రోజు ఎప్పటిలాగే తెల్లారింది. కానీ ఇంట్లో దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. ఎవరికీ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఒక్క చిట్టెమ్మ చెల్లెలు నీరజకు మాత్రం కొంతసేపు నిద్ర పట్టింది. నీరజ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నది. నిన్న కాలేజీలో పాఠాలు విని కంప్యూటర్ ముందు గంటల తరబడి ప్రాక్టీస్ చేసి ఇంటికి వచ్చింది. వచ్చీరాగానే ఇరుగుపొరుగు వాళ్ళ పిల్లల అల్లరి తన ఇంట్లో కనపడలేదు. ఆశ్చర్యంగా పిల్లలంతా ఏమయ్యారని అనుకుంటూ లోపలికి వెళ్ళిన నీరజకు అక్క ఇంట్లో ఉన్నట్టు అలికిడి కూడా లేదు. రోజూ ఈ సమయానికి ఇల్లు హడావుడిగా ఈలలు, గోలతో ఉండేది కదా! ఏమయ్యింది అసలు అంతా నిశ్శబ్దంగా ఉంది అని అమ్మానాన్న వైపు చూసింది. వాళ్ళు చెరొక గదిలో దిగులుగా చేరబడడం గమనించి, మళ్ళీ ఏదో గొడవ పడినట్టు ఉన్నారు. రేపటికి కలిసిపోతారులే అనుకుంది. కానీ అక్క ఎక్కడికి పోయిందో మరి. అడుగుదామంటే అమ్మానాన్నలు కోపంతో ఉన్నారు. కిరణా షాపుకు పోయి ఉంటుందిలే. అంతకు మించి ఎక్కడికి పోగలదు అనుకుంటూ ఇంటి బయటకు వచ్చి, ఉదయం వాళ్ళమ్మ ఉతికి ఆరేసిన బట్టలు పాట పాడుకుంటూ తీస్తోంది.
ఎదురింటి పిల్లోడు వాళ్ళ వాకిట్లో ఆడుతుంటే, వాడిని పిలిచి ‘ఏరా బుజ్జి? మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? ఈ రోజు మా ఇంటికి ఆడుకోవడానికి రాలేదేం’ అని అడిగింది. ఆ ఐదేండ్ల పిల్లవాడు వెంటనే ‘చిట్టి ఇంట్లో నుంచి ఎక్కడికో పాపోయింది కదా ఉదయం. అందుకే నీజక్క మా అమ్మ మీ ఇంటికి వెళ్ళొద్దని నా మీద అరిచింది.’
బుజ్జి మాట్లాడుతుండగానే ఇంటి లోపలి నుంచి ‘బుజ్జి బుజ్జి’ అని వాళ్ళమ్మ బుజ్జిని పిలిచింది. అది వినగానే ‘బారు నీజక్క’ అని ఇంట్లోకి పరుగెత్తాడు.
నీరజకు ఒక్కసారిగా భయంతో గుండె దడదడా కొట్టుకోవడం మొదలయ్యింది.
కాసేపటి వరకు అక్కడే ఆలోచిస్తూ కూర్చుండి పోయింది. బుజ్జి వాళ్ళమ్మ నీరజ దగ్గరకు వచ్చి ‘నువ్వైనా ఇలా చెప్పాచేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోకమ్మా. మా బాధ మీకు అర్థం కాదు’ అని గొణుగుతూ వెళ్ళిపోయింది.
మెల్లగా ఆ ఆలోచన నుంచి తేరుకుని చీకటి పడుతుండడం గమనించి లోపలికి వెళ్లింది. ‘నిజంగానే అక్క వెళ్ళిపోయిందా? అందుకే అమ్మానాన్నలలా ఉన్నారా’ అని అనుకుంటూ లోపల వాళ్ళను చూసింది. అమ్మ కన్నీళ్ళను పైటతో తుడుచుకుంటుంది. నాన్న అలాగే దిగాలుగా కూర్చున్నాడు. బుజ్జి చెప్పిన విషయం నిజమేనని అర్థమైన నీరజ, ఆ సంఘటన గురించి అడిగి, వాళ్ళమ్మను ఇంకా బాధ పెట్టడం సబబు కాదనిపించింది. నాన్నను అడిగితే కాలేజీకి కూడా పంపించరేమోనని భయం వేసింది. తన గదిలోకి పోయిన నీరజ, అక్కని తలుచుకుంటూ కాసేపు గాబరాతో కన్నీళ్లు కార్చింది. ఎప్పటికి పడుకుందో తెలియదు ఆకలిని కూడా పట్టించుకోకుండా.
