రశ్నలతో ప్రజల మెదళ్లని రాజేస్తున్నాడు.
”ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలి పోలేనే/ నేల తల్లి పొదుగును కాదని చెదిరీ పోలేనే” అని సరళంగా, సూటిగా, ఒక బలమైన స్టేట్మెంట్‌తో పాట ప్రారం భించాడు చింతల యాదగిరి. ఉన్న ఊరు కన్నతల్లి అనే పల్లె నుడికారాన్ని ఉపయోగిం చడంతో ఆగిపోకుండా, ఉన్న ఊరును నేలతల్లి పొదుగు అంటూ తనదైన పద ప్రయోగం చేస్తూ మనల్ని తన పాటలోకి ఆకర్షిస్తాడు. ఆ పదబంధాల వేలు పట్టించి అక్షరాల చాల్ల వెంట తిప్పుతూ సమస్యను అర్ధం చేయిస్తాడు. మనకి తెలియకుండానే మనను సమరానికి సన్నద్ధం చేస్తాడు. ”అన్నదాత ఆగమవుతుండే/ పురుగు మందుతో ప్రాణాలొదిలిండే/ మట్టిబిడ్డడు మాయమవుతుండే/ మనలనిడిసీ వెళ్ళి పోతుండే/ కనికరించని కాలం తోడు/ కాటు వేసిన పాలన చూడు” అని చింతల యాదగిరి విలపిస్తూ రైతుల ఆత్మహత్యలపై పాడిన ఈ పాట విన్నవారెవ్వరైనా ఏడవకుండా ఉండ లేరు. అంతటి ఆర్ద్రతగా పాడాడు యాదగిరి. నిజానికి చాలామంది కవులు కరువుకు కాలాన్ని, ప్రకతిని కారణంగా చూపిస్తారు. కానీ చింతల యాదగిరి మాత్రం రైతులను ప్రభుత్వం కాటు వేసిందని, లేదంటే లోకానికి అన్నంపెట్టే రైతు ఆత్మహత్య చేసుకోడని తీర్మానిస్తున్నాడు. అంటే సమస్య పట్ల ఇంతటి విషయ స్పష్టత, లోతైన అవగాహన కేవలం ప్రజాకవికి, ఉద్యమ కవికి మాత్రమే ఉంటుంది అనేది గమనించాల్సిన విషయం. ఇలా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన మార్క్సిస్టు దక్పథాన్ని చింతల యాదగిరికి అందించినది మాత్రం ప్రజానాట్యమండలియే.
”వలసెల్లి పోయింది ఊరు/ నేడు వల్లకాడయ్యింది చూడు” పాటకు యూట్యూబ్‌లో నాలుగు మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ ఉన్నాయి. ప్రపంచీకరణ కాలుష్యంతో ధ్వంసమైపోతున్న గ్రామీణ వత్తుల గురించి బెంగటిల్లుతూ చింతల యాదగిరి రాసిన ఈ పాట గోరటి వెంకన్న రాసిన ”పల్లె కన్నీరు పెడుతుంది” పాటకు ఏ మాత్రం తక్కువ కాదు. అయితే చింతల యాదగిరి కేవలం కులవత్తుల ధ్వంసం, ప్రపంచీకరణ వ్యతిరేకత, ప్రత్యామ్నాయ ఉపాధి దగ్గరే ఆగిపోలేదు. ఒకడుగు ముందుకేసి మాదిగ ”డప్పు చిటికెన పుల్ల చిర్ర చిన్నబోయె/ ఓర ఓరల కట్టె వంక సూపుల కట్టె/ మెండైన దొరలకు మిండడు ఈ కట్టె” అంటూ దళిత, బహుజన దక్పథాన్ని రంగరించి కుల ఆధిపత్యం మీద అక్షర క్షిపణులను విసిరాడు. డప్పు శబ్దం మనిషిని చేతనత్వంలోకి తీసుకొస్తుంది. అందుకే డప్పు, చిర్ర, చిటికెన పుల్ల అంటే దొరలకు భయం అని ఇక్కడ కవి సూచ్యం చేస్తున్నాడు. అమ్మ గురించి రాయాలనుకుంటే ఎవరైనా అమ్మ గొప్పతనం గురించి రాస్తారు. అమ్మ త్యాగం, ప్రేమ, ఆప్యాయత అనురాగం, పిల్లల పెంపకం గురించి రాస్తారు. కానీ అమ్మకు ఇవి కాకుండా ఇంకా ఎంతో జీవితం ఉందని, కలలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయని చింతల యాదగిరి భావించాడు. కాబట్టే అమ్మ కన్నీటి ఊటలను గుర్తించి పాటగా మన ముందు చర్చకు పెట్టాడు. ”అమ్మ ఏడ్చింది మా అమ్మ ఏడ్చింది/ ఎందుకే ఓ అమ్మ అంటే ఏమి చెప్పుదు కొడుక అంది” అంటూ అమ్మ శోకం గురించి అడగడం మొదలుబెట్టాడు. చింతల యాదగిరి దక్పథమే వైవిధ్యంగా ఉంటుందని తన పాటలను విన్నప్పుడు, పరిశీలించినపుడు మనకు అర్ధమవుతుంది. ఈ పాటలో కన్నతల్లి, నేలతల్లి, పంటతల్లి, పక్షితల్లి, గోదావరితల్లి ఇలా అయిదుగురు తల్లుల గోసను, గోడును అక్షరీకరిస్తాడు. ఈ అమ్మలందరూ ఎందుకు దుక్కిస్తున్నారంటే! కూలీ చేసుకుని బతికే తమ బిడ్డలకు దొరబాబులు కూలి డబ్బులు ఇవ్వడం లేదని. అందుకు పరిష్కారం పోరాటమేనని తీర్పు ఇప్పిస్తాడు కవి. ఆ తీర్పు తనివ్వకుండా ”గోదారి చెప్పింది పోరుకు దారి చూపింది” అంటాడు. అలా పాట నడిపిన విధానంలో, ముగింపులో కర్తవ్యబాట చూపడంలో చింతల యాదగిరి కవితా హదయం, ఉద్యమ దక్పథం, తన కన్విన్సింగ్‌ పోయెట్రీ స్ట్రయికింగ్‌లో ఒక కథనాత్మకత రూపుగట్టింది.
