చిట్టి చామంతి

Chitti Chamantiటైం తొమ్మిదిన్నర అయుండె. ఇంకో అర్ధగంటలో ఆన్‌లైన్‌లో క్లాసుల కూర్చోవాల. పొద్దున పని అయింది. టవల్‌ తీసుకుని స్నానానికి వెళుతుండగా కాలింగ్‌బెల్‌ మోగింది. ఈ టైంల ఎవరై ఉంటరు!
తలుపు తీసీతీయక ముందే ”అక్కా.. మీ ఇండ్లల్ల ఏమైన పని ఉంటే చెప్పుండ్రి” ఇంతకు ముందెప్పుడు చూడలేదామెను. నన్ను అక్కా అనటం కాస్త ఆశ్చర్యం కలిగించింది. కాస్త తేరిపారగా చూసాను. వయసు పాతిక కంటే తక్కువే ఉండచ్చు.
పసుపుపచ్చ రంగు నూలు చీర, ఎర్రటి రవిక. నుదిటిపైనన పావలా కాసంత బొట్టు. దీనమైన చూపులతో ఆమె.
”మాకు పెద్దగా పని లేదు. అవసరం లేదు” అని తలుపు వేయబోయాను. క్లాసుకి ఆలస్యం అవుతోందని కాస్త చిరాకుగా.
తలుపు మూయనీకుండా చేత్తో ఆపి, ”గట్లనకక్కా.. పిల్లలైన దాన్ని. పనులన్నీ మంచిగ చేస్తా”. దీనమైన చూపులతో ఆమె మాటల్లో ఏదో బాధ కదలాడుతోంది. ఇక తలుపు వేయలేకపోయా. పాపం నిజంగా పని అవసరమేమో ఈ అమ్మాయికి అనిపించింది.
నా కళ్ళల్లోని అంగీకారం, భరోసా తనలో ఎంత ఉత్సహం నింపిందో ఏమో, చనువుగా వంటింట్లోకి వెళ్లి సింకులో ఉన్న అంట్ల గిన్నెలు చకాచకా తోమడం మొదలు పెట్టింది. సువర్ణ పనిలో చేరి మూడు నెలలు గడిచి పోయాయి. తను వచ్చాక నా ప్రాణానికి హాయిగా ఉంది. తను మాటల పుట్ట. రోజు ఏదో ఒక ముచ్చట చెప్తుంది. ఈ రోజందుకో మూగమనిషిలా పనిచేస్తోంది.
”ఏంటి సువర్ణ ..! ఈ రోజు ఇంటి దగ్గర విశేషాలు ఏం లేవా..? ఏం ముచ్చట చెప్తా లేవు నాకు” అన్నాను నవ్వుతూ బ్రెడ్‌ టోస్టర్‌ నుంచి తీసి జాం రాస్తూ.
అప్పుడు కళ్ళెత్తి నా వంక చూసింది. అంతే! కట్ట తెగిన చెరువు నుంచి పరుగులు తీసే వరద నీటిలా కళ్ళల్లో నుంచి చెంపల మీద కారిపోతున్నాయి కన్నీళ్ళు. ఎప్పటి నుంచి ఏడుస్తోందో కళ్ళు ఉబ్బి ముఖం ఎర్రగా కందిపోయి ఉంది.
సువర్ణని అలా చూడగానే కంగారు వేసింది నాకు. ”అయ్యో..! ఏమైంది సువర్ణా..? ఇంట్లో అందరు మంచిగున్నరు కదా?”
”అందరు మంచినే ఉన్నరు అక్కా. నాకే దిమాగ్‌ ఖరాబు అయిన్డె. నా మొగుడు యాదగిరి కొట్టిండు” అంది కళ్ళు తుడుచుకుంటూ.
”అయ్యో.. ! ఎందుకు.. ! ఎందుకు కొట్టాడు” బ్రెడ్‌ పక్కన పెట్టేసాను.