మధ్యరాత్రివేళ ఉలిక్కిపడి నిద్రలో నుంచి మేల్కొంది. మంచి నీళ్ళు గడగడా తాగేసి అమ్మానాన్న లను చూసింది. వాళ్ళ గదిలో బల్బ్ వెలుగుతూనే ఉంది. అటూ ఇటూ తిరిగిన నీరజ మెల్లగా కళ్ళు మూసుకుంది. కలలో చిన్నప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండే ఆరేండ్ల అక్క, తనను ఎత్తుకొని గిరగిరా తిప్పి నవ్వించడం.. గుర్రంలా తన వీపు మీద ఎక్కించుకొని ఇంటి చుట్టూ తిప్పడం.. కాస్త పెద్దయ్యక ‘నువ్వు చిన్నప్పుడు దొరికావు.. పో.. వెళ్ళిపో..’ అంటూ నీరజను నవ్వుతూ వెక్కిరించినవి గుర్తుకురాసాగాయి. అక్కను తలుచుకుని నీరజ ఏడుస్తూ కూర్చుంది.
ఇంతలో అలారం మోగింది. కళ్ళు తెరిచిన నీరజ, తన కళ్ళు తడిగా ఉండటం గమనిం చింది. కలలోనే కాదు బయట కూడా ఏడుస్తున్నానని అర్థమయింది నీరజకు.
ఉదయమూ అమ్మానాన్నలు ఇంట్లో ఏమీ మాట్లాడుకోకుండా ఉండటం గమనించింది. రాత్రంతా జాగారం చేసి అలసిపోయారేమో కాసేపటికి మెల్లగా కళ్ళు మూసుకున్నారు వాళ్ళిద్దరూ.
నీరజ స్నానం చేసి మధ్యాహ్న భోజనం తయారు చేసుకొని కాలేజీకి పోయింది. దారిలో అందరూ చాలా జాలితో చూస్తు న్నారు. కొందరు నిట్టూర్పు విడిచారు.
దారంతా బాగా ఆలోచించింది నీరజ.
అసలు ఆ ఇంట్లో ఇన్ని రోజులు ఉండటమే కష్టం. అయినప్పటికీ తనకు ఏం తెలుసని? ఎవరు తెలుసని? ఎక్కడికి వెళ్ళిందసలు? అందర్నీ నమ్మేస్తుంది. ‘ఎంత పని చేసావు అక్కా. ఒక్క మాటైనా చెప్పాల్సింది ఎక్కడికి పోయావో’ అని మనసులో అనుకుంటూ దిగులుగా కాలేజీ చేరుకుంది.
క్లాస్ రూంలో పరీక్షల గురించి స్నేహితు లతో మాట్లాడుతూంటే, ఓ స్నేహితురాలు మీ అక్క వెళ్ళిపోయిందటగా నీతో ముందే చెప్పిందా?’ అన్నది. మరొక స్నేహితురాలు ‘మీ బావ బాగుంటాడా? నువ్వు చూశావా’ అనడిగింది.
నీరజ సన్నిహితురాలు మాత్రమే ‘మీకు ఎందుకు ఆ విషయాలు? నోరు మూసుకుని మీ పని మీరు చూసుకోండి. లేదంటే మర్యాదగా ఉండదు’ అని కసిరేసింది.
మిగతా స్నేహితులంతా జరిగేదంతా చూస్తూ ఉన్నారు. ‘వాళ్ళంటున్న మాటలు నువ్వు పట్టించుకోకు నీరజ’ అనేసి కొంచెం సేపు మౌనంగా ఉంది.
నీరజకు మాత్రం ‘మీ అక్క ఎవరితోనో వెళ్ళిపోయింది’ అన్నమాట గుర్తొస్తుంటే, అక్క మీద కోపం క్షణక్షణం పెరిగిపోతోంది.
‘అబ్బాయితో వెళ్ళిందా అక్క! ఎంత అవమానం మాకు. ఛా! ఇలా చెప్పా చేయ కుండా వెళ్ళిపోవడం ఏంటి? ఎంత సిగ్గుచేటు. అసలు ఈ విషయం అమ్మానాన్నలకు తెలుసా?’ అనుకుంటూనే, అక్కను ప్రశ్నలతో కడిగి పారేసి, అవమానాలకు తగ్గట్టుగా సమాధానాలు తెలుసుకోవాలని మనసు ఒకటే ఆరాట పడింది, అసహ్య పడింది.
పక్కనున్న సన్నిహితురాలు, నీరజను ఈ లోకంలోకి తీసుకురావాలని.. ‘ఇంతకూ నిన్నటి ల్యాబ్ రికార్డ్ రాసేశావా?’ అని అడిగింది.
