కమిటీ కుర్రోళ్లు అందర్నీ మెప్పిస్తారు : చిరంజీవి

కమిటీ కుర్రోళ్లు అందర్నీ మెప్పిస్తారు : చిరంజీవినిహారిక కొణిదెల సమర్పణలో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఎల్‌.ఎల్‌. పి, శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఈ సినిమా ఈనెల 9న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయి దుర్గ తేజ్‌, అడివి శేష్‌, దర్శకుడు వెంకీ అట్లూరి ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. వీడియో సందేశంలో చిరంజీవి మాట్లాడుతూ,’ఇప్పటికే నేను ఈ చిత్రాన్ని చూశాను. చాలా బాగుంది. మా నిహారిక మల్టీటాలెంట్‌. మంచి చిత్రాలు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది. ఈ చిత్రం గోదావరి చుట్టు పక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. యదు వంశీకి ఇది మొదటి చిత్రం. అందరూ కొత్త వాళ్లు నటించారు. మంచి విజువల్స్‌ ఉంటాయి. అనుదీప్‌ సంగీతం బాగుంది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అని తెలిపారు. ‘ఇందులో ఎన్నో ఎమోషన్స్‌ ఉంటాయి. ఎండింగ్‌ మాత్రం ప్రముఖ నాయకుడ్ని చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది’ అని నాగబాబు అన్నారు. వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్రాన్ని నేను చూశాను. ఇలాంటి చిత్రం చూసి చాలా ఏళ్లు అయింది. ప్రతీ కుర్రాడికి ఈ కథ నచ్చుతుంది’ అని చెప్పారు. ‘ఈ టైటిల్‌ విన్నప్పుడే నాకు నా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. ట్రైలర్‌ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. ఈ చిత్రం పెద్ద సక్సెస్‌ అవ్వాలి’ అని సాయి దుర్గ తేజ్‌ అన్నారు.  అడివి శేష్‌ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ చాలా నచ్చింది. ఈ చిత్రంలో అన్ని అంశాలను చూపించారు. ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది’ అని చెప్పారు. ‘కొత్త వాళ్లైనా అందరూ అద్భుతంగా నటించారు. పదిహేను మంది కొత్త ఆర్టిస్టులను నేను ఇస్తున్నాను అనే తప్తి నాకు కలుగుతోంది. సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది’ అని నిహారిక కొణిదెల చెప్పారు.