”అక్కా.. వాడు రోజు కైకిలికి పోడు. పోయిన దినం కైకిలి పైసలుతో గుడుంబా తాగి ఇంటికొస్తడు. ఇంట్లో కరుసంతా నాకొచ్చే పైసలుతోని నడుస్తది. తాగచ్చి ”లగ్గం అప్పుడు ఇస్తానన్న కట్నం ఇంకా ఈలేదు నీ అయ్య. ముగ్గురు పోరిలను కని నా నెత్తికి చుట్టినవ్‌” అంటా ఇష్టమొచ్చినట్లు బాదేస్తాడు. నా పెయ్య చూడక్క” అంటూ వీపు చూపించింది
ఆమె వీపు మొత్తం ఎర్రగా కందిపోయినట్టు ఉన్న అరచేతి వేళ్ళ గుర్తులు. జబ్బల మీద కట్టెతో కొట్టినట్టు దెబ్బలు. పాతికేళ్ళు కూడా నిండని సువర్ణకు ముగ్గురు పిల్లలా..! అదిరిపడ్డాను.
”అయ్యో.. ఇంట్లో ఇంత దారుణాన్ని ఎదుర్కుంటున్నావా నువ్వు?. మరి ముగ్గురిని కన్నావు కదా, ఇక పిల్లలవకుండా ఆపరేషన్‌ చేయించుకున్నావా లేదా ?” సువర్ణ పరిస్థితికి చాల ఆవేదన కలిగింది.
”నేను ఆపరేషన్‌ చేయించుకుంటనంటే, ఇంటికి వారసుడు పోరడు పుట్టే దాక నువ్వు కనాల్సిందే అని నా మొగుడు, అత్త ఇద్దరూ కూడబలుక్కుని నన్ను కట్టెతో బాదేసిర్రు రేతిరి”. మళ్ళీ బావురుమంది.
లోపల నుంచి మా మాటలు విన్నాడేమో ఎప్పుడూ మౌనమునిలా ఉండే నిఖిల్‌ బయటకు వచ్చి,
”సువర్ణా.. నువ్వు భయపడకు. మీ ఆయన దగ్గరకు వచ్చి నేను మాట్లాడతాను. నీకు ఆపరేషన్‌ చేయించేలా మీ వాళ్ళని నేను ఒప్పిస్తాను. నువ్వు దిగులుపడకు.” తను చెప్తుంటే నాకు ఎక్కడలేని అబ్బురం కలిగింది.
నాకు తెలిసిన నిఖిల్‌లో ఈ తెలియని కొత్త మనిషిని ఇప్పుడే చూసాను సంభ్రమాశ్చర్యాలతో.
”గట్లనే సారూ. నిన్నటి సంధి నేను వడిన రంధి మీ మాటల్తో తీరిపోయే. గా మైసమ్మ తల్లి మిమ్మల్ని చల్లగా చూడాల” దాని కళ్ళల్లో ఏదో నిశ్చింత.
మూడు నెలలు పోటీపడి మరి పరుగు పందెంలో పాల్గొన్నట్లు ముందుకు దూసుకుపోయాయి.
పొద్దునే పనికి వచ్చిన సువర్ణ అంట్లు తోముతూ సింకు మీద నుంచి కిందికి వాలిపోయింది. వంటింట్లోనే కూరలు కట్‌ చేస్తున్నాను. ఒక్క క్షణం బిత్తరపోయాను. వెంటనే అలెర్ట్‌ అయి సువర్ణని పొదివి పట్టుకుని లేపి నెమ్మదిగా నడిపించి సోఫాలో కూర్చోబెట్టాను. ఫ్రిడ్జ్‌లో నుంచి గ్లూకోస్‌ పాకెట్‌ తీసి, వాటర్‌ కలిపి ఇచ్చాను. నెమ్మదిగా తాగింది. పాపం పని చేసి చేసి ఎంత అలిసిపోయిందో అని జాలి వేసింది తప్ప మరో సందేహం ఏం కలగలేదు నాలో అప్పటికి.