నిన్నటి రికార్డు పూర్తి చేయనేలేదని గుర్తు వచ్చి, పుస్తకం కోసం బ్యాగ్ తీసిన నీరజకు బ్యాగ్‌లో పుస్తకాల మధ్య ఏదో కాగితం సగం బయటకు కనిపించింది. తీసి చూస్తే, అది అక్క చేతిరాత. వెంటనే ఆ ఉత్తరం చదవడం ప్రారంభించింది.
‘ప్రియమైన నీరజ,
నువ్వు ఈ ఇంట్లో పుట్టినందుకు నన్ను క్షమిస్తావని తెలుసు. చదువు అయిపోయినా రెండేండ్లు ఓపిక పట్టి పోటీ పరీక్షలు రాసి రాసి ఉద్యోగం రాక అలసిపోయాను. పెండ్లి సంబంధాల హైరానాకు నేనెప్పుడూ మురిసి పోలేదు. లోలోపల ఏదో భయం వెంటాడు తూనే ఉండేది. మనచుట్టూ ఇంతమంది వివాహ జీవితాలను చూసి నాలో పెండ్లి ఆశ చచ్చి పోయింది. తాగుబోతు మావయ్య, డబ్బు పిచ్చి బాబారు, పరువు పిచ్చి నాన్న, ఆడదాన్ని ఆటబొమ్మగా చూసే ఇంకెందరో మన ఊర్లో. మన ఒక్క ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఊర్లలో కూడా ఇదే తంతు. ఊపిరి తీసుకోవడమే పాపం అనేట్టు చేసే మగవాళ్ళను ఆడది అమితంగా ప్రేమిస్తూ, ఓపిక ఉన్నంత వరకూ వాళ్ళతో పడి, ఓపిక లేకపోయినా పరువు పేరుతో భర్తకు దూరం కాకుండా పిల్లలను అంటి పెట్టుకొని ఉంటున్నారు. అలాంటి మగవారి ఆధ్వర్యంలో పిల్లలను పెంచి, ఆ పిల్లలూ వాళ్ళ నాన్న బుద్ధుల్ని అనుసరించేట్టు ఇంకో తరాన్ని తయారు చేసే ఆడది సమాజానికి ఎంత పెద్ద శత్రువో తెలుసుకోదు.
ఎదురించలేని ఆడది, తన గురించి తానే పట్టించుకోని ఆడది సజీవంగా ఉండి ఇక ఏం లాభం? పక్క వీధిలో సుధారాణి పిన్ని చూడు భర్త ఇంకొక ఆడదాని వ్యామోహంలో పడ్డాడని తెలియగానే తెగదెంపులు చేసుకునే వరకూ పోయింది. కట్నం తిరిగి ఇచ్చేయమని పెద్దలను తీసుకువస్తే డబ్బు పిచ్చి బాబారు ఆఖరికి పిన్నిని గౌరవించడం నేర్చుకున్నాడు.
బాబారు వ్యామోహించిన ఆమె కూడా డబ్బు కోసమే బాబారుని వలలో వేసుకుంది. ఈ విషయాలు అందరికీ తెలుసు. ఆ డబ్బును ఆవిడ ఊర్లో ఉండే వాళ్ళ అమ్మానాన్నలకు పంపిస్తుందట. వారికి ఆరోగ్యం క్షీణించడం మొదలైందట. అందుకే భర్త చనిపోయిన ఆమె కిరణా షాపు పెట్టుకున్నప్పటికీ, అవి పిల్లల చదువుకే సరిపోతున్నాయట. మగవాడి అవసరం అతడిది, ఆడదాని అవసరం ఆవిడది. అవసరం కోసం ప్రాణం తాకట్టు పెట్టుకున్నా తప్పు అనిపించదు కదా! ఇక్కడ సమర్థించే విషయాలేమీ లేవు. వాళ్ళ దష్టి కోణాలు నీకు చెబుతున్నానంతే.
అంటే కొందరి దష్టిలో డబ్బు గొప్పది, ఇంకొందరి దష్టిలో శీలం గొప్పది, ఇంకొందరికి అభిమానం గొప్పది, మరికొందరికి ఆత్మగౌరవం గొప్పది, పిల్లల భవిష్యత్తు. ఇంకొందరికేమో తాగుబోతు మొగుడుతో అవస్థ.. ఇలా ఎన్నో. ఓ పది ఇండ్లల్లో మాత్రమే భార్యాభర్తలు ఆనందంగా ఉంటున్నారు. అలాంటి వారిని చూస్తే ప్రేమ ఇంకా అంతరించి పోలేదని అర్థమవుతుంది. అయినప్పటికీ నమ్మకం, బాధ్యత, గౌరవం లాంటి వ్యక్తిత్వాలు లేకపోలేదు.
