– 9 బస్సుల్లో 540 మంది
నవతెలంగాణ-మర్కుక్
మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఆయన స్వంత గ్రామమైన చింతమడక గ్రామస్తులు 9 బస్సుల్లో 540 మంది ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌కు బుధవారం తరలివచ్చారు. వారిని పర్మిషన్ లేదన్న కారణంతో చెక్‌పోస్ట్ పోలీసులు అడ్డుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కలవాలని ఆయనతో మాట్లాడాలని పోలీసులతో గ్రామస్తులు చెప్పగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని, అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని పోలీసులు వాగ్వాదానికి దిగారు. దాంతో గ్రామస్తులు రోడ్డుపైనే బైటాయించారు. విషయం తెలుసుకున్న కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లోకి అనుమతించాలని పోలీసులను ఆదేశించారు. గ్రామస్థులను కేసీఆర్ పిలుచుకొని వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి వస్తుందని, ఎవరూ అధైర్యపడొద్దని కేసీఆర్ సూచించారని గ్రామస్థులు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారన్నారు. చింతమడక గ్రామస్థులకు ప్రత్యేకంగా రుణపడి ఉంటానని కేసీఆర్ తెలిపినట్టు వారు తెలిపారు
మేమంతా కేసీఆర్ వెంటే ఎన్నారై బీఆర్‌యస్ నాయకులు
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వివిధ దేశాలకు చెందిన ఎన్నారై బీఆర్‌యస్ నాయకులు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో బుధవారం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మేమంతా ఉద్యమ సమయం నుంచి మీ వెంటే ఉన్నామనీ, ఇక ముందు కూడా మీ నాయకత్వంలో పనిచేస్తామని బీఆర్‌ఎస్ ఎన్నారై అధ్యక్షులు, మాజీ ఎఫ్‌డీసీ చైర్మెన్ అనిల్ కూర్మాచలం ఈసందర్భంగా కేసీఆర్‌తో చెప్పారు. ఒక ఎన్నారైగా పార్టీకి సేవలందించిన నాకు ఎలాంటి రాజకీయ అండ లేకపోయినా, నాకు అత్యుత్తమ రాష్ట్ర కార్పొరేషన్ పదివి ఇచ్చి గౌరవించినందుకు మాజీ సీఎం కేసీఆర్‌కు అనిల్ కూర్మాచలం కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పార్టీ పిలుపిచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని యూకే అధ్యక్షుడు దూసరి అశోక్‌గౌడ్ అన్నారు. ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన ఎన్నారై బీఆర్‌ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.