ఐదు నిముషాలు కూడా కాలేదు. నోటికి చేయి అడ్డు పెట్టుకుని సింకు దగ్గరకు పోయి భళ్ళున వాంతి చేసుకుంది. ఈ సారి మాత్రం కాస్త అనుమానంగా చూసాను తనవైపు. నా చూపులకు తప్పు చేసినట్టు తలవంచుకుంది.
నా సందేహాన్ని తీరుస్తున్నట్టు ”వినీతక్కా.. ఆపరేషన్‌ చేసుకొనికి నా అత్త, మొగుడు అసలు ఒప్పుకుంటలేదు. వంశం నిలబెట్టే పోరడు పుట్టేదాక కనాల్సిందే, లాకుంటే నీ పుట్టింటికి పొమ్మని చెప్పిర్రు. ఇప్పుడు మళ్ళీ కడుపొచ్చింది” నీరసంగా అంది కింద కూర్చుంటూ.
వంశం సంగతేమో కానీ ఈలోపల నీ వొళ్ళు హూనం అయిపోయేట్టు ఉంది. కొన్ని రోజులు విశ్రాంతి అవసరం నీకిప్పుడు. డాక్టర్‌కి చూపించుకో, పండ్లు కొనుక్కుని తిను. ఓ వారం రోజులు పనికి రాకు. నేనెలాగో చేసుకుంటానులే.” అంటూ వెయ్యి రూపాయలు తన చేతిలో పెట్టాను. కళ్ళతోనే కతజ్ఞతలు చెప్పింది సువర్ణ చేతులు జోడిస్తూ.
శనివారం వారాంతపు సెలవు రోజు. కాస్త రిలాక్స్‌గా టీ తాగుతున్నాం. ప్రణవ్‌ ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుకుంటానని వెళ్ళాడు.
”చూసావా నిఖిల్‌..! సువర్ణ మళ్ళీ ప్రెగెంట్‌ అయిందట. ఆ రోజు మీరు వెళ్ళి అంతసేపు చెప్పిన మాటలు బూడిదలో పోసిన పన్నీరు అయినాయి. మీ మాటలు పెడ చెవిన పెట్టారు వాళ్ళు. వంశోద్ధారకుడు కావాలి అంటూ మళ్ళీ ఆ అమాయకురాలి ఉసురు పోసుకుంటున్నారు”
”అయ్యో..” నిఖిల్‌ ముఖంలో ఏ భావాలు కదలాడాయి కనిపెట్టడం కష్టమైంది నాకు.
”ప్రణవ్‌ తర్వాత నాకిక పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్‌ చెప్పేసాక, ఓ పాప కావాలనుకున్న నేను ఎంత కుమిలిపోయానో నీకు తెలుసు కదా. కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఉండదు” సన్నటి నీటి చెమ్మ నా కళ్ళల్లోనుంచి జారడం చూసి
”ఎక్కువగా ఆలోచించకు వినీ.. మనకు ప్రణవ్‌ ఉన్నాడు కదా. వాడితోనే తప్తి చెందుదాం”. మనకు ప్రాప్తం అయిన దానితో తప్తిపడే మనఃతత్వం నిఖల్‌ ది.
పొద్దున వస్తూనే నన్ను చుట్టేసి బావురుమంది సువర్ణ . ఏం జరిగిందో తెలియని ఆందోళన నాలో. కాసేపు తనని అలాగే హత్తుకుని అనునయంగా వీపు నిమిరాను.
”వినీతక్కా.. రేపటి నుంచి పనికి రాను” కన్నీళ్ళు దాని చెంపలను తడిపేస్తున్నాయి
”అయ్యో. ఏమైంది నీకు. ఆరోగ్యం అంతా మంచిగా ఉంది కదా. ఎందుకు సువర్ణా..!.. నీకిప్పుడు ఐదో నెలే కదా”
”నాకు మంచిగనే ఉండె. మేము కైకిలికి ఐద్రాబాద్‌ వెళ్ళిపోతున్నాం”
”అయ్యో. అదేంటి. నువ్వు ఉత్తమనిషివి కాదు కదా. నువ్వెలా కూలీ పనులకెళ్తావు?”