కొందరు ఆడవాళ్ళు మగవాడు తప్పుడు దారిలో నడిచినా సరే క్షేమంగా ఉండాలని ఎన్నో పూజలు చేస్తుంటారు. ఉదాహరణకు మన పెద్దమ్మ లాంటి వారు. సమాజంలో చాలా మంది మూఢ నమ్మకాల ముసుగులోనే ఉన్నారు. దేవున్ని ప్రార్థించడం కాదు మనుషులు మారాలి మనుషుల్ని మార్చాలి అని అమ్మకు వెయ్యి సార్లు చెప్పాను. ఎలాంటి లాభం లేకపోయింది. కాలానికి తగ్గట్టు పద్ధతులు మార్చుకోకపోవడం ఎంత మూర్ఖత్వమో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. నీకు నేను చెప్పింది అర్థమైతే అమ్మకు వివరించు. ఇంతకూ అసలు సంగతి ఏమిటంటే.. రెండు రోజుల క్రితం పక్క వీధిలో జరిగిన సంఘటన చెప్పాలనుకుంటున్నాను. నీకు పూర్తిగా తెలియదు కదా..! నువ్వు ఇంట్లో విషయాలను పట్టించుకుంటే కదా అసలు.
పక్క వీధిలో మన మావయ్య కాశీ, ఆ పక్కింటి పిల్ల మాలతిపై అఘాయిత్యం చేయబోయాడు. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళింట్లోనే గడిపేది. మావయ్య పిల్లలతోనే ఆడుకునేది కదా! ఒకే వయస్సు పిల్లలు వీధంతా తిరిగి ఆడుకునేవారు. ఇన్ని రోజులు ఆ పిల్ల వాళ్ళ పిల్లలాగే కనిపించి, ఇప్పుడేంటో కొత్తగా కనబడిందట. బక్కపల్చని శరీరంతో నీరసంగా కనబడే ఆ పిల్లను ఏ దష్టితో చూశాడో తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఆ పిల్ల ఇప్పుడు డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది. కాలేజీ అయిపోగానే ఓ సాయంత్రం ఫ్రెండ్స్‌తో కలిసి పానీపూరీ తినడానికి పోయిందట. అక్కడే మావయ్య కనబడితే బండి ఎక్కిందట. మన ఊరి రోడ్డును దాటి అడవి వైపు తీసుకొని పోతుంటే భయంతో గట్టిగా అరిచించట. చీకట్లోకి ఎందుకు మావయ్య? ఆపకపోతే బండి మీద నుంచి దూకేస్తాను అన్నదట. ఆ చీకట్లో బండి ఆపేసి మీద చెయ్యి వేసాడట. ఆ పిల్ల తప్పించుకొని ఇంకో దారిలో ఏడుస్తూ వచ్చి, జరిగిన విషయం ఇంట్లో వాళ్ళతో చెప్పిందట. మావయ్య తాగుబోతు. కానీ ఎప్పుడూ బాగానే తీసుకొస్తాడు. అయినా కానీ మగబుద్ధి మందబుద్ధి కాకపోదు. ఆ పిల్ల విషయం చెప్పగానే వాళ్ళింట్లో వాళ్ళు కర్రలు పట్టుకుని మావయ్య ఇంటి మీదకు పోయారట, మావయ్యను కొట్టడానికి.
కానీ అతడు ఇంటికి రాలేదట. కాసేపటికి వచ్చి ‘నేనేమీ చేయలేదు. అసలు తాగలేదు. తాగి ఏదైనా చేశానంటే అర్థం ఉంది’ అని ప్రమాణాలు వేసి, ‘కావాలంటే సీసీ కెమెరాలలో చూసుకోండి’ అని తప్పు చేయని వాడిలా దర్జాగా బదులు ఇచ్చాడట.
పిల్ల అమ్మా, నాన్న పోలీసు కంప్లైంట్ ఇస్తే, అప్పుడు తెలిసింది అసలు విషయం. కెమెరాల్లో అంతా రికార్డు అయ్యింది. అప్పటికే తాగేసి వున్న మావయ్య ధీమాగా ఈ ఒక్కసారి తప్పు జరిగింది క్షమించండి అని అడిగాడట. విషయం తెలిసిన అత్త కూడా క్షమించండి మరోసారి ఇలా చేయడు అని వత్తాసు పలికిందట. మగాడి నేరాన్ని మగాడు సమర్థించడం ఎంత సహజమో, అంతే సహజంగా ఆడది ఇంకో ఆడపిల్ల గురించి ఆలోచించకపోవడం ఆశ్చర్యాన్ని, అసహ్యాన్ని కలిగించింది. అంతేకాదు తప్పు మావయ్యదే అని తెలిసి కూడా అతడికి శిక్ష పడకుండా ఉండాలని మన నాన్న, ఊరి పెద్ద మనిషి, బాబారు, అన్నలు ఎంతలా ప్రయత్నించారో తలచుకుంటేనే సిగ్గనిపించింది.