”అమ్మ రొమ్ము పాలలోన ఫ్లోరీను జాడ/ అన్నమిచ్చె పంట మీద విషపు నీళ్ల నీడ/ పాకులాడే ప్రాయమందు పట్టుకుంది వెన్ను/ కీలుకీలు అరగదీసి సంపుతుంది నన్ను” అంటూ నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరిన్‌ సమస్య మీద పాట రాసిన మొట్టమొదటి వాగ్గేయకారుడు చింతల యాదగిరి. ఫ్లోరిన్‌ విష ప్రభావం నల్లగొండ జిల్లా నీళ్లలో ఎంత దారుణంగా ఉందో పై చరణంలో మనకు తెలుస్తుంది. సమస్య తీవ్రతను ఎలుగెత్తి చాటడానికి ఆవేదనతో, దుఃఖంతో, బాధతో ఈ పాట రాశాడని చెప్పవచ్చు. కొండంత భావాన్ని ఉండలా చుట్టినట్టు, ఫ్లోరిన్‌ విషపు నీళ్ల ప్రమాదాన్ని అమ్మ పాలలో కూడా ఫ్లోరిన్‌ ఉందనే ఒక్క మాటలో చెప్పడంలో కవికి ఉన్న లోతైన అవగాహనా కనిపిస్తుంది. ఇదే కాకుండా ”నల్లగొండ నీ కడుపుల గనులున్నాయి/ అవి మా ఆకలి తీర్చలేని సిరులైనాయి” అంటూ సహజ సంపదల గురించి రాస్తాడు. నల్లగొండ జిల్లాలోని పరిస్థితులను, సమస్యలను, గొప్పతనాన్ని, సహజ సంపదలను తన పాటలతో చింతల యాదగిరిలా చిత్రికపట్టిన పాట కవి లేడనడం అతిశయోక్తి కాదు. ”నల్లగొండ జిల్లా తల్లి ఏమి పాపంజేసెనో/ ఏలేటోళ్ల చిన్నచూపుకు ఎక్కిఎక్కి ఏడ్చెనో/ ఎవరి దీపం ఆర్పినామని ఎందుకింత కక్షరో/ కోటి గొంతుల ఆశలన్నీ ఎనకబడ్డవి ఎందుకో” అంటూ కైగట్టిన ఈ పల్లవి నిండా జాతీయాలు నుడికారాలే కనిపిస్తున్నాయి. పల్లె ప్రజల పలుకుబడులతో పాటగట్టినాడు కనుకనే నల్లగొండ జిల్లాలో రైతు, కూలీలు పొలాల్లో పనిచేస్తూ ఈ పాట పాడుకుంటున్నారు. ప్రజాభాషలో రాసిన పాటలు, జనం నాలుకలపై నడియాడుతాయనడానికి ఈ పాట చక్కని ఉదాహారణ.
నడుస్తున్న తెలంగాణ వాగ్గేయ చరితలో ప్రామాణికమైన పాటకవిగా, ప్రజాకవిగా, వాగ్గేయకారుడిగా ప్రచారం కావాల్సిన, గుర్తింపు దక్కాల్సిన, తెలంగాణ నేల, తెలుగు భాష గర్వించదగిన గొప్ప కవిగాయకుడు చింతల యాదగిరి. నిజానికి చింతల యాదగిరి పాటంటే ఆనందం కాదు. ఆవేదనల మూట. తన్మయత్వం కాదు తనువు అణువణువులో చెలరేగే ఆవేశం. తన స్వరం నిప్పురవ్వల్ని వెదజల్లే ఎర్రని కొలిమి. ఆ మండే గొంతులోంచి తన్నుకొచ్చే జీర సముద్రపు అలల హౌరును, తుఫాను గాలి జోరును గుర్తు చేస్తూ పాడుతుంది. ఆయన కలంతో పొడిచే పొద్దుపై సంతకం చేస్తూ, కాలం నుదుటన మరిన్ని పదునైన పాటలు రాయాలని ఆశిద్దాం!!

(బహుజన సాహిత్య అకాడమీ అవార్డు, డిసెంబర్‌ 15 న ఢిల్లీలో చింతల యాదగిరి అందుకుంటున్న సందర్భంగా)
ఎం. విప్లవకుమార్‌
9515225658