”నాకిష్టం లేదక్కా. నా అత్తా, మొగుడు ఐద్రాబాద్‌ల అపార్ట్మెంట్లల పనుల్లో మంచిగా పైసలిస్తరని బలవంతంగా అక్కడికి నన్ను, పోరీలను తోల్కపోతున్నరు. వాళ్లిద్దరూ అనుకుంటే ఇక నా మాట ఖాతర్‌ జెయ్యరు” నిన్నటి సంధి ఎంత దుఃఖభారాన్ని మోస్తోందో గట్టుతెగిన చెరువులా సువర్ణ కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆగకుండా.
మూడ్నెల్ల జీతం అదనంగా ఇచ్చి, నాలుగు కాటన్‌ చీరలు కవర్‌లో పెట్టి తన చేతికి ఇచ్చాను. అంతకంటే ఇంకేం చేయలేకపోయాను అప్పటికి. కతజ్ఞత నిండిన కళ్ళతో చూస్తూ నా కాళ్ళకి మొక్కాలని వంగబోయిన సువర్ణని పట్టుకుని లేపి గుండెలకు హత్తుకున్నాను. తనని ఎప్పుడూ పనిమనిషిలా చూడలేదు నేను.
”వినీతక్కా.. నాకు పోరడు పుట్టాలని దీవించక్కా” అంటున్నప్పుడు మళ్ళీ సువర్ణ కళ్ళు విషాదసాగరాలు అయినాయి. అదే తనని చివరిసారి చూడడం.
నిఖిల్‌ ఫ్రెండ్‌ ఒకరు యూ.ఎస్‌. వెళుతుంటే తనతో రెండు రోజులు ఉండాలని హైదరాబాద్కి వచ్చాం. కోఠి బజార్‌, ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళాం. రెండో రోజు మధ్యాన్నం తాజ్‌ బంజారాలో లంచ్‌. అర్ధరాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాం. నాలుగు గంటల ఫ్లైటుకి రంజిత్‌కి వీడ్కోలు చెప్పి, నిఖిల్‌ వాళ్ళ బాబారు ఇంటికి వెళ్ళాం.
ఉదయం బాబారు వాళ్ళ కారు తీసుకుని చిలుకూరు బయలుదేరాం. భాగ్యనగరపు ట్రాఫిక్‌లో అతి మెల్లగా డ్రైవ్‌ చేస్తున్నాడు నిఖిల్‌. మెహిదీపట్నం రైతు బజార్‌ దాటడానికి అర్ధగంట పట్టింది. లంగర్‌ హౌస్‌ ఫ్లైఓవర్‌ దిగాక కాస్త తగ్గింది ట్రాఫిక్‌. కాస్త ఊపిరి పీల్చుకున్నాం. కారు విండో తెరిచాను, కాస్త బయటి గాలి కోసం.
అర్ధ కిలోమీటర్‌ వెళ్ళాక దారిలో గుంపుగా జనాలు ఉన్నారు. జనాలంతా గోలగోలగా మాట్లాడుతుంటే, ఆ గోలలో నుంచి ఎవరినో బతిమాలుతున్నట్లు ఓ దీనమైన స్వరం. ఎక్కడో విన్నట్టు, సుపరిచితమైన గొంతు అనిపించింది నాకు. ఏదో అనుమానం కూడా ఇంతింతై, వటువింతై అన్నట్టు పెరిగిపోసాగింది. కారుని ఒక పక్కకి ఆపాడు నిఖిల్‌. ఇద్దరం కారు దిగాం. ఆతతగా జనాలను తోసుకుని వెళ్ళాను. అదిరిపడ్డాను. నా ఊహ నిజమే. తను సువర్ణ. అక్కడి దశ్యాన్ని చూసిన వెంటనే స్పందించాడు నిఖిల్‌.
”ఆగండి..! ఎందుకు ఆమెని బలవంతంగా లాక్కెళ్తున్నారు” పోలీస్‌ వంక చూస్తూ నిఖిల్‌.