శిక్షను తప్పించినందుకు ఆ పెద్దోళ్ళంతా ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటుంటే చెప్పు తెగేటట్టు అందరినీ కొట్టాలనిపించింది. అంతేకాదు మాలతి వాళ్ళ అమ్మానాన్నలకు కొంత డబ్బిచ్చి, ఫిర్యాదు వెనక్కు తీసుకోమంటే, వాళ్ళు కూడా ఆ మాయదారి డబ్బు తీసుకొని కన్నకూతురుకు జరగబోయిన అన్యాయాన్ని మర్చిపోయారు. ఆ పిల్ల కాలేజీకి వెళుతుంటే మన ఊర్లో వాళ్ళే, ‘నిన్నేనా? మీ పక్కింటి మావయ్య అడవికి తీసుకువెళ్ళాడు!’ అని అడుగుతుంటే బయటకు రావడానికే భయపడి సాయంత్రం కాలేజీలోనే ఉండిపోయింది. ఆ రాత్రి వాళ్ళ నాన్న వెళ్లి దగ్గరుండి తీసుకు వచ్చాడట.
మాలతి తల్లిదండ్రులను తిరిగి ప్రశ్నిస్తే, ‘మన పరువే పోతుందమ్మా ఈ విషయాన్ని పెద్దది చేసుకుంటే’ అని ఏవేవో చెప్పారట. భరోసా ఇవ్వాల్సిన అమ్మానాన్నలు కూడా డబ్బుకు ఆశ పడడం చూసి ఆ పిల్ల మాలతి అన్నం తినడం మానేయడంతో జబ్బు పడింది. తీసుకున్న డబ్బు వైద్యానికి సరిపోయింది. మాలతి ఇప్పుడు మనుషుల్ని నమ్మడం మానేసి మొండిగా తయారైంది. కాదు, ఈ లోకమే తనను అలా మార్చేసింది. రేపు నీకో, నాకో అలాంటి సమస్య ఎదురైతే ఎలా?
కనీస ఆలోచన లేకుండా ప్రవర్తించినవారిని చూస్తుంటే పశువులే గుర్తొస్తున్నాయి. నిజానికి ఇలాంటి మనుషుల వల్ల బయటకు వెళ్ళలంటేనే భయపడుతున్నారు ఆడవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో కూడా రక్షణ లేకపోగా, తప్పు చేసేవాళ్ళని సమర్థిస్తూ శిక్షను తప్పించేవాళ్ళు ఉండటం ఎంత శోచనీయం. అందులోనూ భార్యలే వాళ్ళ భర్తలను వెనకేసుకు రావడం. అది కూడా పనిపాట లేకుండా తాగి తందనాలాడే మావయ్య ిగురించి అత్త అంతలా ప్రయాస పడడం. ఇలాంటివి చూసిన నేను ఎవరికి భయపడాలో? ఎందుకు భయపడాలో తెలియలేదు. బాగా ఆలోచించుకున్నాను ఒక్కొక్క విషయం గుర్తువచ్చాయి. మొన్న ఎప్పుడో పక్కింటి బాబారు ఇంటికి వాళ్ళ అత్త వచ్చిందట. అందరూ మధ్యహ్న వేళ తినేసి చిన్నగా కునుకు వేశారట. ఆ సమయంలో తాగేసివున్న బాబారు వాళ్ళ అత్త చెయ్యి పట్టుకుని మంచం మీదకు రమ్మన్నాడట. ఆవిడ నాలుగు రోజులు ఉందామని వచ్చి, పాపం ఆ సాయంత్రానికే వెళ్ళిపోయిందట. ఈ మగాళ్ళు ఎంత దిగజారి పోయారో ఆలోచిస్తేనే లోకం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. లోకం ఎప్పటికీ ఇలాగే ఉన్నా, లేకపోయినా మనం మాత్రం ఇలానే మన ఆశల్ని, ఆశయాల్ని మరిచిపోయి ఓ మగాడి ఆధీనంలో బతకడం నాకు ఏ మాత్రం సబబుగా అనిపించలేదు.
మగవారందరూ ఇంత నీచంగా ఉంటారని నేను అనను. కానీ మన పరిసరాల్లో ఉన్న నీచుల కంటే లోకం ఏమంత ప్రమాదకరమైనది కాదు. ఈ కొన్ని రోజులు నా మనసంతా ఎంత మధన పడిందో నీకు తెలియదు, చివరికి ధైర్యం తెచ్చుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు అన్ని విషయాలు అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నావు కాబట్టి ఈ విషయాలన్నీ చెబుతున్నాను. నాకు వున్న డిగ్రీకి ఎక్కడో ఒకచోట ఉద్యోగం దొరుకుతుంది. అలాగే నా పోటీ పరీక్షలు రాయడం మానుకోను. మన ఊర్లో వున్న ఆడవాళ్ళకు ధైర్యం రావాలంటే మనలాంటి వాళ్ళే ముందుకు రావాలి. మనిషిగా బతకడం సులభమేనని నమ్మకం కలిగించాలి. నీ డిగ్రీ అయ్యేంత వరకూ అక్కడే ఉండు. తర్వాత ఏదైనా ఉద్యోగం తెచ్చుకుని బతుకు. అమ్మని నిర్భయంగా ఉండమని చెప్పు. కుదిరితే ఈ ఉత్తరాన్ని చదివి వినిపించు. నేను ఎంత ధైర్యంగా ఉన్నానో అమ్మ అర్థం చేసుకోగలదు. నేను ఇప్పుడు రాజమండ్రిలో నా స్నేహితురాలి ఇంటికి వెళుతున్నాను. నాకు తెలుసు నాన్న చాలా బాధపడతాడు. లేదా కూతురు చనిపోయిందని సర్ది చెప్పుకుంటాడు. ఏదేమైనా నా సంగతి అప్పుడే నాన్నకు చెప్పకు. వెంటనే అర్థం చేసుకుంటాడని నేను నమ్మను. కొన్ని రోజులు పోయాక నువ్వే సందర్భం చూసుకుని నాన్న ఈ ఉత్తరం చదివేలా చేయి. అనుభవం తర్వాత వచ్చే మార్పును ఎవరూ మరిచిపోరు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కాలేజీ చిరునామాకు నేను ఉత్తరాలు రాస్తుంటాను.’
ఉత్తరం మడిచి పెడుతూ, కళ్ళ వెంట నీళ్ళతో ‘అక్కని నేను అనుమానించాను, అవమానించాను. పరాయి వాళ్ళతో సమానంగా నన్ను నేను కించపరుచుకున్నాను. అక్క ఆలోచనలను నేను అంచనా వేయలేకపోయాను, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. పైగా కొన్నిసార్లు ఎగతాళి చేశాను’ అని కళ్ళు తుడుచుకుంటూ,
నాకు తెలియకుండా ఊర్లో ఇన్ని విషయాలు జరుగుతున్నాయా! ఛీ! సమాజం ఇంత దారుణంగా ఉందా! ఎవరికివారే వున్న ఈ లోకంలో ఎన్ని మోసాలు, ఎన్ని తప్పులు అనుకుంటూ కాసేపు మనుషుల మీద కోపాన్ని తన తలనొప్పిగా చేసుకుంది. వద్దు ఇంక ఈ లోకం గురించి ఆలోచించడం అనవసరం. ‘మన జాగ్రత్తల్లో మనం వుండి మన పని మనం నిజాయితీగా చేసుకుంటే సరి అనుకుంది. అక్క చెప్పిన మాటలు, బాటలు నాలో కొత్త మార్పును ఇచ్చాయి. నన్ను క్షమించు అక్కా’ అని మనసులోనే అనుకొని,
కాలేజీ అయిపోగానే సాయంత్రం నేరుగా ఇంటికి రాసాగింది. ఇంటి ముందు అమ్మలక్కలు గుమిగూడి వాళ్ళమ్మతో మాట్లాడుతున్నారు.
‘ఏంటే అక్కా! చిట్టమ్మ మనకి చెప్పకుండా ఇంత పని చేసింది. అసలు బయటకు వెళ్లి ఒంటరిగా ఎలా బతకగలననుకుంది? కనీసం తన చెల్లెలి గురించి ఆలోచించి ఇలాంటి పని చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఆ చిన్నదాన్ని ఎవరు చేసుకుంటారు?’
ఇంతలో ఇంకొక ఆమె ‘అయ్యో! వదిన అంత మాత్రం ఆలోచించకుండా చిట్టెమ్మ ఎవరితోనో వెళ్ళిపోయింది. కానీ ఆ కుర్రాడు ఎవడో, ఎలాంటివాడో కూడా తెలియదు మనకు. చిన్నప్పటి నుంచి కనిపెంచిన తల్లిదండ్రులను కూడా వదిలిపోయి ఎంత నీచమైన పని చేసింది. పరువంతా తీసేసింది’ అంటూ బాధతో కన్నీరు కర్చింది.