”ఈమె మీకు తెలుసా? పురిటి బిడ్డని అమ్మకానికి పెట్టింది. అది చట్టరీత్యా నేరం. అందుకే స్టేషన్‌కి తీసుకెళుతున్నాం” కోపం, దర్పం మేళవించిన గొంతుకతో అన్నాడు ఆ పోలీస్‌ అధికారి. సంకలో బిడ్డనెత్తుకుని ఉన్న సువర్ణని లేడీ కానిస్టేబుల్‌ లాక్కెళుతోంది.
మమ్మలిని చూడగానే ”వినీతక్కా..” అంటూ బిడ్డతో సహా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చుట్టుకుంది. ఇన్ని రోజుల తర్వాత సువర్ణని అంత దీనమైన పరిస్థితిలో చూస్తాననుకోలేదు. తెలీకుండానే నా కళ్ళు కూడా నీటి చెలమలైనాయి. పాలుగారే పసిబిడ్డని చేతుల్లోకి తీసుకున్నాను. లోకం పోకడ తెలీని ఆ పసిది గాఢ నిద్రలో ఉంది మరో లోకంలో.
”ఈమె మాకు బాగా తెలుసు. ఆమె బిడ్డను అమ్మకుండా చూసే పూచి మాది. ఆమెని వదిలి పెట్టండి. లేకుంటే మీ పై అధికారులచేత చెప్పిస్తాను”. కాస్త కాఠిన్యం, మరికాస్త మార్దవం కలగలిసిన నిఖిల్‌ స్వరానికి ఆ పోలీస్‌ అధికారి కొంచెం దిగివచ్చాడు. మా పూచికత్తు మీద వాళ్ళు సువర్ణని విడిచిపెట్టారు. చిలుకూరు వెళ్ళి బాలాజి దర్శనం చేసుకుని ఊరికి బయలుదేరాం సువర్ణ, తన చిన్నారి పాపతో సహా.
ఇంటికొచ్చేసాం. హార్లిక్స్‌ కలిపి సువర్ణకి ఇచ్చాను.ఏ వేళప్పుడు ఏం తిన్నదో ఏమో కానీ హార్లిక్స్‌ కాస్త వేడిగా ఉన్నా గట గట తాగేసింది. ఎక్కిళ్ళు తగ్గి కాస్త నిమ్మళించి, కొంగు కప్పుకుని బిడ్డకి పాలు పట్టింది.
”ఇప్పుడు చెప్పు సువర్ణా.. బిడ్డను ఎందుకు అమ్మాలనుకున్నావు..?” సూటిగా అడిగిన నా ప్రశ్నకి మళ్ళా ”అక్కా” అంటూ బావురుమంది.
”ఈ తడవ కూడా నాకు ఆడపిల్లనే పుట్టే. ఆడపిల్లతోని ఇంటికి వస్తే ఇద్దరిని చంపేసి మళ్ళీ పెళ్లిచేసుకుంటానన్నాడు నా మొగుడు. అత్త వాడికి వంత పాడింది. ఈ బిడ్డతోని ఇంటికి వెళితే వాళ్ళు అన్నంత పని జేస్తరని భయమైంది. బిడ్డ పుట్టిన మూడో రోజునే దవాఖాన నుంచి బయటకు తొలిర్రు నన్ను. పుట్టింటికి పోదమంటే నాకు అవ్వ, అయ్యా ఇద్దరు లేరు. ఏం చేయనికి అర్ధం కాక ఇదిగో ఈ బస్టాప్‌ కొచ్చిన. అక్కడ ఎవలో పిల్లలవని వాళ్ళు పైసలిచ్చి బిడ్డను తీసుకుంటామన్నరు. అందుకని” అని ఆగింది.
”అందుకని కన్న బిడ్డని పైసలికి అమ్ముకుంటావా..! ప్రాణమెట్ల ఒప్పిందే నీకు” కోపంతో బొంగురు పోయింది నా గొంతు.