మనిషోక మాట అంటున్నారు. కొందరు నిజంగా బాధపడుతున్నారు. ఇంకొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారు. నీరజ, అమ్మ ముఖం వైపు చూసింది, ఆ ముఖం చాలా ఉబ్బిపోయింది. కన్నీళ్లు అసలు ఆగడం లేదు. నీరజకు ఏం చేయాలో తెలియడం లేదు. వారి మీద కోపంతో, వాళ్ళ అమ్మ మీద జాలితో నీరజ గట్టిగా, ‘ఇంట్లో నాన్న లేనట్టు ఉన్నారు అమ్మా! అన్నది’.
అందరూ అడ్డు తొలగి నీరజకు ఇంట్లోకి పోవడానికి దారి ఇచ్చారు. నీరజ ఇంట్లోకి వెళ్లి నాన్న లేరు కాబట్టి వీళ్ళ నాటకం మొదలు పెట్టారు అని గ్రహించి, ‘అమ్మా! నాన్న పక్క వీధిలో కనిపించారు. అత్తతో మాట్లాడుతున్నారు’ అని చెబుతుంది.
ఆ మాటలు విన్న అమ్మలక్కలు ఒక్కొక్కరుగా లేచి ‘అమ్మో! మీ ఆయన వస్తే ఇందాకటిలా మళ్ళీ ఇల్లంతా గందరగోళం చేస్తాడేమో, నువ్వు జాగ్రత్తగా ఉండు, అసలే తాగేసి వున్నాడు. మేం మళ్ళీ వస్తాం’ అని వెళ్ళిపోతుంటారు.
నీరజ వాళ్ళ అమ్మకు దగ్గరగా వెళ్ళి, ‘ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ అమ్మలక్కల మాటాలకా?’ అనడిగింది. అమ్మ సమాధానం చెప్పలేదు.
‘అయితే ఇరుగుపొరుగు వారు అంటున్న మాటల్ని నువ్వు నమ్ముతున్నావు కదూ! ఈ రెండేండ్లు నీతోనే కదమ్మా అక్క ఎక్కువ సమయం కలిసుంది. దాని అభిప్రాయాలు, బాధలు, ప్రేమలు, నీకు బాగా తెలుసు కదా! అయినా ఎందుకు ఇలా బాధపడుతున్నావు.’
అమ్మ నోరు తెరిచింది, గట్టిగా కోపంతో ‘అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు. పిల్లల్ని పెంచడం చేతకాదని తిడుతున్నారు. దానికి ఏం లోటు చేశామని? ఇంతకు తెగించింది. ఇన్నేండ్లు మేమే కదా పెంచాం. ఇప్పుడేం బాధ వచ్చిందని? అయినా మీ అక్క ఒక్కర్తే వెళ్ళిందా? ఎవడితోనైనా లేచి పోయిందా? నీకు ఏమైనా చెప్పిందా? ఊర్లో వాళ్ళ మాటలకు సమాధానాలు నా దగ్గర లేవు. మా బాధ నీకు చెప్పినా అర్థం కాదు.’ అంటూ ఆవేదన వెళ్లగక్కింది.
నీరజకు ఆశ్చర్యం వేసింది. దుఃఖం వచ్చింది. ‘ఛీ! ఏంటమ్మా నువ్వు కూడా అందరిలాగే అక్కను అవమానిస్తున్నావా? ఇలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఆ పిచ్చిది పాపం నువ్వు అర్థం చేసుకుంటావని ఉత్తరం రాసింది. లేకపోతే నేను కూడా నీలాగే అనుకునేదాన్ని. ఇదిగో చదువుకో నువ్వే..’ అని కాలేజీ బ్యాగ్‌లో నుంచి ఉత్తరం తీసి అమ్మకు ఇచ్చింది.
ఆ ఉత్తరం చదువుతూ అమ్మ కన్నీళ్లు కారుస్తుంది. ‘నేను నా కూతురుని అర్థం చేసుకోలేకపోయాను. ఇంట్లో హాయిగా ఉంది అనుకున్నాను. ఇవన్నీ ఆలోచిస్తూ ఇంత బాధ అనుభవిస్తుందని అనుకోలేదు’ అంటూ బాగా ఏడ్చేసింది.