”బిడ్డతోని ఇంటికి పొతే చంపేస్తరని అట్లా జేషిన అక్కా.. బిడ్డనమ్ముడు నాకు ఇస్టమైత లేదు. నేను పెంచలేను. ఎక్కడో ఓ చోట మంచిగా పెరుగుతుందని, ఇంక ఏమి చేయనికి తోచక బిడ్డను అమ్ముదామనుకున్న. పైసలు కోసం గాదు” వెక్కుతూ బిడ్డను గుండెకు అదుముకుంది .
నిఖిల్‌, నేను ఒకరిముఖం ఒకరు చూసుకున్నాం. ఒకరి భావం ఒకరికి అర్ధం అయింది.
”మరి సువర్ణా.. నీ బిడ్డని నాకు దత్తత ఇస్తావా..? మాకు ఆడపిల్ల కావాలని చాలా ఇష్టం. కానీ ఇక పిల్లలను కనే అదష్టం నాకిక లేదు. నీ బిడ్డని మా బిడ్డగానే ప్రేమగా చేసుకుంటాము. ఆలోచించి చెప్పు. నీకు ఇష్టమై, మా మీద నమ్మకం ఉంటేనే ఇవ్వు. నీకు ఇష్టమైనన్ని రోజులు నువ్వు మాతోనే ఉండు” ఆశగా తన చూస్తూ అడిగాను.
వెంటనే ఆ కళ్ళల్లో మెరుపులుమెరిసాయి. ”అక్కా.. మీరు నా బిడ్డను పెంచుతమంటే, అంతకంటే అదష్టం ఏముండె నాకు. బిడ్డను మంచిగ పెంచి, సదివించడం నాతోని కాదు. నా దగ్గర కన్న మీ దగ్గరే నా బిడ్డ మంచిగా పెరుగుతుంది. మీ పెద్ద మనసులకి ఎంత మొక్కినా తక్కువే” అంటూ ఆ మూడు రోజుల పసిగుడ్డుని నా ఒడిలో పెట్టింది సువర్ణ. అప్పటిదాకా లోపల ఆడుకుంటున్న ప్రణవ్‌ హాల్లోకి వచ్చి నా ఒడిలో పాపని చూసి ”అబ్బా.. ఈ పాపా చాలా బాగుంది అమ్మ. ఇలాంటి చెల్లి నాకు ఉంటే ఎంత బాగుంటుందో” అన్నాడు ఆ చిన్నారి లేత బుగ్గని మెల్లగా నిమురుతూ.
”ఇలాంటి చెల్లి కాదు ప్రణవ్‌. ఈ పాపా నీకు నిజంగా చెల్లెనే” అన్నాను నవ్వుతూ.
”అవునా..! ఈ చిన్న పాపా నాకు చెల్లె నా. అయితే చెల్లె కు ఏం పేరు పెడదాం అమ్మా” అంటూ వాడు సంబరంగా. ఈ పసిపాప రాకతో మా ఇంట్లో కొత్త సందడి, మా మనస్సులో కొండంత ఆనందం వెల్లివిరిసాయి. ఇంతకాలం కూడుకట్టుకున్న నిరాశ దూదిపింజలా ఎగిరిపోయింది. మళ్ళీ నేను ఓ చిన్నారికి అమ్మనవుతున్నాననే సంబరం అంబరాన్నంటింది.
”నా ఒడిలో పడుకుని నిద్రలో ఉన్న ఆ చిన్నారి తన స్వప్నలోకంలో ఏ తియ్యటి కల కనిందో ఏమో! ఆ చిన్ని పెదవులు విచ్చుకుని, బుగ్గలు సొట్టలు పడేటట్టు నవ్వింది. ఆ నవ్వుని చూసి సువర్ణ నవ్వింది. వాళ్లిద్దరినీ చూసి మేము నవ్వాము. పచ్చ రంగులో మెరిసిపోతున్న ఆ చిన్నారి బతుకమ్మలో పేర్చిన చిట్టి చామంతిలా అనిపించి ”పాపకి ‘చామంతి’ అని పేరు పెడదాం” అంటూ గుండెలకు హత్తుకున్నాను తనివితీరా తల్లినై.
రోహిణి వంజరి
9000594630