కాసేపటికి నీరజతో, రాజమండ్రిలో వాళ్ళ స్నేహితులతో మీ అక్క ధైర్యంగా ఉంటుంది. ఇంక నాకు ఏ దిగులు లేదు. ఈ ఇరుగు పొరుగు వారి మాటలు నేను పట్టించుకోను. దాని సంతోషమే ముఖ్యం. అసలు అక్కను వెళ్ళిపోయేలా చేసింది ఈ సమాజమే. ఇంక ఈ సమాజం ఏమనుకుంటే నాకేంటి. ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు. నా కూతురు ఎంత ధైర్యవంతురాలో, ఎంత తెలివైనదో ఎప్పుడో ఒకరోజు అందరికీ తెలుస్తుంది అని అంటూ వంట గదిలోకి వెళ్ళింది.
‘ఒక్క ఉత్తరంతో అమ్మలో ఎంత మార్పు వచ్చింది’ అని సంతోషించింది నీరజ.
చిట్టెమ్మ ఉత్తరం రాయకుండా అందరినీ అసహ్యించుకుని వెళ్ళిపోతే. ఊర్లో వాళ్ళ మాటలే నిజమని నమ్మేసేది వాళ్ళ అమ్మ. నిజానికి చిట్టెమ్మకు కుటుంబం మీద బాధ్యత, ప్రేమ ఇంకా ఉన్నాయి కనుక ఆ నిర్ణయం వెనుక కారణాలను అర్థమయ్యేట్టు చెప్పింది. అంతేకాకుండా వాళ్ళ నాన్నను బాగా అర్థం చేసుకుంది కాబట్టి ఎప్పటికైనా మారుతాడని ఆశించి ఉత్తరం అందించమంది.
పది నెలల తరువాత ఓ ఉదయం ఎప్పటిలాగే తెల్లారింది. నీరజ కాలేజీకి బయలుదేరుతున్న సమయంలో ఎదురింటి బుజ్జిగాడు చకచకా పరుగెత్తుకొని నీజక్క.. నీజక్క..! చూడు, చిట్టి అని వార్తాపత్రిక చూపించాడు. చిట్టి పేరు వినగానే వాళ్ళ అమ్మానాన్నలు కూడా ఏమయ్యిందో ఏమో అని గాభరాగ ఆ పత్రిక వైపు చూశారు. నీరజ ఆ పత్రికలో అక్క గురించి బయటకు వినిపించేలా చదువుతుంది. అందరి కళ్ళల్లో ఆనంద భాష్పాలు పొంగుతాయి. నీరజ వాళ్ళమ్మ చూశారా? మన కూతురు ఎప్పుడూ తప్పు చేయదు. అంతమంది నిరాశ్రయులకు ఆశ్రమంగా నిలిచింది. అనాధలకు ఆత్మ బంధువుగా నిలిచింది. ఆ అనాధల్లో మగవాళ్ళు కూడా ఉన్నారు. మనసున్న మనిషిగా మన కుటుంబం పరువును ఎలా నిలబెట్టిందో చూడండి. ఇంతకు మించిన సంతోషం మన జీవితంలో ఏదీ లేదు. ఇంత చిన్న వయసులో అందరి ప్రశంసలు అందుకుంటుంది మన చిట్టి తల్లి. మనకు దూరంగా ఉండి ఇన్నిరోజులు ఎంత మంది ప్రేమకు దగ్గరైందో చూడండి. ఊర్లో వాళ్ళ నోళ్ళను మూయించే సందర్భం ఏనాటికైనా వస్తుందని ఎంత ఆశించానో. అంతకంటే పెద్ద ఘనతే సాధించింది. మన చిట్టెమ్మ ఇప్పుడు లోకం జట్టు అయిపోయిందండి అంటూ సంతోషంతో ఏడ్చింది.
ఇప్పటికైనా మనల్ని క్షమించగలిగితే అంతే చాలు అని వాళ్ళ నాన్న బాధతో కళ్ళు తుడుచుకుంటాడు. ఊరు ఊరంతా ఆశ్చర్యంతో ఆనందంతో పశ్చాత్తాపంతో నిండుకుంటుంది.
మార్పు మొదట మన నుంచి, తర్వాత కుటుంబం నుంచి, అలా సమాజం వరకూ వస్తుంది. వచ్చేలా చేయడానికి, అర్థం అయ్యేలా చెప్పడానికి సమయం పడుతుంది.
మొత్తానికి చిట్టెమ్మ ప్రయత్నం అయితే మొదలు పెట్టింది, ఫలితం సాధించింది. ఇలా ధైర్యంగా, నిజాయితీగా, బాధ్యతతో ఆలోచించే చిట్టెమ్మ లాంటి వారు ప్రతీ కుటుంబంలోనూ ఉంటే సమాజంలో మార్పు కచ్చితంగా వస్తుంది.
ఉత్పలిని